Team India: ఫైనల్‌ ఎలెవన్‌లో ఎవరు? రోహిత్‌ కామెంట్లతో చర్చ

మరో నాలుగు నెలల్లో పొట్టి కప్‌ (T20 World Cup 2024) సమరం ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ఇండియా చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ను ఆడేసింది. మెగా టోర్నీకి ముందు ఐపీఎల్‌లో భారత క్రికెటర్లు ఆడతారు. 

Published : 19 Jan 2024 14:52 IST

ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు (T20 World Cp 2024) ఇంకా నాలుగు నెలలకు పైగా సమయం ఉంది. జూన్‌ 1న ఈ పొట్టి కప్‌ ఆరంభమవుతుంది. కానీ, ఇప్పుడే ఆ కప్‌లో ఆడే భారత జట్టుపై మైదానంలో బరిలో దిగే ఫైనల్‌ ఎలెవన్‌పై చర్చ జోరందుకుంది. ఇప్పుడిదే క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో సత్తా చాటేందుకు చివరి అవకాశమైన అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌ ముగిసింది. ఈ సిరీస్‌లో కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనపై స్పెషల్‌ ఫోకస్‌ కనిపించింది. తాజాగా కెప్టెన్‌ రోహిత్‌ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఇంకా జట్టు ఖరారు కాలేదని, కొంతమంది ఆటగాళ్లను తప్పించక తప్పదని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు. మరి ఆ కప్‌లో ఆడే 11 మంది ఎవరు? పోటీలో ఉండేదెవరు?

వచ్చేదెవరు?

ప్రపంచకప్‌లో ఆడబోయే 8 నుంచి 10 మంది ఆటగాళ్లు తమ మదిలో ఉన్నారని రోహిత్‌ చెప్పాడు. ఆ కప్‌ కోసం జట్టు 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ఇందులో నుంచి 11 మంది మ్యాచ్‌లో ఆడతారు. అయితే 25 నుంచి 30 మంది ఆటగాళ్ల పూల్‌ నుంచి ప్రపంచకప్‌ జట్టును ఎంచుకోవాల్సి ఉందని రోహిత్‌ అన్నాడు. ముందుగా జట్టుకు ఎంపిక చేసే ఆటగాళ్లపై ఓ అంచనాకు రావాల్సి ఉంది. 14 నెలల తర్వాత అఫ్గానిస్థాన్‌ సిరీస్‌తో తిరిగి టీ20ల్లో పునరాగమనం చేసిన రోహిత్, కోహ్లి.. ఆ పొట్టి కప్‌లో ఆడటం ఖాయమనే చెప్పాలి. గాయాల నుంచి కోలుకుని, ఐపీఎల్‌లో సత్తాచాటితే హార్దిక్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు రిషబ్‌ పంత్‌ కూడా తిరిగి జట్టులోకి వస్తారు. ప్రధాన పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌ ఆడటం పక్కా. ఫిట్‌నెస్‌తో ఉంటే షమి కూడా జట్టులోకి వస్తాడనడంలో సందేహం లేదు. ఫినిషర్‌గా రింకు ఆడే ఛాన్స్‌ ఉంది. 

స్పిన్నర్లుగా కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఆ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసే జట్టులో చోటు దక్కించుకోవచ్చు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, జితేశ్, అర్ష్‌దీప్‌ను జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలున్నాయి. పైన పేర్కొన్న ఆటగాళ్లే కాకుండా ఐపీఎల్‌తో సత్తాచాటే వాళ్లు కూడా జట్టులోకి వచ్చే అవకాశాలుంటాయి. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో రాణించిన ఆల్‌రౌండర్లు శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ, హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మకూ ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. ఇక అఫ్గానిస్థాన్‌ సిరీస్‌లో ముకేశ్‌ కుమార్, అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్‌ ఆకట్టుకోలేకపోయారు. ముకేశ్‌ 9.80 ఎకానమీ, బిష్ణోయ్‌ 10.18 ఎకానమీ, అవేశ్‌ 13.75 ఎకానమీతో పరుగులు ఇచ్చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి 25 ఓవర్లు వేసి 5 వికెట్లే పడగొట్టారు. ఐపీఎల్‌లో వీళ్లు అద్భుత ప్రదర్శన చేస్తే తిరిగి పరిగణించే ఆస్కారముంటుంది. 

ఆడేదెవరు?

ఇక తుది 11 మంది ఎవరనే దానిపై కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఒక ఓపెనర్‌గా రోహిత్‌ ఆడతాడు. అతనితో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు యశస్వి, శుభ్‌మన్‌ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరిలో పోల్చి చూస్తే యశస్వికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక మూడులో కోహ్లి, నాలుగులో సూర్యకుమార్‌ ఆడొచ్చు. ఆ తర్వాత రింకు, హార్దిక్, పంత్‌ ఆడే ఆస్కారముంది. ఆల్‌రౌండర్‌ ప్లేసు కోసం హార్దిక్‌తో శివమ్‌ దూబె పోటీపడుతున్నాడు. కానీ, హార్దిక్‌ వైపే మొగ్గు చూపే ఛాన్స్‌ ఉంది. ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజా, అక్షర్‌లో ఎవరిని ఆడించాలన్నది జట్టుకు తలనొప్పిగా మారొచ్చు. మరో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌కే ఓటు వేసే వీలుంది. ఇద్దరు స్పెషలిస్టు పేసర్లుగా బుమ్రా, సిరాజ్, షమిలను రొటేట్‌ చేయొచ్చు. కానీ ఐపీఎల్‌ తర్వాత ఈ సమీకరణాలు మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ లీగ్‌తో ప్రపంచకప్‌నకు ఎంపిక చేసే టీమ్‌ఇండియాపై తుది నిర్ణయానికి వచ్చే ఆస్కారముంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని