IND vs AUS: అంపైర్‌కు తగిలిన బంతి.. ఆసీస్‌ కెప్టెన్ రియాక్షన్‌ వైరల్

ఆసీస్‌ (AUS)తో జరిగిన ఐదో టీ20లో భారత్ (IND) ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. 

Published : 04 Dec 2023 13:00 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆస్ట్రేలియా విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా.. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మొదటి నాలుగు బంతుల్లో ఒకే పరుగు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న నాథన్ ఎలిస్‌ నేరుగా ఆడాడు. బంతిని అర్ష్‌దీప్‌ ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో బంతి వికెట్ల వెనక ఉన్న అన్‌ ఫీల్డ్ అంపైర్‌ వీరేందర్ శర్మకు తగిలింది. అయితే, బంతి అంపైర్‌కు తగలకపోతే బౌండరీ వెళ్లే అవకాశం ఉండేది. అంపైర్‌కు తగిలి బంతి ఆగిపోవడంతో ఆసీస్‌ కెప్టెన్ మాథ్యూ వేడ్ (Matthew Wade) అసంతృప్తికి లోనయ్యాడు. ఆ సమయంలో వేడ్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అశ్విన్ రికార్డును సమం చేసిన రవి బిష్ణోయ్

ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి స్వదేశంలో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్‌ సరసన చేరాడు. 2016లో శ్రీలంకపై అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో చివరి టీ20లో బిష్ణోయ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ అనంతరం బిష్ణోయ్ మాట్లాడాడు. ‘‘ఈ సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో నేను పేలవ ప్రదర్శన చేశాను. ఆ తర్వాత నా ప్రణాళిక ప్రకారం వికెట్‌ టూ వికెట్ బౌలింగ్‌ చేయడంపైనే దృష్టిపెట్టాను. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ విషయానికొస్తే అక్కడ పిచ్‌లు, వాతావరణం భిన్నంగా ఉంటాయి. వీలైనంత త్వరగా ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తా’’ అని బిష్ణోయ్ అన్నాడు. త్వరలో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబరు 10 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌కు రవి బిష్ణోయ్ ఎంపికైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు