IND vs ENG: జోరూట్‌ను కట్టడి చేయాలంటే ఎలా?

జోరూట్‌ ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది టీమ్‌ఇండియాపై వరుస సెంచరీలు చేసి అదరగొట్టాడు...

Updated : 21 Jun 2022 12:41 IST

టీమ్‌ఇండియాకు పెను సవాల్‌ అతడే..!

జోరూట్‌ ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది టీమ్‌ఇండియాపై వరుస సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇటీవల 10 వేల పరుగుల మైలురాయి చేరుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరోవైపు గత నాలుగు టెస్టుల్లో రెండు శతకాలు బాది మరింత జోరుమీదున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా త్వరలో ఇంగ్లాండ్‌తో ఆడే టెస్టు మ్యాచ్‌లో రూట్‌ను కట్టడి చేయడంపైనే ప్రధానంగా విజయావకాశాలు ఆధారపడ్డాయి.

చరిత్ర తిరగరాయాలేంటే..

టీమ్‌ఇండియా ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో మూడుసార్లు మాత్రమే టెస్టు సిరీస్‌లు గెలిచింది. అది కూడా 1972లో 1-0.. 1986లో 2-0.. 2007లో 1-0 తేడాలతో. అయితే, ఇప్పుడు తొలిసారి 3-1తో గెలుపొంది చరిత్ర తిరగరాసే అద్భుత అవకాశం దొరికింది. వాస్తవానికి ఐదు టెస్టుల ఈ సిరీస్‌ గతేడాదే పూర్తికావాల్సి ఉన్నా కరోనా కేసుల కారణంగా చివరి మ్యాచ్‌ వాయిదా పడింది. అప్పటికి విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు రెండు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే వాయిదాపడిన చివరి టెస్టు జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. దీంతో ఇంగ్లిష్‌ గడ్డపై టీమ్‌ఇండియా చారిత్రక సిరీస్‌ గెలవాలన్నా.. ఇంగ్లాండ్‌ ఆధిపత్యానికి కళ్లెం వేయాలన్నా భారత బౌలర్లు తప్పక రాణించాలి. ఇదివరకు రూట్‌ను ఔట్‌ చేసిన వారిలో బుమ్రా, అశ్విన్‌, జడేజా, కీలక పాత్ర పోషించారు.

బుట్టలో వేయలంటే బుమ్రా..

టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌లో రూట్‌ ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 6 సార్లు ఔటయ్యాడు. భారత్‌ తరఫున అత్యధికసార్లు అతడిని పెవిలియన్‌ పంపింది ఈ టీమ్‌ఇండియా పేసరే. గతేడాది పర్యటనలోనూ నాలుగు మ్యాచ్‌ల్లో బుమ్రా.. మూడు సార్లు రూట్‌ను వెనక్కి పంపాడు. దీన్ని బట్టి అతడిని కట్టడి చేయడంలో బుమ్రా ఎంత ముఖ్య భూమిక పోషిస్తాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రూట్‌ను డకౌట్‌గా వెనక్కి పంపిన ఏకైక బౌలర్‌ బుమ్రానే కావడం గమనార్హం. అతడు విసిరే బుల్లెట్లలాంటి బంతులకు రూట్‌ పలుమార్లు ఎల్బీడబ్ల్యూగా, పలుమార్లు స్లిప్‌లో దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో రూట్‌ ఇన్‌సైడ్‌ వచ్చే బంతుల్ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడని తెలుస్తోంది. దీన్ని బట్టి బుమ్రా బంతిని వికెట్ టు వికెట్‌ సంధిస్తే కాస్త ఇన్‌స్వింగ్‌ ప్రయోగిస్తే కట్టడి చేయొచ్చు.

ఊరించి ఆడించాలంటే జడేజా..

రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనూ రూట్‌ ఇబ్బందిపడిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా 2016-17 హోమ్‌ సిరీస్‌లో అతడిని ఎక్కువ కష్టపెట్టింది ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నరే. మొత్తంగా ఇద్దరి మధ్య జరిగిన పోటీల్లో జడ్డూనే 5 సార్లు రూట్‌ను ఔట్‌చేసి పైచేయి సాధించాడు. అయితే, గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. జడేజా స్పిన్‌లో పేస్‌తో పాటు కచ్చితత్వం ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే అతడు వికెట్లకు కాస్త ముందు ఊరించే బంతులు వేస్తే బ్యాట్స్‌మన్‌ టెంప్ట్‌ అయ్యి ఫ్రంట్‌ఫుట్‌ మీదుగా షాట్లు ఆడతారు. అది మిస్‌ అయితే బౌల్డ్‌ లేదా స్టంపౌట్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వికెట్ల మీదుగా ఆడినా క్యాచ్‌ ఔట్‌ అయ్యే పరిస్థితులు ఉంటాయి. రూట్‌ కూడా పలుమార్లు జడ్డూ బౌలింగ్‌లో ఈ ట్రిక్‌కు బలయ్యాడు.

స్పిన్‌ వలలో చిక్కాలంటే అశ్విన్‌..

ఇక రూట్‌ను బాగా ఇబ్బంది పెట్టే బౌలర్లలో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకడు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ కూడా మెరుగైన ఫలితాలు సాధించాడు. మొత్తం 5 సార్లు రూట్‌ను ఔట్‌ చేసి తన ఆధిపత్యం చాటుకున్నాడు. గతేడాది ఇంగ్లాండ్‌ భారత్‌లో పర్యటించినప్పుడు కూడా రూట్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు అక్షర్‌ పటేల్‌ మూడు సార్లు రూట్‌ను ఔట్‌ చేయగా అశ్విన్‌ సైతం రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ చేశాడు. ముఖ్యంగా అశ్విన్‌ వేసే క్యారమ్‌ బాల్‌ బంతులకు రూట్‌ కాస్త ఇబ్బంది పడినట్లు గతేడాది చూశాం. అయితే, గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో అశ్విన్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. మరి ఇప్పుడైనా అవకాశం వస్తుందా లేదా చూడాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని