Dhoni - CSK: ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్‌!

‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ రూల్‌తో ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ జట్లు కీలక సమయంలో బ్యాటర్‌ లేదా బౌలర్‌ను రంగంలోకి దింపి ఫలితాలను సాధిస్తున్నాయి. ఈ రూల్‌ వల్ల మైదానంలో 20 ఓవర్లపాటూ ఉండాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.

Updated : 29 May 2023 12:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ (IPL 2023) నుంచి కొత్తగా ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌ రూల్‌ అమల్లోకి వచ్చింది. దీని ద్వారా అదనంగా బౌలర్‌/బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటు జట్లకు లభించింది. ఈ రూల్‌తో కొందరు సీనియర్లు కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైన సందర్భాలూ ఉన్నాయి. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు సారథి డుప్లెసిస్ కూడా ఇలాగే ‘ఇంపాక్ట్‌’గా ఆడినవారే. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ మాత్రం ఒక్కసారి కూడా ఇలా బరిలోకి దిగలేదు. అయితే, ఇదే చివరి సీజన్‌గా భావిస్తున్న తరుణంలో ‘ఇంపాక్ట్’ రూల్‌తో ధోనీ మరికొన్ని సంవత్సరాలు ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) కోచ్‌ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. కానీ, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించలేదు. ధోనీకి (MS Dhoni) ఇలాంటి ఇంప్టాక్‌ రూల్ వర్తించదని పేర్కొన్నాడు. దానికిగల కారణాలనూ విశ్లేషించాడు. మరికొన్ని సీజన్లపాటు ఆటగాడిగా ధోనీ కొనసాగవచ్చని, ఇంప్లాక్‌ ప్లేయర్‌గా మాత్రం కాదని స్పష్టం చేశాడు. 

‘‘40ల్లో క్రికెట్ ఆడటం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు అతడు కేవలం కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడు. మైదానంలోనూ వ్యూహాలను రచిస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో చివరి రెండు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇప్పటి వరకు అతడు మొత్తం 40 నుంచి 50 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. అందుకే ధోనీకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ అవసరం లేదు. వర్తించదు కూడానూ. ఇప్పుడు అతడు ఆడుతోంది సీఎస్‌కేకు కెప్టెన్‌గా ఉండటానికి మాత్రమే. ఇంప్టాక్‌ రూల్‌ అనేది పూర్తిస్థాయిలో మైదానంలో లేకుండా బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌  చేయడానికే వినియోగించుకుంటారు. కానీ, ధోనీ మాత్రం 20 ఓవర్లపాటు మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తాడు. అతడు కెప్టెన్‌ కాకపోతే.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా ఆడడు. అందుకే, భవిష్యత్తులో ధోనీని కోచ్‌ లేదా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ పదవిలో చూసే అవకాశం లేకపోలేదు’’ అని సెహ్వాగ్‌ వివరించాడు. 

గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ధోనీ తన ఐపీఎల్ రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తాడనే ఊహాగానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. కానీ, సీఎస్‌కే కోచ్‌ డ్వేన్ బ్రావో మాత్రం వాటన్నింటినీ కొట్టిపడేశాడు. వచ్చే సీజన్‌లో (IPL 2024) ధోనీ ఆడతాడా..? అనే ప్రశ్నకు  ‘వందశాతం. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో ఆడతాడు. తన కెరీర్‌ను మరికొంతకాలం పొడిగిస్తాడు’ అని బ్రావో సమాధానం ఇచ్చాడు. మరి కెప్టెన్‌ కూల్ ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని