IPL 2023: ఐపీఎల్‌లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్‌’ రూల్..?

దాదాపు రెండున్నర నెలలపాటు అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్‌ సిద్ధమైంది. ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. అందులో కీలకమైన నిబంధన ఇంపాక్ట్‌ ప్లేయర్ రూల్. అసలేంటి ఈ నిబంధన.. దీని వల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం..

Updated : 30 Mar 2023 20:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్‌ నిర్వాహకులు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేశారు.  ప్రస్తుత సీజన్‌ను అభిమానులకు మరింత రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ఒకటి ‘ఇంపాక్ట్‌ ప్లేయర్’ రూల్‌. ఇంతకీ ఈ నిబంధన ఏంటని అందరిలోనూ మెదిలే అనుమానం. మ్యాచ్‌ ఫలితంపై ఎలాంటి ఇంపాక్ట్‌ ఉంటుందనేది ఒకటే చర్చ. ఇది ఐపీఎల్‌కు కొత్తేమో కానీ.. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లోనే అమలు అవుతోంది. అయితే, దీనివల్ల ఆల్‌రౌండర్ల ప్రభావం తగ్గుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. అలాటిదేం ఉండదని కొందరు కొట్టిపడేశారు. 

ఇదీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌..

* ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు 11 మంది ఆటగాళ్లతోపాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌లను ప్రకటించాలి. ఆ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్‌ ఆటగాడిగా ఆడించేందుకు అవకాశం ఉంటుంది. 

* తుది జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉంటే మాత్రం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా భారత క్రికెటర్‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

* మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఆడించుకోవచ్చు.  పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్‌ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్‌ ఆటగాడిగా ఆడించొచ్చు. 

* ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్‌ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్‌ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్‌ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్‌ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. 

* ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందు లేదా ఓవర్‌ ముగిశాక లేదా వికెట్‌ పడ్డాక లేదా ఓ బ్యాటర్‌ రిటైరయ్యాకే ఇంపాక్ట్‌ ఆటగాడు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన బౌలర్‌ స్థానంలో వచ్చే ఇంపాక్ట్‌ ఆటగాడు తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. 

* ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు కెప్టెన్‌గా మాత్రం బాధ్యతలు నిర్వర్తించకూడదు.  11 మంది మాత్రమే బ్యాటింగ్‌ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని