Virat: అప్పుడు ఆర్‌సీబీని వదిలేద్దామనుకున్నా.. వేలంలోకి వెళ్లాలనే ఆలోచనలూ చేశా: విరాట్ కోహ్లీ

ప్రతి సీజన్‌లో ఈ సారి కప్‌ మనదే అంటూ ఎంతో ఉత్సాహంగా రావడం.. అభిమానులను నిరాశపరచడం ఆ జట్టుకు పరిపాటి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గని విషయం తెలిసిందే. అయినా ఆ జట్టుకు ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువగా ఉండటానికి కారణం విరాట్ కోహ్లీ (Virat Kohli).

Published : 27 Nov 2023 16:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇప్పుడు ఐపీఎల్‌ (IPL 2024) ట్రేడింగ్‌ ట్రెండ్ నడుస్తోంది. రిటెన్షన్‌/రిలీజ్‌ అయిపోయింది. ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఒకదాని నుంచి మరొకటి కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్‌ పాండ్యను ముంబయి సొంతం చేసుకుంది. అలాగే ముంబయి నుంచి కామెరూన్‌ గ్రీన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దక్కించుకుంది. ఇలాంటి సమయంలో గతంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అత్యధిక క్రేజ్‌ ఉన్న జట్లలో ఆర్‌సీబీ ఒకటని తెలుసు కదా.. ఇక ఆ టీమ్‌లో అందరి దృష్టి పరుగుల వీరుడు విరాట్‌పైనే ఉంటుంది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్‌సీబీకి తప్పితే మరే జట్టుకు ఆడని ఏకైక ప్లేయర్‌ కూడా కోహ్లీనే. అలాంటి విరాట్‌ కూడా ఒకానొక దశలో బెంగళూరు జట్టును వదిలేయాలని అనుకున్నాడట. గతేడాది ఐపీఎల్ (2022) సందర్భంగా విరాట్ చిట్‌చాట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

‘‘నన్ను ఐపీఎల్‌ వేలంలోకి రావాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరాయి. నేను కూడా ఒకదశలో బెంగళూరును వదిలేద్దామని నిర్ణయించుకున్నా. ఇది చెప్పడానికి నాకేమీ మొహమాటం లేదు.  కానీ, ఒక రోజు జీవితమంటే ఏంటా అనే ఆలోచన వచ్చింది. మనం ఉన్నా లేకపోయినా రోజులు జరిగిపోతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంతకాలం అని రాసిపెట్టి ఉంటుంది. మనకు తెలిసి ట్రోఫీలు గెలిచిన గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, ఎవరూ మిమ్మల్ని అలా పిలవరు. మీరు ఎక్కడికైనా వెళ్తే ‘ఓహ్‌.. ఇతను ఐపీఎల్‌ ఛాంపియన్‌ లేదా వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌’ అని సంబోధించరు. 

అదే నువ్వు మంచి వ్యక్తివైతే.. ప్రజలూ నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ చెడ్డ వ్యక్తిఅయితే వారే దూరంగా పెడతారు. జీవితంలో ఇదే అత్యంత విలువైంది. ఆర్‌సీబీ పట్ల విధేయతగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. ట్రోఫీని అందించకపోయినా.. ఏ ఫ్రాంచైజీ కూడా ఇలా ఆటగాడిపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవకపోయినా మా పట్ల ఆర్‌సీబీ యాజమాన్యం విశ్వాసం మరిచిపోలేం. తొలి మూడేళ్లు.. నేనప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోజులు. అలాంటి సమయంలోనూ ఫ్రాంచైజీ ఎన్నో అవకాశాలను కల్పించింది. మరే ఇతర జట్టులోనూ నాకు ఇలాంటి మద్దతు లభిస్తుందని అనిపించలేదు’’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని