IND vs ENG: ఇంగ్లాండ్‌ షార్ట్‌బాల్స్‌ను భారత్ అడ్డుకొనేనా? ఆ ‘పది’ వికెట్ల ఓటమికి బదులు తీర్చుకునేనా?

వరల్డ్‌ కప్‌లో వరుస ఓటములతో కుదేలైన ఇంగ్లాండ్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం బరిలోకి దిగబోతున్న టీమ్‌ఇండియా (IND vs ENG) ఆదివారం లఖ్‌నవూ వేదికగా తలపడనుంది. 

Updated : 29 Oct 2023 09:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) వరుసగా ఐదు విజయాలు సాధించిన భారత్‌ సెమీస్‌ రేసులో దూసుకుపోతోంది. ఆదివారం లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో (IND vs ENG) తలపడేందుకు సిద్ధమవుతోంది. వరుస ఓటములతో సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. గతేడాది ఎదురైన ఘోర పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలి.  ఈ క్రమంలో టీమ్‌ఇండియా వ్యూహాలు ఎలా ఉంటాయి? తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఆ వీక్‌నెస్‌ను వీడాలి..

ఇంగ్లాండ్‌ జట్టులో పేసర్లకు కొదవేం లేదు. మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కరన్ పేస్‌ను తట్టుకోవాలంటే జాగ్రత్తగా ఆడాల్సిందే. మరీ ముఖ్యంగా షార్ట్‌పిచ్‌ బంతుల విషయంలో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడాలి. రోహిత్ శర్మ ఇలాంటి బంతులను సిక్స్‌లుగా మలిచేస్తాడు. కానీ, అవే బంతులకు ఔటైన సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు కఠిన పరీక్ష తప్పదు. షార్ట్‌ బాల్‌ను ఎదుర్కోవడంలో గిల్ ఇబ్బంది పడతాడు. దీంతో ఇప్పటికే నెట్స్‌లో షార్ట్‌పిచ్‌ బంతులను ఆడటంపై తీవ్రంగా శ్రమించాడు. కివీస్‌తో మ్యాచ్‌లో ఇలాంటి బాల్‌కే గిల్ తన వికెట్‌ను సమర్పించాడు. ఇంగ్లాండ్‌ పేస్‌ ధాటిని ఎదుర్కోవడంతోపాటు ఆ జట్టు బ్యాటింగ్‌ విభాగంపైనా టీమ్‌ఇండియా దృష్టిసారించాలి. గత మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపని బెయిర్‌స్టో, రూట్, డేవిడ్ మలన్, బట్లర్ బ్రూక్‌, లివింగ్‌స్టోన్ ఈసారి కచ్చితంగా దూకుడుగా ఆడేందుకు యత్నిస్తారు. షమీ, బుమ్రా ఆరంభంలో వికెట్లు తీస్తే ఆపై స్పిన్‌ విభాగం ఎలాగూ మంచి ఫామ్‌లోనే ఉన్నారు.

కూర్పు ఎలా ఉండేను? 

భారత జట్టుకు ఫామ్‌పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేవు. ప్రతి ఆటగాడూ తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. తొలిసారి ఈ వరల్డ్‌ కప్‌లో ఆడిన షమీ కివీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అబ్బురపరిచాడు. సూర్య మాత్రం రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మిగతా వారూ ఎలానూ రాణిస్తున్నారు. అయితే, గాయపడిన హార్దిక్‌ పాండ్య బదులు ఇద్దరు ప్లేయర్లను భర్తీ చేయాల్సిన పరిస్థితి. గత మ్యాచ్‌లో సూర్య, షమీని ఆడించింది. అయితే, లఖ్‌నవూ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే అప్పుడు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. దీంతో అశ్విన్‌ను తీసుకుని సిరాజ్‌ను పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. మిగతా జట్టంతా కివీస్‌తో తలపడిన టీమే బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. 

ఆ మ్యాచ్‌ గుర్తుందా..?

సరిగ్గా ఏడాది కిందట ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్-ఇంగ్లాండ్‌ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 168/6 స్కోరు సాధించింది. అనంతరం ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్‌నూ కోల్పోకుండా 16 ఓవర్లలోనే 170  పరుగులు చేసి విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇప్పుడా ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలను కోల్పోయి ఢీలాపడిన ఇంగ్లాండ్‌ను ఇంకా దెబ్బ తీయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. 

మనోళ్లకు మంచి రికార్డే..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇంగ్లాండ్‌కు మంచి రికార్డే ఉంది. ఇంగ్లాండ్‌పై 33 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ... మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీల సాయంతో 1,307 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 19 మ్యాచుల్లో రెండు సెంచరీలు బాదాడు. మొత్తం 637 పరుగులు చేశాడు. గతేడాది సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇంగ్లాండ్‌పై సెంచరీ చేసిన అనుభవం ఉంది. అయితే, అది పొట్టిఫార్మాట్‌లో కావడం విశేషం. గతేడాది ట్రెంట్‌బిడ్జ్‌ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో సూర్య  55 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతమైతే ఇంగ్లాండ్‌కు ఇబ్బందులు తప్పవు. ఇప్పటి వరకు ఇరు జట్లూ వన్డేల్లో 106 సార్లు తలపడ్డాయి. భారత్ 57 మ్యాచుల్లో గెలవగా.. 44 మ్యాచుల్లో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. మరో మూడింట్లో  ఫలితం రాలేదు. రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. ఇక వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఎనిమిది మ్యాచుల్లో భారత్ నాలుగు, ఇంగ్లాండ్‌ మూడింట్లో విజయం సాధించడం గమనార్హం. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. గత వన్డే ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని