Dhoni - Raina: అప్పుడు ధోనీ రోటీ, బటర్‌చికెన్‌ తింటున్నాడు..కానీ మ్యాచ్‌లో ఏమైందంటే: సురేశ్‌రైనా

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni)ని మొట్టమొదట కలిసినప్పుడు జరిగిన సరదా సంఘటన గురించి క్రికెటర్‌ సురేశ్‌ రైనా(Suresh Raina) గుర్తు చేసుకున్నాడు.

Updated : 25 Mar 2023 20:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni)ని మొట్టమొదట కలిసినప్పుడు జరిగిన సరదా సంఘటన గురించి క్రికెటర్‌ సురేశ్‌ రైనా(Suresh Raina) గుర్తు చేసుకున్నాడు. టీమ్‌ఇండియా, సీఎస్‌కే జట్లకు ప్రాతినిధ్యం వహించడానికి ముందు వారిద్దరూ క్రికెట్ ప్రత్యర్థులు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రైనా సెంట్రల్‌ జోన్‌ నుంచి ఝార్ఖండ్‌కు చెందిన ధోనీ ఈస్ట్ జోన్‌ నుంచి 2005లో దులీప్‌ ట్రోఫీలో తలపడ్డారు. అప్పుడు జరిగిన ఓ సంఘటనను రైనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘పొడవాటి జుట్టున్న ఝార్ఖండ్‌ ఆటగాడు నిలకడగా సిక్సులు బాదుతాడని చాలా విన్నాం. అవి మైదానం దాటి పోతాయని అందరూ గొప్పగా చెప్పేవారు. ఓ రోజు ధోనీ ప్రశాంతంగా ఓ మూలకు కూర్చొని రోటీ, బటర్‌ చికెన్‌ తింటున్నాడు. అతడికి సమీపంలోనే మా జట్టు ఉంది. ధోనీని చూసి జ్ఞానూ భాయ్‌(మాజీ క్రికెటర్‌ జ్ఞానేంద్ర పాండే)  ‘అతడు  మనల్ని ఇబ్బంది పెడతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతడు చాలా ప్రశాంతంగా తన తిండిని ఎంజాయ్‌ చేస్తున్నాడు’ అని అన్నాడు. కానీ తర్వాతి రోజు మ్యాచ్‌ మొదలవ్వగానే ధోనీ చెలరేగిపోయాడు. ఆకాశాన్ని ముద్దాడే సిక్స్‌లు బాదాడు. దీంతో జ్ఞాను భాయ్‌ తన మాటల్ని వెనక్కి తీసుకోవల్సి వచ్చింది’’ అని తెలిపాడు. 2010 ఐపీఎల్‌లో ధర్మశాలలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(Kings XI Panjab) - చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) జట్ల మధ్య జరిగన మ్యాచ్‌లో ధోనీ బాదిన అరుదైన సిక్స్‌ను రైనా గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ హెల్మెట్‌ పంచ్ అయ్యేలా మరో షాట్‌ కొట్టాడు. ‘‘లాంగ్‌ ఆన్‌లో అతడు భారీ షాట్ బాదాడు. ఇదివరకు ఏ  సందర్భంలోనూ, మ్యాచ్‌లోనూ అతడు అలా చేయడం నేనెప్పుడూ చూడలేదు. అతడు కెప్టెన్‌ కూల్ అని అందరికీ తెలుసు. కానీ మ్యాచ్‌ పరిస్థితిని బట్టి అతడు తన ఎనర్జీని ప్రదర్శించాడు’’ అని రైనా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని