Sehwag: టెస్టు క్రికెట్‌లో అతడు కొత్త ‘మిస్టర్‌ కూల్‌’: వీరేంద్ర సెహ్వాగ్

ప్రపంచ క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni)ని ‘‘మిస్టర్ కూల్‌’’ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ ఆస్ట్రేలియా బ్యాటర్‌ను టెస్టు క్రికెట్‌లో కొత్త ‘మిస్టర్‌ కూల్‌’ అని అభివర్ణించాడు.

Published : 23 Jun 2023 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) శుభారంభం చేసింది. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ (England)పై ఆసీస్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్‌ చేజారుతున్న దశలో కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (44 నాటౌట్‌; 73 బంతుల్లో 4×4, 2×6).. లైయన్‌ (16 నాటౌట్‌)తో కలిసి గొప్పగా పోరాడి ఆసీస్‌ను గెలిపించాడు. ఈ నేపథ్యంలో కమిన్స్‌ (Pat Cummins)పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా కమిన్స్‌ను అభినందించాడు. అతడిని టెస్టు క్రికెట్‌లో కొత్త ‘‘మిస్టర్‌ కూల్’’గా అభివర్ణించాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni)ని ‘‘మిస్టర్ కూల్‌’’ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. 

‘‘వాట్‌ ఎ టెస్ట్ మ్యాచ్. ఇటీవల కాలంలో నేను చూసిన అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఇది ఒకటి. టెస్ట్ క్రికెట్ ఈజ్‌ బెస్ట్ క్రికెట్‌. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి రోజు ఇంగ్లాండ్‌ ధైర్యంగా డిక్లేర్‌ చేసింది. కానీ, ఉస్మాన్‌ ఖవాజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ  అత్యద్భుతంగా ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో పాట్‌ కమిన్స్‌ కొత్త మిస్టర్ కూల్‌.ఒత్తిడిలోనూ లైయన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ జూన్‌ 28న లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో మొదలవుతుంది. మొదటి టెస్టులో విజయ తీరాల వరకు వచ్చి చివర్లో బోల్తాపడిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో ఆసీస్‌కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని