Team India: టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియాలో ‘ఆ నలుగురు’

ఎంతటి పెద్ద ఆటగాడైనా ఫామ్‌లో ఉంటేనే ఆడగలడు. అలాగే టీమ్‌ అయినా సరే రాణించాలంటే ఏ ఒక్కరి మీదనో ఆధారపడి ఉండకూడదు. కానీ సీనియర్లు మాత్రం తమ బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చాల్సిన అవసరం ఉంది.

Published : 19 Oct 2022 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్వైపాక్షిక సిరీసుల్లో ఎంత రాణించినా పెద్దగా గుర్తింపు దక్కదు. అదే ఆటను ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో ప్రదర్శిస్తే హీరోలు అవుతారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే చాలా ఒత్తిడి ఉండటం సహజం. యువ ఆటగాళ్లు తడబాటుకు గురైతే ఫర్వాలేదు కానీ.. సీనియర్లు మాత్రం జట్టును ముందుండి నడిపించాలి. మరి టీమ్‌ఇండియాకు అలాంటి ఆటగాళ్లు ఎవరున్నారు..? గత కొన్ని టీ20ల్లో ఎలా రాణించారు..? ప్రస్తుత ఫామ్‌ ఎలా ఉందనే విషయాలను తెలుసుకుందాం.. 

కెప్టెన్సీ కీలకం.. 

ఎలాంటి జట్టుకైనా కెప్టెన్‌ చాలా కీలకం. అతడు తీసుకొనే నిర్ణయాలు.. ఫామ్‌ జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటి వరకు ఉన్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా సారథి. భారీ స్కోర్లను అవలీలగా చేయగలడు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. అదేవిధంగా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు (4) చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే కీలకమైన టోర్నీల్లో ప్రదర్శన నిలకడగా ఉండదనే వాదనా ఉంది.

గత ప్రపంచకప్‌లోనూ గొప్పగా రాణించలేదు. ఐదు మ్యాచుల్లో కలిపి 174 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. కానీ అవి అఫ్గానిస్థాన్‌, నమీబియా జట్లపై చేశాడు. ముఖ్యమైన పాక్, కివీస్ మ్యాచుల్లో తేలిపోయాడు. ఇక ఆసియా కప్‌లోనూ తన స్థాయి ఆటను ప్రదర్శించలేదు. నాలుగు మ్యాచుల్లో ఒక అర్ధశతకంతో 133 పరుగులు చేశాడు. ఆ హాఫ్‌ సెంచరీ కూడానూ శ్రీలంకపై చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది. అయితే ఎప్పుడు ఎలా ఆడతాడో అంచనా వేయడం చాలా కష్టం. ఫామ్‌లో లేనట్లు ఉన్నా.. ధాటిగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. 


రన్‌ మెషీన్‌.. 

ప్రస్తుతం ఉన్న భారత జట్టులో అత్యంత సీనియర్లలో విరాట్ ఒకడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంలో దిట్ట. రెండు నెలల కిందట కోహ్లీపై పెద్దగా అంచనాలు, ఆశలు ఉండేవి కావు. కానీ ఆటకు విరామం తీసుకొని ఆసియా కప్‌ బరిలోకి దిగాడు. రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లతో సిరీస్‌లు ఆడాడు. మూడేళ్ల నుంచి సెంచరీ కోసం వేచి చూసిన కోహ్లీ.. ఆ భారం మొత్తం దించేసుకొన్నాడు. 

ఇప్పుడు అద్భుత ఫామ్‌తో మునపటి విరాట్‌ను గుర్తుకు తెచ్చాడు. అందుకే ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు కోహ్లీ  కీలకంగా మారతాడని మాజీలు, విశ్లేషకులు అంచనా వేశారు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో 14 మ్యాచుల్లో సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలతో 485 పరుగులు చేశాడు. ఫిట్‌నెస్‌లో తిరుగులేని ఆటగాడు విరాట్. మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఇదే ఫామ్‌ను పొట్టి టోర్నీ ఆసాంతం కొనసాగించాలి. గత టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఐదు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో 68 పరుగులు సాధించాడు. అందులో ఒక అర్ధశతకం (57) ఉంది. 


హార్దిక్‌.. నీ మీద భారీ ఆశలే

భారత్ మొదటి వన్డే ప్రపంచకప్‌ను గెలిచినప్పుడు అప్పటి కెప్టెన్‌ కపిల్ దేవ్‌ కీలక పాత్ర పోషించాడు. అతడు పేస్‌ ఆల్‌రౌండర్‌. ఆ తర్వాత మిడిలార్డర్‌లో టీమ్‌ఇండియాకు దొరికిన ఆటగాడు హార్దిక్‌ పాండ్య. గతేడాదంతా గాయాలతో సహవాసం చేసి కోలుకొని వచ్చాడు. భారత టీ20 లీగ్‌లో గుజరాత్‌కు టైటిల్‌ అందించాడు. అలాగే ఆసియా కప్‌లో పాక్‌ మీద ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెప్పించాడు. కానీ మిగతా మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. మిడిలార్డర్‌లో జట్టుకు ఉపయుక్తమైన బ్యాటింగ్‌ చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీయాలని భారీ ఆశలు హార్దిక్‌పై ఉన్నాయి. 

ప్రస్తుత సంవత్సరంలో హార్దిక్‌ పాండ్య 18 మ్యాచుల్లో 151.3 స్ట్రైక్‌ రేట్‌తో 436 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇదే స్ట్రైక్‌రేట్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఆడితే చాలు.. టీమ్‌ఇండియా మిడిలార్డర్‌కు ఢోకా ఉండదు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. 4/33 అత్యుత్తమ ప్రదర్శనతో 12 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్‌ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మిడిల్‌ ఓవర్లలో జట్టుకు అండగా నిలిచేలా బౌలింగ్‌ ప్రదర్శన ఉంటేనే ఆల్‌రౌండ్‌ నామధేయానికి సార్థకత చేకూరుతుంది. గత టీ20 ప్రపంచకప్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 69 పరుగులు చేశాడు. అప్పటి పొట్టి కప్‌ పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ బౌలింగ్‌ చేయకపోవడం గమనార్హం. 


నయా ఫినిషర్‌.. డీకే

టీమ్‌ఇండియాకు మొన్నటి వరకు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ‘ఫినిషర్’’. ఇప్పుడు భారత టీ20 లీగ్‌ వల్ల బయటకొచ్చిన మరో హార్డ్‌ హిట్టర్ - ఫినిషర్ దినేశ్ కార్తిక్‌. ఇదేంటి తొలి టీ20 ప్రపంచకప్‌ నుంచి టీమ్‌ఇండియాతో ఆడుతోన్న డీకేని ఇప్పుడు గుర్తించడమేంటి..? అంటారా..? ధోనీ ఉన్నప్పుడు అడపాదడపా అవకాశాలు దక్కేవి. అదీ తుది జట్టులో స్థానం కష్టంగా ఉండేది. అయితే గత టీ20 లీగ్‌ సీజన్‌లో బెంగళూరు తరఫున చివరి ఓవర్లలో ధాటిగా ఆడి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ దృష్టి డీకే మీద పడింది. ఆసీస్‌, దక్షిణాఫ్రికా సిరీసుల్లోనూ తన ఫినిషర్‌ పాత్రను నిరూపించుకొన్నాడు. రిషభ్‌ పంత్‌ ఉండటంతో జట్టులోకి కష్టమేనన్న అంచనాలను తలకిందులు చేస్తూ కార్తిక్ టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపికయ్యాడు.

తుది జట్టులోనూ రిషభ్ కంటే దినేశ్‌ కార్తిక్‌ ఉంటేనే మంచిదనే వాదనా వచ్చింది. రిషభ్‌ పంత్ టీ20 ఫార్మాట్‌లో దూకుడైన గేమ్‌ను ఆడలేకపోవడం కూడా డీకే కలిసొచ్చింది. గత టీ20 ప్రపంచకప్‌లో కార్తిక్‌కు స్థానం దక్కలేదు. ఇప్పుడొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. భారత్‌ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్‌ జట్టులో డీకే సభ్యుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుత ఏడాదిలో ఆడిన 19 టీ20ల్లో 150కిపైగా స్ట్రైక్‌రేట్‌తో 273 పరుగులు చేశాడు. అయితే ఇందులో ఎక్కువగా  చివర్లో వచ్చిన చేసిన పరుగులే కావడం విశేషం. ఈసారి టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ ఖాతాలో పడాలంటే రోహిత్, విరాట్, దినేశ్‌, హార్దిక్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు