Virender Sehwag: సచిన్‌ను మోయడమా.. మా వల్ల కాదన్నాం: సెహ్వాగ్‌

2011 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ నాటికి తాము వృద్ధులమైపోయామని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. అప్పట్లో జరిగిన ఓ ఘటనను వెల్లడిస్తూ ఈ కామెంట్లు చేశాడు.

Updated : 28 Jun 2023 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ నిర్వహణకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇక ఈసారి స్వదేశంలో జరుగనున్న మెగా టోర్నీని గెలిచి.. సుదీర్ఘకాలంగా ఉన్న ఐసీసీ ట్రోఫీల కొరతను తీర్చాలని టీమ్‌ఇండియా అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచకప్‌ను నెగ్గిన నాటి క్షణాలను మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పంచుకున్నాడు.

భారత్‌ విజేతగా నిలిచిన వెంటనే.. మైదానంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. సచిన్‌ను ఏకంగా భుజాలకెత్తుకొని మైదానం మొత్తం కలియదిరిగారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర ఘటనను సెహ్వాగ్‌(Virender Sehwag) తాజాగా వెల్లడించాడు. అప్పట్లో తాము మాస్టర్‌బ్లాస్టర్‌ను భుజాలపై ఎక్కించుకోకపోవడానికి కారణముందని తెలిపాడు.

‘‘సచిన్‌ చాలా బరువు ఉంటాడు. మేం ముసలోళ్లం..(నవ్వుతూ) మాకు భుజాల నొప్పులున్నాయి.. ధోనీకి మొకాలి గాయం ఉంది. మరికొందరు ఆటగాళ్లకు మరికొన్ని సమస్యలున్నాయి. అందుకే.. ఆ భారాన్ని యువ ఆటగాళ్లకు వదిలేశాం. మీరెళ్లి సచిన్‌ను ఎత్తుకొని మైదానంలో రౌండ్‌ కొట్టి రండి అని చెప్పాం. అందుకే విరాట్‌ అతడిని మోశాడు’’ అని సరదాగా వీరు వెల్లడించాడు. ఐసీసీ వరల్డ్‌కప్‌ 2023 షెడ్యూలింగ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

2011 ప్రపంచకప్‌లో సచిన్‌ అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నిలో అతడు 9 మ్యాచ్‌ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేశాడు. మరోవైపు సెహ్వాగ్‌ 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులు సాధించాడు. ఇక టోర్నీ మొత్తంలో యువరాజ్‌ చెలరేగిపోయాడు. తొమ్మిది మ్యాచ్‌లకు గాను 8 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 362 పరుగులు సాధించాడు.. ఇక బౌలింగ్‌లో కూడా 14 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని