బెయిర్‌ స్టో వివాదాస్పద ఔట్‌ : ఇప్పుడేమో ఇలా.. అప్పుడు ధోనీ ఏం చేశాడంటే..?

యాషెస్‌ సిరీస్‌(Ashes Series 2023) రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో ఔటైన విధానం మరోసారి క్రీడాస్ఫూర్తిపై చర్చకు తెరలేపింది. ఇదే సమయంలో గతంలో ధోనీ(MS Dhoni) ప్రవర్తించిన తీరును పలువురు గుర్తుచేసుకుంటున్నారు.

Updated : 03 Jul 2023 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  యాషెస్‌ సిరీస్‌(Ashes Series 2023) రెండో టెస్టు ముగిసింది. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. అయితే.. చివరి రోజు ఇంగ్లాండ్‌ ఆటగాడు బెయిర్‌ స్టో(Jonny Bairstow ) ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. దీంతో పెద్ద ఎత్తున క్రీడా స్ఫూర్తిపై మరోసారి చర్చ మొదలైంది. ఆసీస్‌ ప్రవర్తనపై పలువురు విమర్శలు చేస్తుండగా.. అది సరైనదేనంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిని పలువురు  గుర్తుచేసుకుంటున్నారు.

ఇప్పుడేం జరిగిందంటే..

యాషెస్‌ సిరీస్‌(Ashes Series 2023) రెండో టెస్టు(ENG vs AUS) చివరి రోజు తొలి సెషన్‌ ఆటలో ఇంగ్లాండ్‌ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో(Jonny Bairstow ) కిందకు వంగాడు. బంతి వికెట్‌ కీపర్‌ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్‌ పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ అప్పీల్‌ చేయగా.. బెయిర్‌స్టో, స్టోక్స్‌తో పాటు ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, స్టాండ్స్‌లోని అభిమానులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. బెయిర్‌స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి మూడో అంపైర్‌ ఎరాస్మస్‌ నాటౌట్‌ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్‌ కాలేదని భావించి బెయిర్‌స్టోను అతడు స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు షాక్‌లో మునిగిపోయారు. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌తో బెయిర్‌స్టో, మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ స్టోక్స్‌ మాట్లాడినా ఫలితం లేకపోయింది.

గతంలో ధోనీ ఏం చేశాడంటే..?

అయితే.. గతంలో 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు(IND vs ENG) లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కానీ ధోనీ(MS Dhoni) క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఔటై మైదానం వీడి వెళ్లిన ఇయాన్‌ బెల్‌ను వెనక్కి రప్పించి మరీ ఆడించాడు.

ఇంగ్లాండ్‌, భారత్‌ల మధ్య నాటింగ్‌హామ్‌ వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ శర్మ వేసిన బంతిని ఇయాన్‌ మోర్గాన్‌ లెగ్‌సైడ్‌ వైపు ఆడాడు. ఫీల్డర్‌ ప్రవీణ్‌ కుమార్‌ బౌండరీ లైన్‌ వద్ద బంతిని ఆపాడు. అయితే.. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు అది రోప్‌ను టచ్‌ చేసి ఉంటుందని భావించారు.

అప్పటికే.. బ్యాటర్లు క్రీజు నుంచి బయటకి వచ్చి నిల్చున్నారు. ప్రవీణ్‌ వెంటనే బంతినందుకుని వికెట్‌ కీపర్‌ ధోనీ వైపు విసిరాడు. మహీ వెంటనే ఫీల్డర్‌కు బంతినందించగా.. బెయిల్స్‌ గిరాటేశాడు. అయితే.. ఆ బంతి బౌండరీయా.. కాదా..? అని తేల్చేందుకు థర్డ్‌ అంపైర్‌కు రెఫర్‌ చేశారు. అది బౌండరీ కాదని తేలడంతో.. మరో ఎండ్‌లో ఉన్న ఇయాన్‌ బెల్‌ రనౌట్‌ అయినట్లు థర్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు. అయితే.. ఈ సమయంలో మహేంద్రుడు మాత్రం క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. తన రనౌట్‌ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. అదే సమయంలో టీ విరామం కోసం ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. విరామం అనంతరం మోర్గాన్‌తో కలిసి బెల్‌ క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌ చేశాడు.

ఇదే సమయంలో కామెంటేటర్లు స్పందిస్తూ..‘‘బౌండరీ లైన్‌ను తాకనందున.. బంతి ఇంకా యాక్షన్‌లోనే ఉంది.. డెడ్‌ కాలేదు. అయితే.. అది ఫోర్‌ అని భావించి ఇద్దరు బ్యాటర్లు క్రీజు దాటారు. అది ఫోర్‌ కాకుంటే.. ఔటే’ అంటూ పేర్కొన్నారు. అయితే.. ధోనీ మాత్రం.. క్రీడాస్ఫూర్తిని చాటి ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ను తిరిగి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీనిపై ఇంగ్లాండ్‌ అభిమానుల నుంచి ధోనీ మన్ననలు పొందాడు.

ఇప్పుడు అదే రీతిలో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెయిర్‌స్టో ఔటయ్యాడు. అయితే.. ఆసీస్‌ కెప్టెన్‌ అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు. దీంతో అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటూ పలువురు ధోనీని మెచ్చుకుంటున్నారు.Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని