IND vs NZ: మూడు రికార్డుల ముంగిట విరాట్ కోహ్లీ.. అవన్నీ సచిన్‌వే!

వన్డేల్లో అరుదైన ఘనత సాధించేందుకు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్క శతకం దూరంలో ఉన్నాడు. అలాగే ఇలాంటి మూడు రికార్డులకు కోహ్లీ చేరువగా ఉన్నాడు. 

Updated : 15 Nov 2023 12:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే ప్రపంచకప్‌లో మూడు రికార్డులకు చేరువగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 9 మ్యాచుల్లో 99 సగటుతో 594 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలూ ఉన్నాయి. లీగ్ స్టేజ్‌లో కివీస్‌పై 95 పరుగులు సాధించి భారత విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే, వరల్డ్‌ కప్‌ సెమీసుల్లో కోహ్లీ గొప్ప గణాంకాలు నమోదు చేయలేదు. కానీ, ఈసారి ఫామ్‌ను చూస్తుంటే మూడు రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అవన్నీ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ పేరిట ఉన్నవే కావడం విశేషం.

శతకాల ‘ఫిఫ్టీ’: విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 49 వన్డే సెంచరీలు సాధించాడు. సచిన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. లీగ్‌ స్టేజ్‌ చివరి మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌పై హాఫ్‌ సెంచరీ కొట్టినా.. దానిని శతకంగా మార్చలేకపోయాడు. అలాగే కివీస్‌పైనా లీగ్‌ స్టేజ్‌లో త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా శతకం బాదేయాలని అభిమానుల ఆకాంక్ష. దీంతో సెంచరీల ‘ఫిఫ్టీ’ కూడా పూర్తవుతుంది.

వరల్డ్‌ కప్‌లో అత్యధిక పరుగులు: ఒక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌ సచిన్‌ తెందూల్కర్‌. 2003 ఎడిషన్‌లో సచిన్ 673 పరుగులు చేశాడు. ఆ రికార్డును అధిగమించే అవకాశం కోహ్లీకి ఉంది. ఇప్పుడు 594 పరుగులతో ఉన్న కోహ్లీ.. కివీస్‌పై మంచి ఇన్నింగ్స్‌ ఆడితే సచిన్‌ను అధిగమించేస్తాడు. టాప్‌ స్కోరర్‌గా మారేందుకు మాత్రం క్వింటన్ డికాక్‌, రచిన్‌ రవీంద్ర నుంచి కోహ్లీకి పోటీ ఎదురు కానుంది. 

ఒక్క హాఫ్ సెంచరీ కొడితే..: విరాట్ కోహ్లీ ఈ వరల్డ్‌ కప్‌లో ఏడుసార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో రెండింటిని సెంచరీలుగా మలిచాడు. దీంతో సచిన్‌ (7), షకిబ్ అల్ హసన్‌ (7)తో కలిసి సంయుక్తంగా.. ఒక వరల్డ్‌ కప్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ సాధిస్తే వారిద్దరిని విరాట్ అధిగమించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు