Rishabh Pant: రిషభ్‌ పంత్‌ తడబడుతున్నాడా.. నడిపించలేకపోతున్నాడా?

రిషభ్‌ పంత్‌ గతేడాది భారత టీ20 లీగ్‌లో దిల్లీని అద్భుతంగా నడిపించి భవిష్యత్‌ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇటీవల అతడు ఆ నమ్మకాన్ని...

Updated : 14 Jun 2022 12:10 IST

రిషభ్‌ పంత్‌ గతేడాది భారత టీ20 లీగ్‌లో దిల్లీని అద్భుతంగా నడిపించి భవిష్యత్‌ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇటీవల అతడు ఆ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి కొనితెచ్చుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో దిల్లీని 14 మ్యాచ్‌ల్లో ఏడింటిలోనే గెలిపించిన పంత్‌.. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా తీసుకెళ్లలేకపోయాడు. మరోవైపు ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20ల్లోనూ టీమ్‌ఇండియాకు న్యాయం చేయలేకపోయాడు. దీంతో అతడు కెప్టెన్‌గా తడబడుతున్నాడా.. ? లేక నడిపించలేకపోతున్నాడా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తొలిసారి టీమ్‌ఇండియా..

ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్‌లో కెప్టెన్సీ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సారథి అంటే మైదానంలో చురుగ్గా ఉంటూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అవి కలిసి వస్తాయా లేదా అనే విషయాలు పక్కనపెడితే ఏదో చేద్దామని ప్రయత్నించి మరేదో విధంగా తడబాటుకు గురైతే ఫలితాలు ఇలాగే నిరాశకు గురిచేస్తాయి. పంత్‌ విషయంలో గత రెండు టీ20ల్లో అదే జరిగింది. దిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 211 పరుగుల భారీ స్కోర్‌ సాధించినా అంతపెద్ద లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే భారత జట్టు మునుపెన్నడూ ఇలా 200పైగా స్కోర్‌ సాధించిన సందర్భాల్లో ఓటమిపాలైంది లేదు. జట్టులో యుజ్వేంద్ర చాహల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌కుమార్‌, అవేశ్‌ ఖాన్‌ లాంటి సత్తా కలిగిన బౌలర్లు ఉన్నా మ్యాచ్‌ గెలవలేకపోయింది.

పంత్‌ చేసిన తప్పులివే..

కెప్టెన్సీ పరంగా తొలి టీ20లో పలు వైఫల్యాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అందులో ఒకటి పవర్‌ప్లేలోనే ఐదుగురు బౌలర్లతో బౌలింగ్‌ చేయించడం. భువీకి రెండు ఓవర్లు ఇచ్చిన పంత్.. అవేశ్‌ ఖాన్‌, చాహల్‌, హార్దిక్‌ పాండ్య, హర్షల్‌ పటేల్‌కూ తలో ఓవర్‌ అవకాశం ఇచ్చాడు. ఇదే జట్టు ఓటమికి ప్రధాన కారణంలా కనిపిస్తోంది. చాహల్‌ సహజంగా పవర్‌ప్లే తర్వాత బౌలింగ్‌ చేసి మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తాడు. అలాంటిది అతడికి పవర్‌ప్లేలోనే ఒక ఓవర్‌ ఇవ్వడం.. తర్వాత 8వ ఓవర్‌లో ఒకసారి ఇవ్వడం చూశాం. చివరికి మ్యాచ్‌ దక్షిణాఫ్రికా చేతిలోకి వచ్చాక 20వ ఓవర్‌లో మళ్లీ అవకాశం ఇచ్చాడు. అంటే 8 నుంచి 19 ఓవర్ల మధ్య చాహల్‌ లాంటి కీలక స్పిన్నర్‌ను పక్కనపెట్టాడు. అలాగే హార్దిక్‌ పాండ్యకు కూడా ఆదిలోనే పవర్‌ప్లేలో ఒకే ఓవర్‌ బౌలింగ్‌ ఇచ్చాడు. కానీ, అతడు 18 పరుగులు సమర్పించుకోవడంతో తర్వాత పూర్తిగా పక్కనపెట్టాడు. దీంతో పంత్‌ ఇష్టమొచ్చిన విధంగా బౌలింగ్‌ చేయించి విఫలమయ్యాడని తెలుస్తోంది. దీంతో ఆట సాగుతున్న తీరుకు, బ్యాట్స్‌మెన్‌ ఆడుతున్న తీరుకు తగ్గ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టంగా కనిపిస్తోంది.

తప్పుల నుంచి నేర్చుకోలేదు..

ఇక రెండో టీ20లోనూ రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా సరైన ప్రణాళికతో వచ్చినట్లు కనిపించలేదు. కటక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పిచ్‌ మందకొడిగా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌కు కూడా ఆడటం ఇబ్బందిగా మారింది. పరుగుల పరంగా ఎలా ఉన్నా.. పంత్ తన తప్పుల నుంచి ఏమాత్రం నేర్చుకోలేదని ఇక్కడ తెలిసొచ్చింది. 149 పరుగుల మోస్తరు ఛేదనలో దక్షిణాఫ్రికా పవర్‌ప్లే ముగిసే సమయానికి 29/3తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో తెంబా బవుమా, క్లాసెన్‌ లాంటి ఇద్దరు కుడిచేతి బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉన్నారు. అప్పుడు అక్షర్‌ పటేల్‌ వంటి ఎడమచేతి వాటం లెగ్‌స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వకుండా పంత్‌ చాహల్‌, పాండ్యలకు అవకాశం ఇచ్చాడు. అంటే తొలి మ్యాచ్‌లో వీళ్లిద్దరికీ మధ్య ఓవర్లలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఇక్కడ సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు. కానీ, ఈ స్థితిలో ఏ కెప్టెన్‌ అయినా కుడిచేతి బ్యాట్స్‌మెన్‌కు ఎడమచేతి బౌలర్లను ఉపయోగిస్తారు. ఈ మ్యాచ్‌లో అక్షర్‌కు అవకాశం ఇచ్చేసేసరికి క్లాసెన్‌ మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ టీమ్‌ఇండియా 13 ఓవర్లకు 90/4తో కష్టాల్లో ఉన్నప్పుడు దినేశ్‌ కార్తీక్‌ లాంటి హిట్టర్‌ను కాకుండా అక్షర్‌ పటేల్‌ను ముందు పంపాడు. దీంతో చాలా మంది నెటిజన్లు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

తడబాటుకు గురవుతాడు..

అయితే, పంత్‌ తడబాటుకు గురవుతాడని, అనుభవం గడిచేకొద్దీ మెరుగవుతాడని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో దిల్లీ విఫలమైనా ఆ జట్టు కోచ్‌ రికీపాంటింగ్‌ పంత్‌ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. అతడు కచ్చితంగా మెరుగవుతాడని గట్టి విశ్వాసం వ్యక్తం చేశాడు. మరోవైపు టీ20 లీగ్‌లో పంత్‌ కెప్టెన్సీని గమనించిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీమ్‌ జాఫర్‌ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశాడు. మ్యాచ్‌లు కీలక సమయానికి వచ్చేసరికి ఈ యువ సారథి తడబాటుకు గురుతాడన్నాడు. అతడు అనుభవంతోనే కెప్టెన్‌గా మెరుగవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని లేదంటే మ్యాచ్‌లు కోల్పోతామని మాజీ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ సైతం పంత్‌ కెప్టెన్సీపై పెదవి విరిచాడు. కీలక సమయాల్లో బ్యాట్స్‌మెన్‌కు తగ్గ బౌలర్లను వినియోగించుకోవాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖలో జరిగే మూడో టీ20లో టీమ్‌ఇండియా గెలవాలంటే పంత్‌ సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని