Rajasthan Vs Hyderabad: ఫైనల్‌కెవరు.. ఇంటికెవరు?

ఐపీఎల్‌-17 ఫైనల్లో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేది! ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. రాజస్థాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య శుక్రవారం క్వాలిఫయర్‌-2 జరగనుంది.

Updated : 24 May 2024 06:54 IST

రాజస్థాన్‌ × హైదరాబాద్‌  క్వాలిఫయర్‌-2 నేడు
చెన్నై

ఐపీఎల్‌-17 ఫైనల్లో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేది! ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. రాజస్థాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య శుక్రవారం క్వాలిఫయర్‌-2 జరగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనే చేశాయి. రాజస్థాన్‌ వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌లో విజయం (బెంగళూరుపై)తో ఉత్సాహంగా ఈ పోరుకు సిద్ధం కాగా.. క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్, రెండో  అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరి  ఏ జట్టుది పైచేయి అవుతుందో?

హిట్టర్లు × స్పిన్నర్లు

హైదరాబాద్‌ పవర్‌ హిట్టర్లు ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మ.. రాయల్స్‌ స్పిన్‌ ద్వయం అశ్విన్, చాహల్‌ మధ్య పోరు ఎలా సాగుతుందన్నది ఆసక్తికరం. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్నదానిపైనే మ్యాచ్‌ గమనం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో పవర్‌ హిట్టింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన హైదరాబాద్‌ ఓపెనర్లు ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. హెడ్‌ 199.62 స్ట్రైక్‌రేట్‌తో 533 పరుగులు చేయగా.. అభిషేక్‌ 207.04 స్ట్రైక్‌రేట్‌తో 470 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి 72 సిక్స్‌లు, 96 ఫోర్లు బాదారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లిద్దరు చాలదన్నట్లు క్లాసెన్‌ (180 స్ట్రైక్‌రేట్‌తో 413) రూపంలో మరో విధ్వంసకారుడు హైదరాబాద్‌ బ్యాటింగ్‌ను భీకరంగా మారుస్తున్నాడు. వీళ్లను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్లకు అంత తేలిక కాదు. అయితే చెపాక్‌లో ఆడడం.. ఉప్పల్‌ లేదా వాంఖడేలో బ్యాటింగ్‌ చేయడానికి పూర్తిగా భిన్నం. బంతి ఆగి వచ్చే చెన్నైలో స్ట్రోక్‌ప్లే బ్యాటర్లకు సవాలే. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. తన కెరీర్‌లో ఇక్కడ ఎంతో క్రికెట్‌ ఆడిన అశ్విన్‌కు ఈ పిచ్‌పై మంచి అవగాహన ఉంది. చాహల్‌ రూపంలో నాణ్యమైన లెగ్‌స్పిన్నర్‌ కూడా జట్టులో ఉన్న నేపథ్యంలో హెడ్, అభిషేక్, క్లాసెన్‌లను త్వరగా వెనక్కి పంపి మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని రాజస్థాన్‌ ఆశిస్తోంది. ఈ స్పిన్నర్లతో పాటు పేసర్లు బౌల్ట్, సందీప్‌ శర్మలతో కూడిన రాయల్స్‌ బౌలింగ్‌ విభాగం ఉత్తమంగా కనిపిస్తోంది. మరోవైపు కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ల రూపంలో సన్‌రైజర్స్‌కు మంచి పేస్‌ దళమే ఉంది. కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపం. మయాంక్‌ మార్కండె ఆకట్టుకోలేకపోయాడు. షాబాజ్‌ అహ్మద్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేస్తున్నా... ప్రాథమికంగా బ్యాటర్‌. మరి ఈ లోపాన్ని సన్‌రైజర్స్‌ ఎలా అధిగమిస్తుందో చూడాలి. హైదరాబాద్‌ అంత భీకరంగా కాకపోయినా.. జైస్వాల్‌ (393), సంజు శాంసన్‌ (521), రియాన్‌ పరాగ్‌  (567), హెట్‌మయర్‌ వంటి వారితో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బాగుంది. వాళ్లను నిలువరించడం హైదరాబాద్‌ బౌలర్లకు సవాలే.

ముఖాముఖిలో...

రెండు జట్లు సమవుజ్జీలని వాటి రికార్డులు కూడా చెబుతున్నాయి. ఈ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా హైదరాబాద్‌ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. రాజస్థాన్‌ 9 మ్యాచ్‌ల్లో పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో తలపడ్డ ఒక్క మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది

ప్లేఆఫ్స్‌లో.. 

ఐపీఎల్‌లో ఆడిన 12  ఫ్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ 5 నెగ్గి.. ఏడింటిలో పరాజయంపాలైంది. పది ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ 5 నెగ్గి, అయిదింటిలో ఓడిపోయింది.

పిచ్‌..

చెన్నైలో వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా మంచు ప్రభావం ఉండొచ్చు. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశాలు మెండు.  ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు ఛేదించిన జట్లే గెలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని