World Cup 2023 : అప్పుడు సచిన్‌లానే ఇప్పుడు విరాట్‌.. అతడి కోసం వరల్డ్‌ కప్‌ గెలవాలి : సెహ్వాగ్‌

2011లో సచిన్‌ కోసం తాము ప్రంపంచకప్‌ గెలిచామని వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) చెప్పాడు. ఇప్పుడు విరాట్‌ కోహ్లీ కోసం వరల్డ్‌కప్‌ గెలవాలని టీమ్‌ఇండియాను కోరాడు.

Published : 28 Jun 2023 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  1983లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్‌ను భారత్‌(Team India)కు అందించి కపిల్‌ సేన చరిత్ర లిఖించింది. ఆ తర్వాత 28 ఏళ్లకు.. ధోనీ(Ms dhoni)సేన రెండోసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడి భారత అభిమానుల కలను నెరవేర్చింది. ఇప్పుడు 12 ఏళ్ల అనంతరం మరోసారి స్వదేశం వేదికగా ఈ మెగాటోర్నీ(World Cup 2023) జరగనుంది. ఈ నేపథ్యంలో మరోసారి కప్‌ గెలిచి.. సుదీర్ఘకాలంగా ఉన్న ఐసీసీ ట్రోఫీల కొరతను తీర్చాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సెహ్వాగ్‌(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అప్పుడు తాము సచిన్‌(Sachin Tendulkar) కోసం ప్రపంచకప్‌ గెలిచామని.. ఇప్పుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) కోసం కప్‌ గెలవాల్సిన అవసరముందని సెహ్వాగ్‌ చెప్పాడు. ‘‘మేం అప్పుడు సచిన్‌ తెందూల్కర్‌ కోసం ప్రపంచకప్‌ ఆడాం.. గెలిచాం. దీంతో దిగ్గజ క్రికెటర్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పాం. అప్పుడు సచిన్‌ ఎలానో.. ఇప్పుడు కోహ్లీ అలాగే ఉన్నాడు. విరాట్‌ ఆట, మాట తీరు, చూపులు, ఆటపై అతడికుండే మక్కువ.. ఇవన్నీ సచిన్‌ను తలపిస్తాయి. అందుకే అతడి కోసం ప్రపంచకప్‌ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎల్లప్పుడూ వంద శాతం కంటే ఎక్కువ ప్రదర్శన ఇస్తాడు. కోహ్లీ కూడా ఈ ప్రపంచకప్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడని నేను అనుకుంటున్నాను’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మంది మీ ఆటను వీక్షిస్తారు. కోహ్లీకి పిచ్‌ల పరిస్థితులు ఏంటో తెలుసు. అతడు తప్పకుండా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడతాడు. భారత్‌కు ప్రపంచకప్‌ అందించేందుకు ఉత్తమంగా పొరాడతాడు’ అని కోహ్లీపై తనకున్న నమ్మకాన్ని సెహ్వాగ్‌ వివరించాడు.

ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎదురుచూసే చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌(IND vs PAK) అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. దాయాదుల మధ్య పోరులో భారత్‌ ఫేవరెట్‌ అని.. తప్పకుండా రోహిత్‌ సేన విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని సెహ్వాగ్‌ వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఒత్తిడిని అధిగమించడంతో భారత్‌ మెరుగ్గా ఉందని చెప్పాడు. ‘‘టీమ్‌ఇండియా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలదు. ఇక పాక్‌ పరిస్థితి అలా కాదు. వారు ఇప్పటి వరకూ ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌పై గెలవలేదు’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని