Virat Kohli: ఆర్‌సీబీ ఎగ్జిట్‌.. కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్‌సీబీ (RCB) జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది. దీంతో ఆ జట్టు కీలక ఆటగాడు, టీమిండియా మాజీ సారథి కోహ్లీ (Virat Kohli) సోషల్‌మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

Published : 23 May 2023 13:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ సాలా కప్‌ నమదే’ అన్న కల.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore)కు ఈసారీ తీరలేదు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ (RCB) మెరుగ్గానే రాణించినప్పటికీ.. లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) శతకం సాధించినా.. గుజరాత్‌ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ చేశాడు.

‘‘ఈ సీజన్‌లో మెరుగ్గా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ మనం లక్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయాం. నిరాశ చెందినప్పటికీ.. మనం ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు అడుగడుగునా అండగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటాం. మా కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌, మా జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. మరింత బలంగా తిరిగొస్తాం’’ అని కోహ్లీ (Virat Kohli) రాసుకొచ్చాడు. థాంక్యూ బెంగళూరు అంటూ ఫొటోలు షేర్‌ చేశాడు.

ఈ సీజన్‌లో కోహ్లీ (Virat Kohli) అద్భుత ప్రదర్శన చేశాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌పై సెంచరీ బాదాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ శతకాలున్నాయి. తాజా సీజన్‌లో ఇప్పటివరకు డుప్లెసిస్‌, శుభ్‌మన్‌ గిల్‌ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌ కోహ్లీనే కావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని