Rajasthan Vs Bengaluru: రాజస్థాన్‌పై విరాట్ దూకుడు కొనసాగేనా? బెంగళూరు స్టార్‌కు కలసిరాని జైపుర్‌

నాణ్యమైన బౌలింగ్‌ లేకపోవడం వల్ల కలిగే నష్టం బెంగళూరును చూస్తే అర్థమవుతోంది. బ్యాటింగ్‌లో ఎక్కువగా విరాట్‌పైనే (Virat Kohli) ఆ జట్టు ఆధారపడుతోంది. అయితే, జైపుర్‌ వేదిక మ్యాచ్‌ కావడంతో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది చూడాలి. 

Published : 06 Apr 2024 16:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టాప్‌ స్కోరర్. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్.. అయినా తన జట్టు బెంగళూరు మాత్రం వరుసగా ఓటములను చవిచూస్తోంది. ఇవాళ జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్‌కు ఈ మైదానంలో గొప్ప గణాంకాలు లేవు. ఈక్రమంలో బెంగళూరు హ్యాట్రిక్‌ ఓటమి నుంచి బయటపడుతుందా? రాజస్థాన్‌ వరుస విజయాలకు బ్రేక్‌ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

వరుసగా మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ రెండో స్థానంలో ఉంది. మరోవైపు తన సొంత మైదానంలో వరుసగా రెండు ఓటములను చవిచూసిన బెంగళూరు అట్టడుగు నుంచి మూడులో కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ (4 మ్యాచుల్లో 203 పరుగులు) బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా.. అతడికి జట్టు నుంచి సరైన సహకారం లభించడం లేదు. అప్పుడప్పుడు లామ్రోర్, అనుజ్‌ రావత్, దినేశ్‌ కార్తిక్‌ బ్యాటింగ్లో మెరుపులు తప్పితే.. నిలకడగా ఆడేవారే కరవయ్యారు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ విషయంలో అభిమానులకు ఆందోళన కలిగించే విషయం.. జైపుర్‌లో అతడికి మెరుగైన గణాంకాలు లేవు. జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అదరగొట్టేసిన కోహ్లీ.. ఐపీఎల్‌లో మాత్రం పేలవ ప్రదర్శనే చేశాడు. భారత్‌ తరఫున కేవలం 3 మ్యాచుల్లోనే 195 పరుగులు చేశాడు. అందులో అక్టోబర్‌ 2013లో 52 బంతుల్లోనే సెంచరీ చేసిన ఫీట్‌ కూడా ఉంది. ఐపీఎల్‌లో మాత్రం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. కేవలం 149 పరుగులే చేశాడు. చివరిసారిగా రాజస్థాన్‌పై ఇదే మైదానంలో 19 బంతుల్లో 18 పరుగులు చేసి నిరాశపరిచాడు. దేశంలో అన్ని మైదానాల్లోకెల్లా ఇక్కడే తక్కువ యావరేజ్‌ ఉండటం గమనార్హం. అయితే, ఇప్పుడు ఉన్న ఫామ్‌ను బట్టి ఎలాంటి పిచ్‌పైనైనా అదరగొట్టే విరాట్‌ గత గణాంకాలను పట్టించుకోడు. 

రాజస్థాన్‌ పేసర్ సందీప్‌ శర్మదే ఆధిపత్యం

విరాట్ కోహ్లీపై రాజస్థాన్‌ పేసర్ సందీప్ శర్మ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఇరువురు 15 మ్యాచుల్లో తలపడగా.. కోహ్లీ 67 బంతుల్లో 87 పరుగులు చేశాడు. కోహ్లీని సందీప్‌ 7 సార్లు ఔట్‌ చేయడం విశేషం. సందీప్ బౌలింగ్‌లో విరాట్ బ్యాటింగ్‌ యావరేజ్ 12.42 మాత్రమే. ఇందులో 25 బంతులకు పరుగులేమీ రాలేదు. అలాగే బెంగళూరుపై 26 వికెట్లు తీసిన ఘనత సందీప్‌ సొంతం. చాహల్‌, అశ్విన్‌, ట్రెంట్ బౌల్ట్, అవేశ్‌ ఖాన్‌ వంటి బౌలర్లను ఎదుర్కోడానికి బెంగళూరు బ్యాటర్లు తీవ్ర సాధన చేయాల్సిందే. రాజస్థాన్‌ బ్యాటింగ్‌ విభాగం అత్యంత పటిష్ఠమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్‌ పరాగ్‌తో కూడిన టాప్ ఆర్డర్‌ను త్వరగా ఔట్‌ చేయడం బెంగళూరు బౌలింగ్‌ విభాగానికి కష్టమే. గతంలో రాజస్థాన్‌పై మంచి ప్రదర్శనే చేసిన సిరాజ్‌ ఇప్పుడు పెద్దగా ఫామ్‌లో లేడు.

పిచ్‌ పరిస్థితి

జైపుర్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గత రెండు మ్యాచ్‌ల గణాంకాలను బట్టి క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రతీ మ్యాచ్‌లోనూ 180+ స్కోరు నమోదైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించడం గమనార్హం. మ్యాచ్‌లో పరుగులు రాబట్టడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. దిల్లీ, లఖ్‌నవూ జట్లను ఇక్కడే రాజస్థాన్‌ ఓడించింది. ఇప్పుడు సొంత మైదానంలో హ్యాట్రిక్‌ విజయంపై సంజూ శాంసన్‌ సేన కన్నేసింది.

తుది జట్లు (అంచనా)

రాజస్థాన్‌: జోస్‌ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్‌/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్‌ హెట్‌మయేర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, నాండ్రీ బర్గర్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్

బెంగళూరు: విరాట్ కోహ్లీ, పాఫ్ డుప్లెసిస్‌ (కెప్టెన్), రజిత్‌ పటీదార్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్‌ రావత్ (వికెట్ కీపర్), దినేశ్‌ కార్తిక్, మయాంక్‌ దగర్, సిరాజ్‌, టోప్లే, యశ్‌ దయాల్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని