ఆ స్థానంలో మరో బ్యాటర్‌ వచ్చి ఉంటే..? లఖ్‌నవూ వ్యూహాలపై సెహ్వాగ్ మండిపాటు

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ అనుసరించిన వ్యూహాలపై సెహ్వాగ్‌ మండిపడ్డాడు.

Updated : 09 May 2023 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-16 (IPL)లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌ (GT)తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) 56 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదన్నాడు. మూడో స్థానంలో దీపక్‌ హుడా (Deepak Hooda)ను పంపడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ స్థానంలో అతడికి బదులుగా ఫామ్‌లో ఉన్న మరో బ్యాటర్‌ను పంపాల్సిందన్నాడు.

‘‘పది ఓవర్లకు లఖ్‌నవూ స్కోర్‌ 102/1. వారు ఇదే ఫామ్‌ని కొనసాగించి ఉంటే ఓడిపోయేవారు కాదు. తొలి వికెట్‌ కోల్పోయాక ఫామ్‌లో ఉన్న ఆటగాడు బ్యాటింగ్‌కి రావాలి. నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టొయినిస్‌, కృనాల్‌ పాండ్య, ఆయుష్‌ బదోని వీరిలో ఎవరైనా మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే బాగుండేది. కానీ, హుడా వచ్చాడు. ఒకవేళ పూరన్‌ (Nicholas pooran) వచ్చి ఉంటే 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించేవాడు. అప్పుడు ఆట మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆయుష్‌ బదోని (Ayush Badoni) 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఒకవేళ మూడో స్థానంలో అతడు బ్యాటింగ్‌ చేసినా ఎక్కువ పరుగులు సాధించేవాడు. ఆ స్థానంలో హుడానే పంపాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు.. కోచా? కెప్టెనా? యాజమాన్యమా? ఆ నిర్ణయం తీసుకొని లఖ్‌నవూ పొరపాటు చేసింది’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని