IPL 2023: ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టు.. కుదరకపోతే నన్ను కలువు: సీనియర్‌ స్పిన్నర్‌కు సెహ్వాగ్ సూచన

ప్రతి క్రికెటర్‌ ఫిట్‌నెస్‌ను సాధించాలని, వారి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) సూచించాడు. తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ సీనియర్‌ బౌలర్‌ను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు.

Published : 16 May 2023 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో (Cricket) ఫిట్‌నెస్‌ చాలా కీలకం. ఫిట్‌గా ఉంటే అతడి కెరీర్‌ మరింత కాలం కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) ఎంఎస్ ధోనీ ఇలాగే ఫిట్‌నెస్ కొనసాగిస్తూ.. 41 ఏళ్ల వయసులోనూ చెన్నై జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit mishra) కూడా 40 ఏళ్లు వచ్చినా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం విశేషం. కేవలం 7.47 ఎకానమీతో బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నాడు. అయితే, మిశ్రా తన ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ తరఫున అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కీలక సూచనలు చేశాడు. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని సూచించాడు. 

‘‘అమిత్ మిశ్రా ప్రతిభ ఎక్కడికీ పోలేదు. అయితే, వయసు పెరిగే కొద్దీ మునుపటి వేగం మాత్రం తగ్గడం సహజం. ఎవరైనా బ్యాటర్ త్వరగా రిటైర్‌మెంట్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఫిట్‌నెస్‌ సమస్య. 20 ఓవర్లపాటు మైదానంలో ఫీల్డింగ్‌ చేయాలంటే ఫిట్‌గా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు సునీల్ గావస్కర్‌ను బ్యాటింగ్‌కు దింపినా.. కొన్ని షాట్లు కొట్టగలడు. కానీ, వికెట్ల మధ్య పరుగెత్తడం, ఫీల్డింగ్ చేయడం సాధ్యంకాదు. అందుకే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. అప్పుడే క్రికెటర్లు తమ కెరీర్‌ను పొడిగించుకుంటూ వెళ్లగలరు. ఇప్పుడు ఆటగాళ్లంతా ఇలానే చేయాలని నేను చెబుతా. అమిత్ మిశ్రా కూడా మరో ఏడాదిపాటు ఆడాలి. ధోనీ ఇప్పటికే చేసి చూపించాడు. విరాట్, రోహిత్‌, ధావన్ కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టి సాధించారు. అమిత్ మిశ్రా.. నువ్వు కూడా నా మాట విని ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టు. ఇంకాస్త కష్టపడు. అలా చేయలేనప్పుడు.. వెంటనే నన్ను కలువు. తప్పకుండా సాయం చేస్తా’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని