Virat Kohli: ‘విరాట్‌’ పర్వంలో విరామం.. కోహ్లీ ఎక్కడ?

గత దశాబ్దంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకుండా భారత్ సిరీస్‌ ఆడటం ఇదే తొలిసారి. ఒకటీ లేదా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండే కోహ్లీ ఈసారి సిరీస్‌ నుంచి వైదొలగడం గమనార్హం.

Published : 13 Feb 2024 02:16 IST

19 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు  వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. అప్పటినుంచి ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ముందువరకూ నిరాటంకంగా అతని ప్రయాణం సాగింది. ముఖ్యంగా 13 ఏళ్లలో ఒక్కసారి కూడా స్వదేశంలో టెస్టు సిరీస్‌కు దూరం కాలేదు. ఆ కుర్రాడు భారత జట్టులో దిగ్గజంగా ఎదిగాడు. కెప్టెన్‌గానూ సత్తా చాటాడు. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అతని పయనం ఆగింది. విరాట్‌పర్వంలో విరామం వచ్చింది. ఆ ఆటగాడు ఎవరో కాదు మన విరాట్‌ కోహ్లీ.  ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమైన అతను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? 

ఎన్నో ఊహాగానాలు

2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లీ (Virat Kohli) పొట్టి ఫార్మాట్‌కు 14 నెలల పాటు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ మళ్లీ వస్తుండటంతో తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20కు దూరమయ్యాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. అంతకుముందు ఇదే కారణంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడలేదు. కానీ టెస్టుల్లో బరిలో దిగాడు. ఇక స్వదేశంలో కీలకమైన ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ కచ్చితంగా ఆడతాడనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే తొలి టెస్టు కోసం అతను హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. కానీ ఉన్నట్లుండి మ్యాచ్‌ ఆరంభానికి ముందే ఇక్కడినుంచి వెళ్లిపోయాడు. తొలి రెండు టెస్టులకు అతను అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. 

మూడో టెస్టు నుంచి అయినా అతను ఆడతాడేమోనని అనుకుంటే.. ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడంటే కోహ్లీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతని తల్లికి అనారోగ్యమనే వార్తలు వచ్చాయి. కానీ అతని సోదరుడు వీటిని ఖండించాడు. ఇక కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ వెల్లడించాడు. కానీ అది తప్పుడు సమాచారమని ఏబీ క్షమాపణ చెప్పాడు. దీంతో కోహ్లీ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. 13 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యేంత అవసరం అతడికి ఏమొచ్చిందనే దానిపై స్పష్టత లేదు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్‌లో అతను తిరిగి మైదానంలో కనిపించే అవకాశముంది. 

అతను లేని లోటు

జట్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అతను మైదానంలో ఉంటే ఉండే ఉత్సాహమే వేరు. అతని ఉనికి జట్టులో జోష్‌ పెంచుతుందనే చెప్పాలి. అతను ఆడుతున్నాడంటే స్టేడియాలకు వచ్చేందుకు అభిమానులు పోటీపడతారు.  ఇంగ్లాండ్‌తో హైదరాబాద్‌ టెస్టులో ప్రతిరోజు స్టేడియానికి సగటున 30 వేల మంది ప్రేక్షకుల వరకూ వచ్చారు. అదే కోహ్లీ ఆ మ్యాచ్‌లో ఆడి ఉంటే.. ఆ సంఖ్య మరింత పెరిగేదనడంలో సందేహం లేదు. ఇక విశాఖలో జరిగిన రెండో టెస్టులోనూ కోహ్లీ ఉండి ఉంటే.. స్టేడియం మరింతగా కిక్కిరిసేది. టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే, ఈ ఫార్మాట్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే విరాట్‌ ఇప్పుడీ సిరీస్‌లో లేకపోవడం ప్రపంచ క్రికెట్‌కు దెబ్బ అని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌ పేర్కొన్నాడు. అండర్సన్, కోహ్లీ మధ్య పోరును చూసే ఛాన్స్‌ మిస్సయ్యామని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ఇక ఆటపరంగా చూసినా భారత టెస్టు జట్టులో కోహ్లీ లేని లోటు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో కోహ్లీ ఆడే నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు గాయంతో శ్రేయస్‌ మిగిలిన మూడు టెస్టులకు దూరమవడంతో కోహ్లీ స్థానంలో ఎవరాడతారో చూడాలి. ఎవరాడని కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం కష్టమేనని చెప్పాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని