Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఆ క్షణంలో

శతకం పూర్తి కాగానే గాల్లోకి ఎగురుతూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్న కోహ్లి.. సాధించాను అన్నట్లుగా వెంటనే మోకాళ్లపై కూలబడ్డాడు. లేచి స్టాండ్స్‌లో ఉన్న తన హీరో సచిన్‌కు.

Updated : 16 Nov 2023 07:56 IST

తకం పూర్తి కాగానే గాల్లోకి ఎగురుతూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్న కోహ్లి.. సాధించాను అన్నట్లుగా వెంటనే మోకాళ్లపై కూలబడ్డాడు. లేచి స్టాండ్స్‌లో ఉన్న తన హీరో సచిన్‌కు.. రెండు చేతులు పైకెత్తి, కిందకు వంగుతూ కోహ్లి అభివాదం చేశాడు. అనంతరం తనకు గాల్లో ముద్దులు విసురుతున్న భార్య అనుష్కకు తిరిగి కోహ్లి గాల్లో ముద్దులు పంపించాడు.

ఏ ప్రత్యర్థిపై ఎన్ని

 • శ్రీలంక- 10,  వెస్టిండీస్‌- 9,
 • ఆస్ట్రేలియా- 8,  కివీస్‌- 6,
 • బంగ్లాదేశ్‌- 5, దక్షిణాఫ్రికా- 5,
 • పాకిస్థాన్‌- 3, ఇంగ్లాండ్‌- 3,
 • జింబాబ్వే- 1

శతకాలు టాప్‌-5 బ్యాటర్లు

 • కోహ్లి- 50 (279 ఇన్నింగ్స్‌)
 • సచిన్‌- 49 (452)
 • రోహిత్‌- 31 (253)
 • పాంటింగ్‌- 30 (365)
 • జయసూర్య- 28 (433)

కలలా ఉంది

- విరాట్‌

గొప్ప వ్యక్తి ఇప్పుడే నన్ను అభినందించాడు. ఇదంతా కలలా ఉంది. కానీ ఇది వాస్తవం. ఇవన్నీ నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. కెరీర్‌లో ఇక్కడి వరకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది ప్రపంచకప్‌ సెమీఫైనల్‌. అన్నీ కలిసొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నాకు ఒక పాత్రను అప్పగించారు. దానికి న్యాయం చేసేందుకు  శ్రమిస్తున్నా.  


హృదయాన్ని తాకావు

- సచిన్‌

భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో మొదటిసారి కలిసినప్పుడు నా కాళ్లు మొక్కాల్సిందిగా తోటి ఆటగాళ్లు నిన్ను ఆట పట్టించారు. ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయా. కాని అనతికాలంలోనే నీ అభిరుచి, నైపుణ్యంతో నా హృదయాన్ని తాకావు. ఆ యువకుడు ఇప్పుడీ స్థాయికి చేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ లాంటి అత్యున్నత వేదికపై ఒక భారతీయుడు నా రికార్డును బద్దలు కొట్టడం.. అదీ నా సొంత మైదానం కావడం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.


విరాట్‌కు ప్రధాని ప్రశంస

న్డేల్లో 50వ శతకంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్‌ కోహ్లిపై  ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ రోజు కోహ్లి కేవలం 50వ వన్డే శతకం మాత్రమే చేయలేదు. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్ఠత, పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడు. అతనికి అంకితభావం, అసామాన్య ప్రతిభకు ఈ మైలురాయి నిదర్శనం. ఈ మ్యాచ్‌తో పాటు ఈ టోర్నీలో షమి బౌలింగ్‌ కొన్ని తరాల పాటు గుర్తుంటుంది’’ అని మోదీ అన్నారు. మరోవైపు మైiక్రోసాఫ్ట్‌ వార్షిక సమావేశం ‘ఇగ్నైట్‌’ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో సత్య నాదెళ్ల భారత జట్టును అభినందనలతో ముంచెత్తారు.


 • 5 కోట్లు- ఈ సెమీస్‌ మ్యాచ్‌ను ఓ సమయంలో హాట్‌స్టార్‌లో ఏకంగా 5 కోట్ల మంది వీక్షించారు. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు. కోహ్లి సెంచరీ సమయంలో 4.6 కోట్ల మంది చూశారు.
 • 8- ఈ ప్రపంచకప్‌లో కోహ్లి 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇన్నింగ్స్‌లు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధికంగా 50కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ (2003లో 7), షకిబ్‌ (2019లో 7)ను అతను దాటాడు.
 • 3- ఒకే ప్రపంచకప్‌లో వరుసగా రెండు శతకాలు చేసిన భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానం. రాహుల్‌ ద్రవిడ్‌ (1999), రోహిత్‌ శర్మ (2019) ముందున్నారు.
 • 5- కోహ్లి ప్రపంచకప్‌ సెంచరీల సంఖ్య. అత్యధిక ప్రపంచకప్‌ శతకాల జాబితాలో సంగక్కర, పాంటింగ్‌తో కలిసి కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ (7), వార్నర్‌, సచిన్‌ (6) ముందున్నారు.
 • 51- ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా గేల్‌ (49)ను దాటిన రోహిత్‌ కొట్టిన సిక్సర్లు. ఈ సారి టోర్నీలో ఇప్పటికే 28 సిక్సర్లు కొట్టిన రోహిత్‌.. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా గేల్‌ (2015లో 26) రికార్డునూ తిరగరాశాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని