IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. ప్రత్యర్థి వికెట్ల హంటర్స్‌ ఎవరు?

స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో (IND vs ENG) మొదటిి మ్యాచ్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

Updated : 24 Jan 2024 15:58 IST

ప్రస్తుత ఏడాది తొలి అర్ధ భాగంలో టీమ్‌ఇండియా ఆడే భారీ టెస్టు సిరీస్‌ ఇదే. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు (IND vs ENG) జట్టును ప్రకటించారు. విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. స్వదేశంలో అనగానే.. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువని కొద్దిపాటి క్రికెట్ పరిజ్ఞానం ఉన్నవారెవరైనా చెబుతారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (Rohit Sharma) తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది.

జనవరి 25 నుంచి మార్చి 11 వరకు.. దాదాపు 45 రోజులపాటు భారత్‌లో ఇంగ్లాండ్‌ జట్టు పర్యటన కొనసాగనుంది. గురువారం నుంచి ఉప్పల్‌ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లూ హైదరాబాద్‌కు చేరుకుని ప్రాక్టీస్‌ షురూ చేశాయి. ఉప్పల్ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. తొలి రోజు చివరి సెషన్‌ నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుందనేది మునుపటి గణాంకాలు చెబుతున్నాయి. అలాగని పేసర్లను ఇబ్బందికి గురి చేస్తుందా? అంటే అదీ లేదు. తొలి రోజు వారిదే హవా.

రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లదే ప్రభావం

చివరిసారిగా ఇక్కడ జరిగిన (2018లో) మ్యాచ్‌ ఫలితాలను గమనిస్తే.. విండీస్‌పై భారత్‌ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లవి కలిపి 30 వికెట్లు పడగా.. అనూహ్యంగా పేసర్లు 18 వికెట్లు తీశారు. ఉమేశ్‌ యాదవ్‌ ఈ టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. స్పిన్నర్లు 12 వికెట్లు పడగొట్టారు. ఈ లెక్కన హైదరాబాద్‌ పిచ్‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతోపాటు తొలుత పేసర్లకు సహకరిస్తుందని తెలుస్తోంది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం స్పిన్నర్లే ప్రధాన పాత్ర పోషించారు. భారత స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశారు. అప్పుడు అశ్విన్‌, కుల్‌దీప్‌, జడేజా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరగొట్టారు. ఈసారి కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. లోతైన బ్యాటింగ్‌ కూడా చాలా అవసరం. పేసర్లలో బుమ్రానే కాస్త బ్యాట్‌ను ఝుళిపించగలడు. అదే, స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్‌దీప్/అక్షర్ పటేల్ ఉంటే బ్యాటింగ్‌ పిచ్‌పై పరుగులు రాబట్టగలరు.

పేస్‌ ఆల్‌రౌండర్‌ ఉండుంటే..

భారత్‌ జట్టులో ఇప్పుడు పేస్‌ ఆల్‌రౌండర్‌ స్థానం ఖాళీగా ఉంది. హార్దిక్‌ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరం కావడం.. శార్దూల్‌ ఠాకూర్‌కు అవకాశాలు వచ్చినా నిరూపించుకోకపోవడంతో భారత్‌కు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు టీమ్‌లో పేస్‌ ఆల్‌రౌండర్‌ ఉండుంటే.. స్వదేశంలోనూ ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే వెసులుబాటు కలిగేది. మనకు ఉన్న ముగ్గురు స్పిన్నర్లూ బ్యాటింగ్‌లో రాణించగల సత్తా ఉన్న ఆటగాళ్లే. హైదరాబాద్‌ పిచ్‌నే ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ స్పిన్నర్ల కంటే పేసర్లే రాణించారనేది తెలుస్తోంది. దీంతో ఒక స్పిన్నర్‌ కమ్‌ బ్యాటర్‌ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అదనంగా స్పెషలిస్ట్‌ పేసర్‌ను జట్టులోకి తీసుకోవాల్సి వస్తుంది.

బజ్‌బాల్‌ను అడ్డుకోవాలంటే.. 

ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది. భారత్‌లోనూ ఇదే దూకుడుతో ఆడుతుందని ఇప్పటికే ఆ జట్టు మాజీలు చెబుతున్నారు. అలాంటి బజ్‌బాల్‌ను అడ్డుకోవడానికి ఇక్కడ స్పిన్‌ ఆయుధం సరైందనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. బంతి ఎక్కువగా తిరిగితే భారీ షాట్లు ఆడకుండా నియంత్రించడానికి వీలు కలుగుతుంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జో రూట్‌, జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్, పోప్‌ క్రీజ్‌లో పాతుకుపోతే ఓ పట్టాన వికెట్‌ ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటి వారికి చెక్‌ పెట్టడంతోపాటు.. బెన్‌స్టోక్స్‌, బెయిర్‌స్టోను భారీ షాట్లకు వెళ్లేలా చేయడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించాలి. 

భారత్‌ (తుది జట్టు)

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌/కుల్‌దీప్‌/అక్షర్‌ పటేల్.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని