Virat Kohli: వన్డే సిరీస్‌.. విరాట్‌ దూకుడును ఆసీస్‌ అడ్డుకోగలదా..?

టెస్టు సిరీస్‌లు ముగిశాయి. ఇక రాబోయే మూడు నెలలు వన్డేలు, టీ20లదే హవా. తొలుత ఆసీస్‌తో భారత్ మూడు వన్డేల (IND vs AUS) సిరీస్‌ను ఆడనుంది. ఈ క్రమంలో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడును ఆసీస్‌ ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాలి.

Updated : 16 Mar 2023 17:19 IST

ఇంటర్నెట్ డెస్క్: జట్టులో స్థానం కోసం పోటీ లేదు.. శతకం చేయాలనే ఒత్తిడి లేదు.. కెప్టెన్సీ భారం అసలే లేదు. తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. ఇదీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) పరిస్థితి. శుక్రవారం నుంచి ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మరోసారి విరాట్ విజృంభించాలని అభిమానులు కోరుతున్నారు. మరి విరాట్‌ను ఆసీస్‌ అడ్డుకోగలదో లేదో చూడాలి.  ఈలోగా ఆసీస్‌పై విరాటుడి దండయాత్ర ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.. 

దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓర్పుగా సహనంతో ఉన్న విరాట్ ఆరు నెలల కిందట టీ20ల్లో సెంచరీ..  మూడు నెలల ముందు  వన్డేల్లో శతకం.. ఇప్పుడు టెస్టుల్లోనూ సెంచరీ కొట్టి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తనపై ఉన్న కొండంత భారాన్ని వదిలించుకున్నాడు. ఇక రాబోయే కాలంలో సరికొత్త విరాట్‌ను చూడటం తథ్యం.. అందుకు ఆసీస్‌తో వన్డే సిరీస్‌ (IND vs AUS) తొలి వేదికగా నిలవనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టుపై విరాట్ రికార్డు అలాంటిది మరి. విరాట్ ఆసీస్‌పై 43 వన్డేల్లో 54.81 స్ట్రైక్‌రేట్‌తో 2,083 పరుగులు సాధించాడు. ఇందులో 8 శతకాలు ఉండటం విశేషం. సచిన్ తెందూల్కర్ కంటే కేవలం ఒక్క సెంచరీ మాత్రమే తక్కువ. విరాట్ ఫామ్‌ను బట్టి ఇప్పుడీ సిరీస్‌లోనే సచిన్‌ను అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత పది వన్డే ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు ఉన్నాయి.

భారత్‌లో మరీ ఎక్కువ.. 

స్వదేశంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసీస్‌పై భారీగా చెలరేగిపోతాడు. అందుకు సాక్ష్యం ఈ గణాంకాలు.. ఇక్కడ ఆసీస్‌పై 23 వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ 59.95 సగటుతో ఐదు శతకాలతో 1,199 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు అన్ని దేశాల మీద 107 వన్డేల్లో 58.87 సగటుతో 5,358 పరుగులు చేశాడు. అందుకే స్టీవ్‌ స్మిత్ నాయకత్వంలోని ఆసీస్‌ (కమిన్స్‌ అందుబాటులో ఉండటం లేదు) విరాట్ కోహ్లీపై ఓ కన్నేయాలి. గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీతో వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. శ్రీలంక మీద చెలరేగిపోయాడు. మూడు వన్డేల్లో ఏకంగా రెండు సెంచరీలు బాదేశాడు. 

జంపా బౌలింగ్‌లోనే కాస్త.. 

ఉపఖండ పిచ్‌లపై విరాట్ కోహ్లీకి  అడ్డు కట్ట వేయడం కష్టంతో కూడుకున్నదే. కానీ, ఆసీస్ బౌలర్ ఆడమ్‌ జంపా (Virat vs Adam Zampa) బౌలింగ్‌లో మాత్రం విరాట్‌ తడబాటుకు గురవుతున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో 16 మ్యాచుల్లో 5సార్లు విరాట్‌ను జంపాపెవిలియన్‌కు చేర్చాడు. అందుకే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్మిత్‌ తప్పకుండా ఆడమ్‌ జంపాను ప్రయోగిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదని క్రికెట్‌ విశ్లేషకులు ఘంటాపథంగా చెప్పారు. మిచెల్‌ స్టార్క్‌ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. అయితే, విరాట్‌ను త్వరగా ఔట్‌ చేస్తేనే ఫలితం ఉంటుంది. క్రీజ్‌లో పాతుకుపోయేలా అవకాశం ఇస్తే మాత్రం భారీ ఇన్నింగ్స్‌ ఆడేస్తాడు. 

సచిన్‌ రికార్డుకు చేరువగా.. 

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ రికార్డులను దాటాలంటే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి ‘వంద’ శతకాలను సచిన్‌ సాధించగా.. విరాట్ కోహ్లీ 75 వద్ద ఉన్నాడు. కానీ, ఓ రికార్డుకు మాత్రం అత్యంత చేరువగా ఉన్నాడు. అదే వన్డేల్లో సెంచరీల రికార్డు. అవునండి.. సచిన్‌ 49 శతకాలు చేయగా.. విరాట్ 46 సెంచరీలతో వెనుకనే ఉన్నాడు. మరో నాలుగు చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. ఇప్పుడున్న ఫామ్‌ను బట్టి ఆసీస్‌తో జరిగే మూడు వన్డేల్లో సెంచరీలు సాధించినా సాధించగల సత్తా విరాట్ సొంతం. అప్పుడు సచిన్‌తో సమంగా నిలుస్తాడు. ఎలాగూ ఈ ఏడాది ఆసియా కప్ (Asia cup 2023), వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఉన్నాయి. కాబట్టి, ఆ రికార్డు మాత్రం విరాట్ కొట్టేయడం ఖాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని