Rishabh Pant: పంత్‌ ఎప్పటికి వస్తాడో?

ఒక కాలు ఫిట్‌గా ఉన్నా చాలు జట్టులో పంత్‌ను ఆడించొచ్చని.. మ్యాచ్‌లు మలుపు తిప్పే అతడి సత్తానే ఇందుకు కారణమని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ తాజాగా వ్యాఖ్యానించాడు. మరి ఆ దిశగా పంత్‌ కదులుతున్నాడా?

Published : 16 Jan 2024 09:03 IST

ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన డాషింగ్‌ ఓపెనర్‌ రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) మైదానంలో కనిపించి ఏడాది పైనే అయిపోయింది. అతడు వేగంగా కోలుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కానీ పోటీ క్రికెట్లోకి వచ్చే ఫిట్‌నెస్‌ను అతడు సంతరించుకున్నాడా? సాధన మొదలుపెట్టినా కూడా అతడు యోయో లాంటి క్లిష్టమైన ఫిట్‌నెస్‌ పరీక్షలు అధిగమించగలడా? అన్నది సందేహం. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో రిషబ్‌ను చూడాలనుకోవడం ఆత్యాశే! కానీ ఔట్‌సైడ్‌ ఛాన్స్‌లు కూడా లేవా? కనీసం అతడు రేసులో అయినా నిలవగలడా! ఒక కాలు ఫిట్‌గా ఉన్నా చాలు జట్టులో పంత్‌ను ఆడించొచ్చని.. మ్యాచ్‌లు మలుపు తిప్పే అతడి సత్తానే ఇందుకు కారణమని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ తాజాగా వ్యాఖ్యానించాడు. మరి ఆ దిశగా పంత్‌ కదులుతున్నాడా?

ఐపీఎల్‌తో తొలి అడుగు

2024 ఐపీఎల్‌లో రిషబ్‌ పంత్‌ ఆడబోతున్నట్లు దిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే అతడిని అన్ని మ్యాచ్‌లు ఆడించే సాహసం దిల్లీ చేయకపోవచ్చు. అందుకే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రిషబ్‌ను బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా అతడు ఏమాత్రం ఫిట్‌గా ఉన్నాడు. ఎలా ఆడగలుగుతున్నాడనే విషయాలపై ఓ స్పష్టత రావొచ్చు. వికెట్‌ కీపింగ్‌ అంటే చాలా భారంతో కూడిన పాత్ర. రోడ్డు ప్రమాదంలో ఒకటికి మించిన గాయాల పాలైన పంత్‌ ఈ పాత్రలో ఒదగగలడా అనేది ప్రశ్న.

అందుకే అతడు పూర్తి స్థాయిలో గాడిలో పడేదాకా స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటీవల ఐపీఎల్‌ మినీ వేలంలో దుబాయ్‌కి వెళ్లిన పంత్‌ ఉల్లాసంగా కనిపించాడు. తాను కోలుకునే ప్రక్రియ వేగాన్ని అందుకుందనే వార్త కూడా ఈ సందర్భంగా చెప్పాడు. పంత్‌ త్వరగా ఫిట్‌నెస్‌ సాధిస్తే ఐపీఎల్‌ నాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఫిట్‌ అయినా అతడికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండదు. దీనికి కొంత సమయం పడుతుంది.

దేశవాళీలో ఆడితే..

జాతీయ క్రికెట్‌ అకాడమీలో పంత్‌ సాధన చేస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ నెమ్మదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. నిజానికి పంత్‌కు అయిన గాయాలు పెద్దవే. శస్త్ర చికిత్స తర్వాత మునుపటిలా శరీరం కూడా సహకరించదు. ఒకప్పుడు ఒంటి చేత్తోనే సిక్స్‌లు బాదిన పంత్‌ ఇప్పుడు అలాంటి ఫీట్‌లు చేయడం అంత తేలిక కాదు. దీనికి తోడు అతడు విరామం వల్ల బరువు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాడు. శరీరం నియంత్రణలో ఉన్నట్లు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అతడు ఎప్పుడు సీరియస్‌ మ్యాచ్‌ల్లోకి వస్తాడు అనేది సస్పెన్స్‌గా మారింది. ఐపీఎల్‌ చాలా ఒత్తిడితో కూడిన లీగ్‌. ఇలాంటి లీగ్‌ ద్వారా పునరాగమనం అంటే కూడా పంత్‌కు నిజంగా కష్టమే.

దేశవాళీ టోర్నీలైన రంజీ ట్రోఫీ లాంటి వాటిలో ఆడితే అతడికి తన శరీరంపై ఒక అవగాహన వస్తుంది. ఆట మునుపటిలా ఉందా లేదా అనేది తెలుస్తుంది. దూకుడైన ఆటకు మారుపేరైన రిషబ్‌ పునరాగమనంలో మళ్లీ అలాగే ఆడతాడన్న గ్యారెంటీ లేదు. కొన్నాళ్లు సాహసోపేతమైన షాట్లకు దూరం కావొచ్చు. ఏదేమైనా పంత్‌ రాక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి అతడి గైర్హాజరుతో భారత జట్టులో శాంసన్, జితేశ్‌శర్మలకు అవకాశం దక్కింది. రిషబ్‌ మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించి సత్తా నిరూపించుకోవడమే కాదు.. జట్టులో స్థానం దక్కించుకోవాలంటే శాంసన్, జితేశ్‌ లాంటి వాళ్ల నుంచి పోటీని కూడా ఎదుర్కోవాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని