WFI: పద్మశ్రీ వెనక్కి.. ఆటకు వీడ్కోలు.. అసలు రెజ్లింగ్‌లో ఏం జరుగుతోంది?

వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచే వారికి ఇచ్చే పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం.. ఆటనే ప్రాణంగా సాగిన అథ్లెట్లు వెనుకడుగు వేయడం భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో సంచలనంగా మారాయి.

Updated : 24 Dec 2023 18:56 IST

పద్మశ్రీ.. భారత్‌లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం. వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్లకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారాన్నిస్తుంది. ఈ అవార్డు పొందడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని వెనక్కిచ్చేస్తున్నారు. మరోవైపు చిన్నప్పటి నుంచి ఆటే ప్రాణంగా సాగి.. ప్రపంచ వేదికలపై అద్భుత విజయాలతో దేశానికి ఖ్యాతి తెచ్చిన వాళ్లు ఆ ఆటకే వీడ్కోలు పలికారు. అసలు ఏం జరుగుతోంది. భారత రెజ్లింగ్‌లో రేగిన కలకలం ఏమిటీ? రెజ్లింగ్‌కు సాక్షి మలిక్‌ గుడ్‌బై చెప్పాల్సిన, బజ్‌రంగ్‌ పద్మశ్రీని వెనక్కి ఇవ్వాల్సిన పరిసిౖతి ఎందుకొచ్చింది? 

లైంగిక వేధింపులపై పోరాటం

2023కు ముందు భారత రెజ్లింగ్‌లో అంతా సవ్యంగానే సాగింది. జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లు, శిబిరాలు, అంతర్జాతీయ పోటీల్లో భారత రెజ్లర్ల ప్రాతినిథ్యం.. ఇలా అన్నీ సాఫీగా సాగిపోయాయి. కానీ ఈ ఏడాది జనవరిలో రెజ్లర్ల నిరసనతో భారత రెజ్లింగ్‌ ముఖ చిత్రమే మారిపోయింది. రోడ్డుపై ఆందోళన, పోలీసుల జోక్యం, కేసులు, కోర్టులో విచారణ, ఆగిన జాతీయ ఛాంపియన్‌షిప్స్‌.. ఇలా పరిస్థితి గందరగోళంగా మారింది. మహిళా రెజ్లర్లపై అప్పటి భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో సాక్షి మలిక్, వినేశ్‌ ఫొగట్‌, బజ్‌రంగ్‌ పునియా లాంటి దిగ్గజాలు జంతర్‌మంతర్‌ దగ్గర ఈ ఏడాది జనవరి 18న ధర్నాకు దిగడం కలకలం రేపింది. బ్రిజ్‌భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గాన్ని రద్దు చేయాలని ఈ రెజ్లర్లు డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలపై విచారణ కోసం కమిటీ వేస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటించడంతో జనవరి 21న రెజ్లర్లు నిరసన విరమించారు. అప్పుడే బ్రిజ్‌భూషణ్‌ను అధ్యక్షుడిగా తప్పించారు. దీంతో అంతా సద్దుమణిగినట్లే అనిపించింది. 

మళ్లీ రోడ్డుపైకి..

విచారణ కమిటీ నివేదికను బయట పెట్టాలని రెజ్లర్లు డిమాండ్‌ చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్‌ 23న రెజ్లర్లు మళ్లీ ఆందోళన మొదలెట్టారు. లైంగిక హింస ఆరోపణలతో బ్రిజ్‌భూషణ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేసినప్పటికీ దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఈ సారి ఉద్యమానికి తెరతీశారు. రైతు సంఘాల నేతలు, ఇతర వర్గాల నుంచి రెజ్లర్లకు మద్దతు లభించడంతో ఈ సారి ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో దిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఆ కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉన్నాయి. మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీగా రెజ్లర్లు భవనం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా జంతర్‌మంతర్‌ దగ్గర దీక్షా శిబిరాన్ని కూడా తొలగించారు. దీంతో తీవ్ర ఆవేదనతో తమ పతకాలను గంగలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. కానీ రైతు సంఘాల నాయకులు వారించడంతో రెజ్లర్లు తగ్గారు. బ్రిజ్‌భూషణ్‌పై పోలీసు విచారణ సరిగ్గా జరిగేలా చూస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇవ్వడంతో జూన్‌ 7న రెజ్లర్లు ఆందోళన విరమించారు. 

ఎన్నికలతో మళ్లీ..

మరోవైపు గడువు లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ ఈ సమాఖ్యపై యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ నిషేధం విధించింది. కోర్టుల స్టే కారణంగా ఈ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో డిసెంబర్‌ 21న ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. కానీ బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితులెవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని క్రీడల మంత్రిని రెజ్లర్లు కోరారు. మహిళా అధ్యక్షురాలు రావాలని కోరుకున్నారు. దీంతో బ్రిజ్‌భూషణ్‌ తనయుడు, అల్లుడు పోటీకి దూరంగా ఉన్నాడు. కానీ కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌కు వీర విధేయుడైన సంజయ్‌ సింగ్‌ గెలవడంతో ఆందోళన చేసిన రెజ్లర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల పాటు రోడ్డుపై ఉండి నిరసన చేస్తే లాభం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడు కావడంతో డబ్ల్యూఎఫ్‌ఐపై మళ్లీ బ్రిజ్‌భూషణ్‌ ఆధిపత్యమే కొనసాగుతుందని బాధ పడుతున్నారు. దీంతో సంజయ్‌ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మలిక్‌ తన బూట్లను బల్లపై పెట్టి, కన్నీళ్లతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని పార్లమెంట్‌ ముందు రోడ్డుపై పెట్టేసి ఆ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు బజ్‌రంగ్‌ ప్రకటించాడు. డెఫ్లింపిక్స్‌ (బధిరుల ఒలింపిక్స్‌) రెజ్లింగ్‌ ఛాంపియన్‌ వీరేందర్‌ సింగ్‌ కూడా తన పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తానని పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పరిణామాలు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని