Virat Kohli: అదే అసలైన పోటీ: విరాట్ ట్వీట్‌ వైరల్‌

విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆటలోనూ దూకుడే.. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే సై అంటూ ఢీకొడతాడు. అద్భుతంగా ఆడితే అంతే ప్రశంసలూ కురిపిస్తాడు.

Published : 10 May 2023 18:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ ట్విటర్‌లోకి వచ్చేశాడు. మంగళవారం రాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ (MI vs RCB) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్‌ యాదవ్ (83) అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబయి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరి నిరాశ పరిచాడు. అంతకుముందు బెంగళూరు ఆడిన మ్యాచుల్లోనూ విరాట్ స్ట్రైక్‌రేట్‌ మరీ తక్కువగా ఉంది. దీంతో సోషల్‌ మీడియాలో విమర్శలూ వచ్చాయి. ఈ క్రమంలో విరాట్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం పెట్టాడనేగా మీ డౌటు..?

‘‘పోటీతత్వం అనేది మన మదిలోనే ఉంటుంది. అయితే, వాస్తవానికి ఎల్లప్పుడూ మనలో మనమే సంఘర్షణకు గురవుతాం’’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. అయితే, ముంబయితో మ్యాచ్‌లో ఒక్కపరుగే విరాట్ ఔటైన నేపథ్యంలో లఖ్‌నవూ పేసర్ నవీనుల్‌ హక్‌ ‘స్వీట్ మ్యాంగోస్’ అని పోస్టు పెట్టాడు. దానికి కౌంటర్‌గానే కోహ్లీ ఈ ట్వీట్ చేసిన అభిమానులు భావిస్తున్నారు. నవీనుల్‌ హక్, గౌతమ్‌గంభీర్‌తో విరాట్ వాగ్వాదం నేపథ్యంలో వీరి మధ్య ట్విటర్‌ వార్‌ కూడా కొనసాగిన విషయం తెలిసిందే. 

సూర్య కంప్యూటర్‌లో ఆడినట్లు ఉంది: గంగూలీ

సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ను టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (దాదా) అభినందించాడు. మైదానం నలువైపులా షాట్లు కొట్టిన తీరు అద్భుతమని కొనియాడాడు. ‘‘ప్రపంచంలోనే టీ20 ప్లేయర్లలో సూర్యకుమార్‌ అత్యుత్తమం. అతడి ఆటను చూస్తే కంప్యూటర్‌లో బ్యాటింగ్‌ చేసినట్లు ఉంది’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. దాదా చేసిన ట్వీట్‌కు ముంబయి ఇండియన్స్‌ ప్రతిస్పందించింది. సూర్యకుమార్‌ బ్యాటింగ్‌ను విరాట్‌ కూడా అభినందించాడు. సూర్య 83 పరుగుల వద్ద ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్.. సూర్యతో చేయి కలిపి ప్రశంసించాడు. ఆ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని