England - ODI World Cup: ఛాంపియన్‌కు ఏమైంది?.. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ ఎందుకిలా?

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా అడుగు పెట్టిన ఇంగ్లాండ్‌ (England) జట్టు తన స్థాయికి తగ్గట్టు ఆడటంలో విఫలమవుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.

Updated : 24 Oct 2023 10:04 IST

అగ్రశ్రేణి బ్యాటర్లు.. ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులో ఆరుగురు ఆల్‌రౌండర్లు.. ప్రమాదకర బౌలర్లు.. ఇలా మొత్తంగా స్టార్‌ క్రికెటర్లతో నిండిన జట్టు. దూకుడైన ఆటతీరుతో.. ప్రత్యర్థిని ఏ మాత్రం లెక్క చేయకుండా.. నిర్భయంగా విజయాల వేటలో సాగే జట్టు. ప్రత్యర్థి జట్లను చావుదెబ్బ కొడుతూ.. అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే జట్టు. అందుకే ఈ ప్రపంచకప్‌లోనూ టైటిల్‌ ఫేవరెట్‌గా ఆ జట్టును పరిగణించారు. సునీల్‌ గావస్కర్‌ లాంటి దిగ్గజం భారత్‌ను కాదని.. ఆ జట్టు కప్పు గెలుస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అంతా తలకిందులైంది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో సెమీస్‌ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఆ జట్టే ఇంగ్లాండ్‌. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఇంగ్లిష్‌ జట్టు ప్రస్తుత ఆటతీరు ఏ మాత్రం ఊహించనిదే. మరి ఇంగ్లాండ్‌కు ఏమైంది? 

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్‌ ఓడింది. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో పుంజుకుంటుందనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా పసికూన అఫ్గానిస్థాన్‌ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు సఫారీ సేన చేతిలో చిత్తుచిత్తుగా ఓడి తమ వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త పరాజయాన్ని మూటగట్టుకుంది. 229 పరుగుల తేడాతో ఓడి.. పరుగుల పరంగా అతి పెద్ద ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరడం కష్టమనే చెప్పాలి. అందుకు ముందుగా ఆడబోయే అయిదు మ్యాచ్‌లూ గెలవాల్సిందే! ఇంగ్లాండ్‌ వరుసగా శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇందులో శ్రీలంక, నెదర్లాండ్స్‌ మినహాయిస్తే మిగతా మూడు మ్యాచ్‌లూ ఇంగ్లాండ్‌కు కఠిన పరీక్షే. 

2015లోనూ ఇలాగే.. 

2015 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లాండ్‌ ఇలాగే పేలవ ప్రదర్శన చేసింది. అప్పుడు 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. 4 ఓటములతో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. కానీ ఈ పరాభవం ఇంగ్లాండ్‌కే మేలు చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత ఆ జట్టు పూర్తిగా మారిపోయింది. దూకుడైన ఆటతీరుతో సాగుతోంది. 2019లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నిరుడు టీ20 ప్రపంచకప్‌నూ సొంతం చేసుకుంది. ఆ రెండు సందర్భాల్లోనూ ఉన్న కీలక ఆటగాళ్లు ఇప్పుడూ జట్టులో ఉన్నారు. కానీ ఇప్పుడు జట్టు ఓటముల కంటే ఓడిన తీరు మరింత షాక్‌కు గురిచేస్తోంది. ఎలాంటి పోరాటం లేకుండా చేతులెత్తేస్తోంది. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ ఆర్చర్, ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్‌ రిజర్వ్‌ ఆటగాడిగా జట్టుతో కొనసాగుతున్నాడు.

తుంటి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్‌.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అడుగుపెట్టినా లయ అందుకోలేక వికెట్‌ పారేసుకున్నాడు. బెయిర్‌ స్టో, డేవిడ్‌ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్‌ లాంటి బ్యాటర్లు.. మొయిన్‌ అలీ, సామ్‌ కరన్, లివింగ్‌స్టోన్, బెన్‌ స్టోక్స్, డేవిడ్‌ విల్లీ, క్రిస్‌ వోక్స్‌ లాంటి ఆల్‌రౌండర్లు.. అట్కిన్సన్, రషీద్, రీస్‌ టాప్లీ, మార్క్‌వుడ్‌ లాంటి బౌలర్లు ఉన్నారు. కానీ జట్టు గెలవలేకపోతోంది. అందుకు ప్రధాన కారణం సమష్టిగా సత్తాచాటలేకపోవడం. అంచనాలకు తగ్గట్లుగా స్టార్‌ క్రికెటర్లు రాణించలేకపోవడం. 

ఆ దూకుడేదీ? 

టెస్టుల్లోనే టీ20 ఆటతీరుతో అదరగొట్టే ఇంగ్లాండ్‌.. వన్డేల్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోతుంది. క్రీజులో బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆధిపత్యం సంగతి పక్కనపెడితే కనీస ప్రదర్శన కూడా లేదు. బంగ్లాదేశ్‌పై మలన్‌ 140 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో రూట్‌ వరుసగా 77, 82 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో కూడా వరుసగా 33, 52 పరుగులు సాధించాడు. కానీ నిలకడైన ప్రదర్శన లేదు. భారీ ఇన్నింగ్స్‌ల్లేవు. తుది జట్టు ఎంపిక కూడా సరిగ్గా ఉండటం లేదు. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతోంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ కోసం లివింగ్‌స్టోన్, క్రిస్‌ వోక్స్, సామ్‌ కరన్‌ను తప్పించి స్టోక్స్, విల్లీ, అట్కిన్సన్‌ను ఆడించింది. విల్లీ, అట్కిన్సన్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌ మ్యాచ్‌. బట్లర్‌ బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు.

అవసరమైన సమయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాప్లీ గాయంతో మధ్యలో బయటకు వెళ్లి వచ్చాడు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రూట్‌తో బౌలింగ్‌ చేయించాల్సి వచ్చింది. అతని బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. అలాగే బ్యాటింగ్‌కు చక్కగా సహకరించిన పిచ్‌పై టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడమూ దెబ్బతీసింది. మరోవైపు ఆటగాళ్లు వేడిని తట్టుకోలేక అలసిపోతున్నారు. ఇంగ్లాండ్‌ తిరిగి పుంజుకోవాలంటే తుది జట్టు ఎంపికలో కాదు దృక్పథంలో మార్పు రావాలి. ఇప్పటికీ జట్టులోని ఆటగాళ్లు సత్తాచాటితే ఇంగ్లాండ్‌ ప్రమాదకరంగా మారుతుంది. ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేసి సత్తా ఆ జట్టుకుంది. కానీ నమ్మకం కావాలి. ముందుగా ఆటగాళ్లు తమను తాము నమ్మాలి. విజయాలు సాధిస్తామనే కసితో సాగాలి. జట్టు సమతూకం పాటించాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు