Team India: ఆసీస్‌తో సిరీస్‌ ముగించాం సరే.. భారత్‌కు కలిసొచ్చిందేంటి.. లోపాలేంటి?

ఆసియా కప్‌లో ఘోర పరాభవంతో ఢీలాపడిన అభిమానులకు.. ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో జోష్ తెచ్చింది టీమ్‌ఇండియా. సరిగ్గా 28 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లో...

Updated : 26 Sep 2022 12:56 IST

ఈ నెల 28 నుంచే దక్షిణాఫ్రికాతో మరో టీ20 సిరీస్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో ఘోర పరాభవంతో డీలాపడిన అభిమానులకు.. ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో జోష్ తెచ్చింది టీమ్‌ఇండియా. సరిగ్గా 28 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పోరు.. ఈలోపు దక్షిణాఫ్రికాతో మాత్రమే టీ20 సిరీస్‌ మిగిలి ఉంది. స్వదేశంలోనే సెప్టెంబర్‌ 28 నుంచి సఫారీలతో మూడు టీ20లు ఆడనుంది. ఈ క్రమంలో ఆసీస్‌తో సిరీస్‌లో భారత్‌కు కలిసొచ్చిన సానుకూలాంశాలు ఏమున్నాయి..? రెండు రోజల్లో ప్రారంభమయ్యే మరో సిరీస్‌కు జట్టులో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? 

ఆసీస్‌తో టీ20 సిరీస్‌ విజయం.. టీ20 ప్రపంచకప్‌లో ఆత్మస్థైర్యంతో బరిలోకి దిగేందుకు టీమ్‌ఇండియాకు చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే బుధవారం నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌నూ గెలిచి ఆస్ట్రేలియాకు పయనం కావాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో అత్యుత్తమంగా రాణించాల్సిందే. అయితే ఆసీస్‌తో సిరీస్‌ సందర్భంగా బౌలింగ్‌ కాస్త గాడి తప్పినట్లు కనిపిస్తోంది. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు తక్కువే..

మళ్లీ ‘డెత్‌’ సమస్య

బుమ్రా, హర్షల్‌ వచ్చారు.. డెత్‌ సమస్య తీరిపోతుందిలే అని భావించిన సగటు క్రికెట్‌ అభిమానికి నిరాశే ఎదురైంది. కీలకమైన ఉప్పల్‌ పోరులోనూ భారత బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చేశారు. మరీ ముఖ్యంగా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌.. తానేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు సమర్పించాడు. అంతకుముందు వరకు ఆసీస్ స్కోరు 150 దాటేలా కనిపించలేదు. అదే ఊపులో 19వ ఓవర్‌ వేసిన బుమ్రాకూ ఆసీస్‌ బ్యాటర్లు చుక్కలు చూపించారు. రెండు సిక్స్‌లు సహా 18 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆసీస్‌ స్కోరు 180 దాటింది. అందుకే కెప్టెన్‌ రోహిత్ శర్మ కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే టీమ్‌ఇండియాకు కలిసొస్తున్న ఏకైక ఓవర్‌.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ (20). ఎందుకంటే గత ఆసియా కప్‌లోనూ ఏడు పరుగులను కాపాడేందుకు ప్రయత్నించి మ్యాచ్‌లను చివరి బంతి వరకూ తీసుకెళ్లారు. ఇప్పుడు తాజాగా ఆసీస్‌తో మూడో టీ20లోనూ హర్షల్‌ కేవలం ఏడు పరుగులే ఇవ్వడం గమనార్హం. అందుకే రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లోనైనా ‘డెత్‌’ ఓవర్లపై దృష్టిపెట్టాలి.

అక్షర్‌ భళా..

ప్రతి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ భారీగా పరుగులు చేసినా.. అక్షర్‌ పటేల్‌ను ఆడటంలో మాత్రం పర్యాటక జట్టు బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ కీలకమైన వేడ్‌ వికెట్‌తోపాటు మరో రెండు వికెట్లు తీసి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. అంతకుముందు ఎనిమిది ఓవర్లకే కుదించిన రెండో టీ20లోనూ తన కోటా (2 ఓవర్లు)లో కేవలం 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకొన్న ఆ మ్యాచ్‌లో అక్షర్‌ రాణించడంతో ఆసీస్‌ దూకుడుకు అడ్డుకట్ట పడింది. మూడు టీ20ల సిరీస్‌లో మొత్తం 8 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక కావడం విశేషం. బ్యాటింగ్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే టీ20 ప్రపంచపకప్‌లో రవీంద్ర జడేజా లేని లోటును తీర్చగల ఆల్‌రౌండ్‌ పాత్ర పోషించే అవకాశం ఉంది. మరోవైపు చాహల్‌ కూడా ఈ మ్యాచ్‌లో (1/22) రాణించాడు. ఇదే నిలకడ మిగతా మ్యాచుల్లోనూ కొనసాగితే ప్రత్యర్థులకు ముప్పు తప్పదు.

పరుగుల రారాజులు

ఆసీస్‌తో సిరీస్‌లో భారత్‌కు పెద్ద సానుకూలాంశం బ్యాటింగ్‌ విభాగం.. మూడు టీ20ల్లోనూ బ్యాటర్లు సమయోచితంగా రాణించారు. ఒకరిద్దరు విఫలమైనా ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూశారు. ఒక మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ ఆడితే.. మరో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించారు. కీలకమైన హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔటైనా.. విరాట్, సూర్య, హార్దిక్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయం చేకూర్చి పెట్టారు. అయితే వచ్చే మెగా టోర్నీలో ఓపెనింగ్‌ చాలా కీలకమవుతుంది. అందుకే రోహిత్-రాహుల్ జోడీ మంచి ఆరంభాలను ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం పవర్‌ప్లే వరకు వికెట్‌ పడకుండా ఆడితే.. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే బ్యాటర్లు దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇక ఆఖర్లో ‘ఫినిషింగ్‌’ టచ్‌ కూడా బాగానే ఇచ్చారు. సిరీస్‌ నెగ్గిన తర్వాత టైటిల్‌ను హార్డ్‌ హిట్టర్‌ దినేశ్‌ కార్తిక్‌ చేతికి కెప్టెన్ రోహిత్ అందించాడు. రెండో టీ20లో చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన క్రమంలో తొలి రెండు బంతుల్లోనే సిక్స్‌, ఫోర్‌ కొట్టేసి కార్తిక్‌ భారత్‌ను సిరీస్‌ రేసులో నిలిపాడు. అంతేకాకుండా ప్రస్తుత జట్టులో సీనియర్‌ ఆటగాడు కూడా డీకేనే కావడం విశేషం.

ఫీల్డింగ్‌ జర జాగ్రత్త..

బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ చాలా కీలకం. భారీ స్కోరు సాధించినా.. భీకరంగా వికెట్లు తీసినా.. ఫీల్డింగ్‌ చెత్తగా ఉంటే ఫలితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తొలి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు సాధించినా.. టీమ్‌ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్‌ వైఫల్యం. కీలకమైన సమయంలో ధాటిగా ఆడిన కామెరూన్ గ్రీన్, స్టీవ్‌ స్మిత్, మ్యాథ్యూ వేడ్ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. దీంతో బ్యాటర్ల కష్టం వృథా అయిపోయింది. దీంతో మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి.. ‘ఇదేనా ఫీల్డింగ్‌’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉప్పల్‌ మ్యాచ్‌లో ఈ ఫీల్డింగే భారత్‌ను కాపాడింది. హర్షల్‌పటేల్ వేసిన అద్భుతమైన త్రో.. కీలకమైన మ్యాక్స్‌వెల్‌ వికెట్‌ను అందించింది.

వ్యూహాలకు పదును పెట్టాల్సిందే..

రోహిత్ శర్మ ఇప్పటి వరకు కెప్టెన్‌గా 33 టీ20ల్లో భారత్‌కు విజయాలను అందించాడు. ఇవన్నీ ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్‌లు కావడం గమనార్హం. పూర్తిస్థాయి జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత బరిలోకి దిగిన ఏకైక టోర్నీ ఆసియా కప్‌. అయితే అక్కడ రోహిత్ వ్యూహాలు పారలేదు. మినీ టోర్నీ తర్వాత ఆసీస్‌తో సిరీస్‌లోనూ కొన్ని నిర్ణయాలు సరిగా లేవని క్రికెట్ విశ్లేషకుల అంచనా. అందులో డెత్‌ ఓవర్లలో వరుసగా విఫలమవుతున్నా భువనేశ్వర్‌కే బంతిని ఇవ్వడం ప్రధానమైంది. భువీతో తొలి స్పెల్‌లోనే పూర్తి ఓవర్ల కోటాను వేయించాలని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. తొలి పది ఓవర్లలో కొత్త బంతితో భువనేశ్వర్‌ అద్భుతంగా బంతులు వేస్తాడు. ఇప్పటికే అది నిరూపితమైంది. అందుకే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ ఇలానే డెత్‌ ఓవర్లలో ఒక్క ఓవర్‌ను మించి భువీకి ఇవ్వకూడదని.. భారీగా పరుగులు సమర్పించుకుంటే ఆ ప్రభావం మెగా టోర్నీలో సీనియర్‌ బౌలర్‌ ప్రదర్శనపైనా పడుతుందని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. అలాగే ఆసియా కప్‌ ముందు వరకు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలతో దుష్ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ఒకే స్క్వాడ్‌ను ప్రకటించడం.. ఓపెనర్లుగా రోహిత్‌-రాహుల్‌.. తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ బ్యాటింగ్‌కు రావడం వల్ల భారత్‌ సిరీస్‌ను గెలుచుకోగలిగింది. 

అప్పటి తుది జట్టు కోసం..

దక్షిణాఫ్రికా జరిగే సిరీస్‌ను టీ20 ప్రపంచకప్ సన్నద్ధతకు వినియోగించుకోవాలి. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చిన టీమ్‌ఇండియా.. పొట్టి టోర్నీలో తుది జట్టుపైనా క్లారిటీగా ఉండాలి. రిషభ్‌ పంత్‌-దినేశ్‌ కార్తిక్‌ ద్వయం .. అశ్విన్‌-చాహల్‌-అక్షర్‌ పటేల్ త్రయంలో ఎవరు తుది జట్టులో ఉండాలి.. ఎవరిని పక్కన పెట్టాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేయాలి. టీ20 ప్రపంచకప్‌ తుది జట్టులోకి తీసుకొనే వారికి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లోనూ మైదానంలోకి దిగేందుకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే మంచి ప్రదర్శన ఇచ్చి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకొనే ఛాన్స్‌ కల్పించినట్లు అవుతుంది. ఈ విషయంపై టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ దృష్టిసారించాలి. గత టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైన భారత్‌ నుంచి ఈసారి అలాంటి ఫలితం రాకుండా ఉండాలంటే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మీదనే కాకుండా తుది జట్టు ఎంపికపైనా తీవ్రంగా కసరత్తు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని