West Indies Cricket: టీ20లంటే పూనకమే... పొట్టి క్రికెట్‌ ప్రమాదకారి విండీస్

వన్డేల్లో గొప్పగా రాణించలేకపోతున్న వెస్టిండీస్‌ క్రికెట్ జట్టు (West Indies).. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం తిరుగులేదని చాటి చెబుతోంది. తాజాగా భారత్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Updated : 15 Aug 2023 15:12 IST

వన్డే ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఘన చరిత్ర ఉన్న వెస్టిండీస్ (West Indies).. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీకి అర్హత కూడా సాధించలేకపోయింది. ఈ ఫార్మాట్లో చాలా ఏళ్లుగా ఆ జట్టుది పేలవ ప్రదర్శనే. ఇక టెస్టుల్లో కరీబియన్ జట్టు ఆట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇటీవలే భారత్ చేతిలో రెండు టెస్టుల సిరీస్‌లో చిత్తుగా ఓడింది. కానీ ఇదే జట్టు టీ20లకు వచ్చేసరికి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. మేటి జట్లకు కూడా దీటుగా బదులిస్తుంది. తాజాగా టీమ్ఇండియాను 3-2తో సునాయాసంగా ఓడించి సిరీస్ ఎగరేసుకుపోయింది విండీస్. పొట్టి క్రికెట్లో కరీబియన్ జట్టు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ సిరీస్ రుజువుగా నిలిచింది.

క్రికెట్లో ఒక జట్టు బలంగా ఉంది, మెరుగైన ప్రదర్శన చేస్తోంది అంటే.. దానికి ఫార్మాట్‌తో సంబంధం ఉండదు. టెస్టులైనా, వన్డేలైనా, టీ20లైనా.. ఆడేది క్రికెట్టే. ఫార్మాట్లను బట్టి ఆటలో కొంచెం మార్పు ఉండొచ్చు కానీ.. వెస్టిండీస్ అంత వైరుధ్యం మరే జట్టులోనూ కనిపించదు. ఇటీవలి భారత్‌తో సిరీస్ విషయానికే వస్తే.. టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘోర పరాభవం చవిచూసిన ఆతిథ్య జట్టు.. రెండో టెస్టులో కూడా భారీ ఓటమి ముంగిట నిలిచినా వర్షం వల్ల గట్టెక్కింది. వన్డే సిరీస్‌లోనూ భారతే 2-1తో పైచేయి సాధించింది. కానీ టీ20లకు వచ్చేసరికి కరీబియన్ జట్టుదే ఆధిపత్యం.

తొలి రెండు టీ20ల్లో ఆ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. ఆ ఊపు చూస్తే సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ అయినా గెలవగలదా అనిపించింది. ఐతే 3, 4 టీ20ల్లో పుంజుకుని విజయం సాధించి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ చివరి టీ20లో మాత్రం విండీస్ అలవోకగా విజయం సాధించి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. వన్డే ప్రపంచకప్‌నకు అర్హత కూడా సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతిలో టీ20 సిరీస్‌ ఓడిపోవడం దారుణం అంటూ వెంకటేష్ ప్రసాద్ లాంటి వాళ్లు విమర్శించారు కానీ.. పొట్టి క్రికెట్లో కరీబియన్ జట్టు చాలా ప్రమాదకరం అని దశాబ్ద కాలంగా ఆ జట్టు ఆట చూస్తున్న వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది.

రెండుసార్లు ఛాంపియన్

గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో గెలిచి ఈ ట్రోఫీని రెండుసార్లు గెలిచిన జట్టుగా ఘనతను అందుకుంది ఇంగ్లాండ్. ఐతే అంతకంటే ముందు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ సాధించిన ఏకైక జట్టు వెస్టిండీస్ మాత్రమే. ఓవైపు టెస్టులు, వన్డేల్లో పేలవ ప్రదర్శన చేస్తూనే.. 2012, 2016లో రెండుసార్లు పొట్టి కప్పును సొంతం చేసుకుంది. జీతాలు, కాంట్రాక్టులకు సంబంధించి బోర్డుతో ఆటగాళ్ల గొడవ పుణ్యమా అని గత దశాబ్ద కాలంలో వెస్టిండీస్ క్రికెట్ ప్రమాణాలు బాగా పడిపోయాయి. చాలామంది నాణ్యమైన ఆటగాళ్ల సేవలను వెస్టిండీస్ కోల్పోయింది.

వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని ఆటగాళ్లు గర్వకారణంగా భావించే రోజులు ఎప్పుడో పోయాయి. ఇది టెస్టులు, వన్డేల్లో వెస్టిండీస్ పతనానికి దారి తీసింది. కానీ టీ20ల్లో మాత్రం ఇప్పటికీ వెస్టిండీస్ బలమైన జట్టే. అందుక్కారణం.. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడుతూ ఆ జట్టు ఆటగాళ్లు రాటుదేలడమే. ఐపీఎల్ సహా ప్రధాన టీ20 లీగ్‌లు అన్నింట్లోనూ వెస్టిండీస్ ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉంది. పూరన్, రసెల్, నరైన్, హోల్డర్, కైల్ మేయర్స్, రొమారియో షెఫర్డ్.. ఇలా టీ20 లీగ్‌ల్లో మెరుస్తున్న కరీబియన్ ఆటగాళ్ల జాబితా పెద్దదే. 

బాదమంటే సరే.. నిలవమంటే కష్టం

ప్రపంచవ్యాప్తంగా 20లకు తోడు టీ10 లీగ్‌ల్లోనూ వెస్టిండీస్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పొట్టి క్రికెట్‌కు బాగా అలవాటు పడ్డ ఆ దేశ ఆటగాళ్లు తొలి బంతి నుంచి సిక్సర్లతో విరుచుకుపడమంటే సిద్ధంగా ఉంటారు. పూరన్, రసెల్ లాంటి వాళ్లు బౌలర్లపై ఎలా విరుచుకుపడతారో తెలిసిందే. కానీ కాసేపు క్రీజులో నిలబడి ఆచితూచి ఆడమంటే మాత్రం కరీబియన్ క్రికెటర్లకు చాలా కష్టమైపోతుంది. అందుకే అయిదు రోజులు ఆడాల్సిన టెస్టులు ఆ జట్టు ఆటగాళ్లకు సవాలుగా మారుతున్నాయి. ఒకట్రెండు సెషన్లు నిలబడి ఆడాలంటే శక్తికి మించి పనే అవుతోంది. బౌలర్లు కూడా సుదీర్ఘ స్పెల్స్ వేయలేకపోతున్నారు. టెస్టుల సంగతలా ఉంచితే.. 50 ఓవర్లు సాగే వన్డేల్లో కూడా కరీబియన్ క్రికెటర్లు నిలవలేకపోతున్నారు.

ఫలితమే.. ప్రపంచకప్‌ కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి వచ్చింది. అందులో కూడా స్కాట్లాండ్, నెదర్లాండ్స్ లాంటి జట్ల చేతిలో ఓడి ఈ మెగా టోర్నీకి దూరమైంది వెస్టిండీస్. భారత్‌తో సిరీస్‌లోనూ టెస్టులు, వన్డేల్లో నిలవలేకపోయింది. కానీ టీ20లకు వచ్చేసరికి తన సత్తాను చాటింది. టీ20ల్లో కూడా గత కొన్నేళ్లలో డ్వేన్ బ్రావో, పొలార్డ్, రసెల్ లాంటి మేటి ఆటగాళ్ల సేవలను కోల్పోయినా.. ఆ జట్టు బలహీన పడిపోలేదు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే ఈ ఫార్మాట్లో సత్తా చాటుతోంది. మేయర్స్, షెఫర్డ్, హోల్డర్, రోమన్ పావెల్, రోస్టన్ చేజ్.. ఇలా బోలెడంత మంది ఆల్‌రౌండర్లు ఆ జట్టు సొంతం. కింది వరుసలో ఆడే అకీల్ హొసీన్, అల్జారి జోసెఫ్ లాంటి బౌలర్లు కూడా ధాటిగా బ్యాటింగ్ చేయగలరు. ఈసారి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోయినా.. వచ్చే ఏడాది జరిగే పొట్టి కప్పులో మాత్రం కరీబియన్ జట్టు గట్టి పోటీదారుగానే బరిలోకి దిగబోతోంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని