Virat: అప్పుడు డకౌట్‌.. ఇప్పుడు సెంచరీ.. కోహ్లీ ‘మైలురాళ్ల’ ఇన్నింగ్స్‌లు ఇలా!

అంతర్జాతీయ స్థాయిలో 500, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన పదో ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు సృష్టించాడు. ఇదే క్రమంలో శతకం సాధించి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. 

Published : 22 Jul 2023 13:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పరుగుల వీరుడు, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీకి విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు ఎంతో ప్రత్యేకం. కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌.. ఈ మైలురాయి మ్యాచ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే శతకం నమోదు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో 121 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే.. గతంలో తన తొలి, 100, 200, 300, 400వ..  ఇలా స్పెషల్‌ మ్యాచ్‌ల్లో ఈ రన్‌ మెషీన్‌ ప్రదర్శన ఎలా ఉందో చూద్దామా..

తొలి మ్యాచ్‌లో ఇలా..

జాతీయ జట్టు తరఫున ఆడాలనేది ప్రతి ఒక్కరి కల. విరాట్ కోహ్లీకి ఈ అవకాశం 2008లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా వచ్చింది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ ఆ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం అలా జరిగింది.

100వ అంతర్జాతీయ మ్యాచ్‌..

ఆసియా కప్‌లో భాగంగా మార్చి 16, 2012లో బంగ్లాదేశ్‌తో ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 289/5 స్కోరు సాధించింది. ఇందులో కోహ్లీ 82 బంతుల్లో 66 పరుగులు చేశాడు.

200వ మ్యాచ్‌..

నవంబర్‌ 6, 2014లో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మ్యాచ్‌ కోహ్లీకి 200వది. అహ్మదాబాద్‌లో జరిగిన  ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. ధోనీ అందుబాటులో లేకపోవడంతో స్టాండ్‌బై కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో 49 (44) పరుగులు బాదాడు. ఇదే సిరీస్‌లో రోహిత్‌ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(264) నమోదు చేశాడు.

300వ మ్యాచ్‌..

విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్‌ అనంతరం.. 300వ మ్యాచ్‌ ఆడటానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. శ్రీలంక పర్యటనకు వెళ్లిన కోహ్లీ ఆగస్టు 24, 2017లో కెరీర్‌లో 300వ మ్యాచ్‌ ఆడాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ సందర్భంగా రెండో మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులకే విరాట్ పెవిలియన్‌కు చేరాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 109/0 నుంచి 131/7కి పతనమైంది. అయితే ఎనిమిదో వికెట్‌కు ధోనీ -భువనేశ్వర్‌ శతక భాగస్వామ్యంతో టీమ్‌ఇండియా గట్టెక్కింది. 

తెలుగు గడ్డపైనే 400వ మ్యాచ్.. 

తన కెరీర్‌లో అత్యంత చేదు జ్ఞాపకంగా 400వ మ్యాచ్‌ నిలుస్తుందనడంలో అనుమానం లేదు. అదీనూ తెలుగు గడ్డపైనే కావడం విశేషం. విశాఖపట్నం వేదికగా 2019 డిసెంబర్‌ 18న విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఆ పిచ్‌పై 38వ ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కీరన్‌ పొలార్డ్‌ వేసిన తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని