IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?

ఐపీఎల్‌ 2024 చివరి దశకు వర్షం ముప్పు ఎదురవుతోంది. లీగ్‌ స్టేజ్‌లో కోల్‌కతా - రాజస్థాన్‌ మ్యాచ్‌ రద్దైన సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్‌కు ఇదే పరిస్థితి ఎదురైతే? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

Updated : 21 May 2024 12:05 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ క్లైమాక్స్‌కు చేరింది. 10 జట్లు హోరాహోరీగా తలపడి.. చివరికి నాలుగు టీమ్‌లు నాకౌట్‌ దశకు చేరాయి. ఇవాళ మొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా - హైదరాబాద్‌ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న వేళ.. వర్షం ముప్పు మ్యాచ్‌లకు ఉండే అవకాశం లేకపోలేదు. క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే అహ్మదాబాద్‌లో వర్షం కారణంగా గుజరాత్ X కోల్‌కతా లీగ్‌ మ్యాచ్‌ (మే 13) రద్దైన సంగతి తెలిసిందే. అయితే, నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉంది. ఒకవేళ అప్పుడు కూడా ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు వర్షం అడ్డుగా నిలిస్తే.. విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే సందేహం రావడం సహజమే. అక్కడి వాతావరణం ఎలా ఉందనేది కూడా చూద్దాం.. 

  • నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు.. తొలి క్వాలిఫయర్‌, ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉంది. షెడ్యూల్‌ తేదీ మరుసటి రోజే రిజర్వ్‌డేగా ప్రకటించారు.
  • ఉదాహరణకు ఇవాళ కోల్‌కతా -  హైదరాబాద్‌ మ్యాచ్ అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మరుసటి రోజు (మే 22)  ఆట కొనసాగుతుంది. 
  • డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం విజేతను తేల్చేందుకు కనీసం ఐదు ఓవర్ల ఆటనైనా నిర్వహించాలి. దీనికి కటాఫ్‌ సమయం రాత్రి 10.25 గంటలు. అలా కాని పక్షంలో సూపర్‌ ఓవర్‌తోనైనా విజేతను ప్రకటిస్తారు. 
  • ఒకవేళ సూపర్‌ ఓవర్‌ కూడా ఆడేందుకు వాతావరణం కుదరలేదు. అప్పుడు ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం.. ఇరు జట్లలో సీజన్‌ను ఎక్కువ పాయింట్లతో ముగించిన వారే విజేతగా నిలుస్తారు.  
  • తొలి క్వాలిఫయర్‌ రద్దు అయితే.. కోల్‌కతా నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఎందుకంటే ఆ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానం సాధించి ప్లేఆఫ్స్‌కు వచ్చింది. అప్పుడు హైదరాబాద్‌ (17) ఎలిమినేటర్‌ విజేతతో తలపడాల్సి ఉంటుంది.
  • ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ (మే 22న) ఇదే పరిస్థితి ఎదురైతే.. బెంగళూరు (14) ఇంటికెళ్లాల్సిందే. రాజస్థాన్‌ (17) రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తుంది. 
  • సెకండ్‌ క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ - రాజస్థాన్‌ (మే 24న) తలపడి వర్షం అడ్డంకిగా మారితే.. సన్‌రైజర్స్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఎందుకంటే ఇరు జట్ల పాయింట్లు (17) ఒకటే అయినప్పటికీ నెట్‌రన్‌రేట్‌లో హైదరాబాద్‌ ముందుంది. 
  • ఫైనల్‌ మ్యాచ్‌కూ (మే 26) వరుణుడు ఆటంకం కలిగిస్తే రిజర్వ్‌ డే ఎలానూ ఉంది. అప్పుడూ వర్షం కారణంగా మ్యాచ్‌ ఆడలేని పరిస్థితి ఎదురైతే మాత్రం కోల్‌కతా ఛాంపియన్‌గా నిలుస్తుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటమే దానికి కారణం. 

ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే?

పైన మనం చర్చించిన అంశాలన్నీ వర్షం పడితే ఎలా విజేతను నిర్ణయిస్తారని మాత్రమే. అయితే, గత వారం వర్షాలతో ఇబ్బంది పడిన అహ్మదాబాద్‌లో ఇప్పుడు వాతావరణం చాలా బాగుందనేది రిపోర్టులు చెబుతున్న మాట. ఎండ కూడా బాగా కాస్తున్నందున మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం ఉండకపోవచ్చు. రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌కు వేదిక అయిన చెన్నైలో మాత్రం వరుణుడి ప్రభావం ఉంటుందని సమాచారం. సముద్రతీరం కావడంతో అక్కడి వాతావరణాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అయితే, సగటు క్రికెట్ అభిమాని మాత్రం ప్రతి మ్యాచ్‌ చివరి వరకూ జరగాలని కోరుకుంటున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని