Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?

ఐపీఎల్‌లో బెంగళూరు రెండో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్‌తో తలపడనుంది.

Published : 25 Mar 2024 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచులు ముగిశాయి. విజేతలుగా నిలిచిన జట్ల సొంత మైదానాల్లోనే ఇవి జరగడం విశేషం. ఇవాళ బెంగళూరు - పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. హోమ్‌ గ్రౌండ్‌లో విక్టరీ ఆనవాయితీని బెంగళూరు కొనసాగిస్తుందో.. లేదో చూడాలి!

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై జట్టుతో జరిగిన ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. స్టార్‌ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడలేదు. కెప్టెన్ డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్, అనుజ్‌ రావత్ రాణించడంతో చెన్నై ముందు 170+ స్కోరును లక్ష్యంగా నిర్దేశించింది. భారీ మొత్తం వెచ్చించి ముంబయి నుంచి తీసుకున్న కామెరూన్ గ్రీన్ (18: 22 బంతుల్లో) నాణ్యమైన క్రికెట్ ఆడలేకపోయాడు. ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అతడితోపాటు రజత్‌ పటీదార్‌ కూడా సున్నాకే ఔటయ్యాడు. వీరిద్దరూ రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు 84 మ్యాచ్‌లు ఆడి 39 మ్యాచుల్లో గెలిచింది. మరో 40 మ్యాచుల్లో ఓడింది. ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. 

బౌలింగ్‌ మెరుగైతేనే..

చెన్నై పిచ్‌ బౌలర్లకు కాస్త సహకారం అందిస్తుంది. అలాంటి పిచ్‌పైనా బెంగళూరు బౌలర్లు విఫలం కావడం ఆ జట్టును ఆందోళన కలిగించే అంశమే. ఇక బెంగళూరు పిచ్‌ బ్యాటింగ్‌కే అనుకూలం. పైగా చిన్న పిచ్‌ కావడంతో బౌలర్లు విభిన్నంగా సంధించాల్సి ఉంటుంది. సిరాజ్‌, అల్జారీ జోసెఫ్‌, కామెరూన్ గ్రీన్, కర్ణ్‌ శర్మ, యశ్‌ దయాల్ భారీగా పరుగులు సమర్పించకుండా ఉండాలి. తొలి మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేసిన మ్యాక్స్‌వెల్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మయాంక్‌ దగర్ కూడా 2 ఓవర్లలో 6 రన్స్‌ ఇచ్చినప్పటికీ.. పూర్తి ఓవర్ల కోటాను వేయించకపోవడం గమనార్హం. బౌలింగ్‌ వనరులను సరైన పద్ధతిలో వినియోగించుకోవడమూ అవసరమే. 

పంజాబ్‌ను కాపాడిన కరన్, లివింగ్‌స్టోన్

దిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఒక సమయంలో ఓటమి దిశగా సాగింది. కానీ, సామ్‌కరన్ (63), లివింగ్‌స్టోన్ (38) కీలక ఇన్నింగ్స్‌తో గట్టెక్కించారు. గత రెండు సీజన్లలో విఫలమైన కరన్‌ మంచి ఫామ్‌ అందుకోవడం పంజాబ్‌కు సానుకూల అంశం. కెప్టెన్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇక జానీ బెయిర్‌ స్టోకు (9) కలిసిరాలేదు. మూడు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. కొత్తగా వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిన జితేశ్ శర్మ తేలిపోయాడు. దాదాపు రూ.11 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకున్న హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శన చేయలేదు. రెండు వికెట్లు తీసినా 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించాడు. అయితే, చిన్నస్వామి మైదానంపై పూర్తి అవగాహన అతడికి ఉంది. గతంలో బెంగళూరు తరఫున ఆడిన అనుభవం పటేల్ సొంతం.

తుది జట్లు (అంచనా)

బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్), రజత్‌ పటీదార్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్‌ రావత్ (వికెట్ కీపర్), దినేశ్‌ కార్తిక్‌, అల్జారీ జోసెఫ్‌, మయాంక్‌ దగర్, కర్ణ్‌ శర్మ, సిరాజ్

పంజాబ్‌: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌, సామ్‌ కరన్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), లియామ్‌ లివింగ్‌స్టోన్, శశాంక్‌ సింగ్‌, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని