RCB - du Plessis: వారి వైఫల్యం వల్లే ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేకపోయాం: డుప్లెసిస్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన అనంతరం ఆర్సీబీ (RCB) కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడాడు. ఈ సీజన్‌లో తమ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకపోవడానికి గల కారణాలను వివరించాడు. 

Updated : 22 May 2023 18:35 IST

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కి నిరాశే ఎదురైంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్‌ సెంచరీ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయడంతో విజయం ఖాయం అనుకున్నారు. కానీ, గుజరాత్ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో బెంగళూరు లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (Faf Du Plessis) మాట్లాడాడు. ప్లేఆఫ్స్‌కు చేరకపోవడానికి గల కారణాలను వివరించాడు.  మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు పరుగులు చేయకపోవడం, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతోపాటు ఫినిషింగ్ టచ్‌ ఇచ్చే మంచి హిట్టర్లు లేకపోవడంతో లీగ్‌ స్టేజ్‌లోనే టోర్నీని ముగించాల్సి వచ్చిందని చెప్పాడు. 

‘ఈ మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసింది. మేం బలమైన జట్టుతో బరిలోకి దిగాం. శుభ్‌మన్‌ గిల్ అద్భుతమైన సెంచరీ చేశాడు. మొదట ఇన్నింగ్స్‌ కంటే రెండో ఇన్నింగ్స్‌లో మైదానంలో తడి ఎక్కువైంది. దీంతో బంతిపై కావాల్సినంత పట్టు దొరకలేదు. మ్యాచ్‌లో మేం  పైచేయి సాధించడానికి వీలుగా విరాట్ కోహ్లీ నమ్మశక్యంగాని ఆటతీరును ప్రదర్శించాడు. కానీ, శుభ్‌మన్‌ గిల్ అసాధారణ రీతిలో ఆడి మ్యాచ్‌ను మాకు దూరం చేశాడు’ అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.  

‘బ్యాటింగ్ విషయానికొస్తే టాప్‌-4 ఆటగాళ్లు బాగా ఆడారు. అయితే, సీజన్‌ మొత్తం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయలేదు. మిడిల్‌ ఓవర్లలో మేం అనుకున్న విధంగా వికెట్లు పడగొట్టలేకపోయాం. సీజన్‌ ఆసాంతం విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. డెత్ ఓవర్లలో మా జట్టు ఆటతీరు మెరుగుపడాలి. గత సంవత్సరం దినేశ్ కార్తిక్ మంచి ఫామ్‌లో ఉండి తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్‌ ఇచ్చాడు. కానీ, ఈ సీజన్‌లో అది జరగలేదు. సక్సెస్‌ అయిన జట్లను పరిశీలిస్తే వారికి ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో మంచి హిట్టర్లు ఉన్నారు’ అని డుప్లెసిస్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని