IND vs ENG: వైజాగ్‌ టెస్టు.. ‘ఫైనల్‌ XI’లో ఊహించని మార్పులుంటాయా..?

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు (IND vs ENG) ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. ఇప్పటికే ఇరు జట్లూ వైజాగ్‌ చేరుకుని ప్రాక్టీస్‌ ముమ్మరం చేశాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 0-1తో వెనుకబడి ఉంది.

Updated : 31 Jan 2024 16:16 IST

తొలి టెస్టులో ఊహించని పరాజయం మూటగట్టుకున్న భారత్‌కు రెండో టెస్టు (IND vs ENG) ప్రారంభం కాకముందే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు జట్టుకు దూరమవ్వగా... ఫైనల్‌ 11లో ఎవరు అనే ప్రశ్న మరొకటి. సిరీస్‌లో మరింత వెనకబడిపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అత్యవసరం. దీంతో ఈ సారి ఊహించని మార్పులు ఉంటాయి అని అంటున్నారు. 

బ్యాటర్లు ఎవరు?

హైదరాబాద్‌ టెస్టులో స్పిన్‌ ఆల్‌రౌండర్లతో కలిపి మొత్తం 9 మంది బ్యాటర్లతో భారత్‌ బరిలోకి దిగింది. కానీ, లక్ష్య ఛేదనలో ఒకరిద్దరే రాణించారు. దీంతో పరాజయం మూటగట్టుకుంది. ముఖ్యంగా శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో కుదురుకోవడానికే ఇబ్బందిపడ్డారు. వైజాగ్‌ టెస్టులో వీళ్లిద్దరూ రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిడిలార్డర్‌లో రాణించిన కేఎల్ రాహుల్ గాయపడి దూరమయ్యాడు. అతని స్థానంలో ఎవరొస్తారు అనేదే ప్రశ్న. అతడి స్థానంలో రజత్‌ పటీదార్‌ ఆడే అవకాశాలే ఎక్కువ అంటున్నా... సర్ఫరాజ్‌ ఎంట్రీని కొట్టిపారేయలేమని క్రికెట్ పరిశీలకులు అంటున్నారు. రోహిత్‌తో (Rohit Sharma) యశస్వి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంలో మార్పు ఉండకపోవచ్చు. ఇక నాలుగు, ఐదు స్థానాల సంగతి తేలడం అంత ఈజీగా లేదు. తొలి టెస్టులో ఆ స్థానంలో ఆకట్టుకున్న కేఎల్‌ లేకపోవడంతో శ్రేయస్‌ను ప్రమోట్‌ చేస్తారా లేక కొత్తవాళ్లతో ఊహించని ప్రయోగం చేస్తారా అనేది చూడాలి. ఇక వన్‌ అండ్‌ ఓన్లీ వికెట్ కీపింగ్‌ ఆప్షన్‌ శ్రీకర్‌ భరత్‌ ఎలాగూ ఉంటాడు. 

నలుగురు స్పిన్నర్లతోనా? 

విశాఖ టెస్టుకు నలుగురు స్పిన్నర్లతో ఆడటానికి కూడా రెడీ అని ఇంగ్లాండ్‌ కోచ్‌ మెక్‌కల్లమ్‌ అన్నాడు. పర్యటక జట్టే అలా అంటే... ఆతిథ్య జట్టు కూడా ఆ ఆలోచనలో ఉంది అనే అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే జట్టు యాజమాన్యం ఆలోచనలు చేస్తోందట. ఈ క్రమంలో స్టార్‌ పేసర్‌ సిరాజ్‌ను పక్కన పెడతారని అంటున్నారు. అతని స్థానంలోనూ స్పిన్నర్‌నే తీసుకుంటారని భోగట్టా. ఆ లెక్కన రవిచంద్రన్‌ అశ్విన్‌ సారథ్యంలో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగొచ్చు. ఇక పేసు గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి టెస్టు ఫామ్‌ను రెండో టెస్టులోనూ కొనసాగిస్తాడని టీమ్‌ ఆశిస్తోంది. 

ఇదే చివరి అవకాశమా? 

కోరి మరీ వన్‌డౌన్‌లో వస్తున్న గిల్ విఫలం కావడం.. మిడిలార్డర్‌లో జట్టును ఆదుకుంటాడని భావించిన శ్రేయస్‌ నిరాశపరచడం జట్టుకు తలనొప్పిగా మారుతోంది. దీంతో ఈ టెస్టు ప్రదర్శన చూసి వారి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఉప్పల్‌ టెస్టులో గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. శ్రేయస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 63 బంతుల్లో 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లపాటు ఆడి 13 పరుగులు చేశాడు. అయితే జట్టు విజయానికి అవి సరిపోని పరిస్థితి. జట్టులో స్థానం కోసం కుర్రాళ్లు పోటీ పడుతున్న వేళ వీరి ఆటతీరు ఇలానే కొనసాగితే... చివరి మూడు టెస్టుల స్క్వాడ్‌లో పేర్లు కనిపించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

భారత్‌ తుది జట్టు (అంచనా): 

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రజత్‌ పటీదార్/సర్ఫరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్, శ్రీకర్‌ భరత్‌, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, సుందర్/సిరాజ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని