IPL 2023 : ఎవరీ సుయాశ్‌ శర్మ..? అందరి దృష్టి ఈ మిస్టరీ స్పిన్నర్‌పైనే..

అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు సుయాశ్‌ శర్మ(Suyash Sharma). మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ మిస్టరీ స్పిన్నర్‌పైనే ఉంది.

Updated : 07 Apr 2023 15:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  తన స్పిన్‌ మాయాజాలంతో రెండో మ్యాచ్‌లో బెంగళూరు (Royal Challengers Bangalore)ను చిత్తు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders). తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం గొప్పగా పుంజుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ అనంతరం అభిమానుల దృష్టి ఆ జట్టు యువ స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మ(Suyash Sharma)పైనే ఉంది. అరంగేట్ర మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసిన ఈ మిస్టరీ స్పిన్నర్‌.. బెంగళూరు బ్యాటింగ్‌ లైనప్‌ వెన్ను విరిచి సత్తా చాటాడు. దీంతో ఈ 19 ఏళ్ల యువ స్పిన్నర్‌ గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు.

తొలి మ్యాచ్‌లోనే ‘ఇంపాక్ట్‌’ చూపించి..

దిల్లీ కుర్రాడైన సుయాశ్‌ శర్మ(Suyash Sharma) అండర్‌-25లో దిల్లీ తరఫున ఆడుతున్నాడు. అయితే, కోల్‌కతాతో అరంగేట్రం చేసే వరకూ అతడు ఇప్పటివరకూ ఎలాంటి లిస్ట్‌-ఏ, ఫస్ట్‌క్లాస్‌, టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. అతడిని కేకేఆర్‌ జట్టు గతేడాది వేలం సందర్భంగా కేవలం రూ.20లక్షల బేస్‌ ప్రైజ్‌కే కొనుగోలు చేసింది. ఇక బెంగళూరుతో మ్యాచ్‌లో సుయాశ్‌ తుదిజట్టులో కూడా లేడు. వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి తొలి మ్యాచ్‌లోనే తన సత్తా ఏమిటో చూపించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంతిని సుడులు తిప్పుతూ.. బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. దినేశ్‌ కార్తిక్‌, రావత్‌, కర్ణ్‌శర్మల వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన మరో మిస్టరీ స్పినర్‌ వరుణ్‌ చక్రవర్తితో కలిసి బెంగళూరు పతనాన్ని శాసించాడు.

క్రికెట్‌లోకి అలా వచ్చాడు..

చిన్నతనంలోనే సుయాశ్‌ ప్రతిభ గుర్తించిన వెటరన్‌ క్రికెట్‌ కోచ్‌ సురేశ్‌ బాత్రా.. అతడి గురించి దిల్లీ మాజీ క్రికెటర్‌ కర్తార్‌ నాథ్‌కు తెలియజేశాడు. దీంతో నాథ్‌ సుయాశ్‌ను పిలిపించి..  అతడి బౌలింగ్‌ను పరిశీలించాడు. అనంతరం డీడీసీఏ లీగ్‌లో అవకాశం  ఇచ్చాడు. ఉత్తర దిల్లీకి చెందిన సుయాశ్‌..ఇంట్లో అందరికంటే చిన్నవాడు. అతడికి సోదరుడి నుంచి ఎంతో సహకారం లభించింది. కరోనా పరిస్థితులకు ముందు నాథ్‌.. సుయాశ్‌కు దిల్లీ అండర్‌-19 జట్టులో అవకాశం ఇప్పించేందుకు ఏకంగా పోరాటమే చేశాడు. కానీ, అది ఫలించలేదు. ఆ తర్వాత మాజీ ఆటగాడు గురుశరణ్‌ సింగ్‌ దిల్లీ  క్రికెట్‌ సలహా సంఘంలో సభ్యుడయ్యాడు. దీంతో నాథ్‌ ఆయన వద్దకు వెళ్లి సుయాశ్‌ గురించి చెప్పాడు. దీనిపై ఓ సందర్భంలో గురుశరణ్‌ మాట్లాడుతూ ‘‘ కర్తార్‌ నాథ్‌ అతడి  గురించి నాకు చెప్పాడు. నేను కూడా ఆ కుర్రాడి బౌలింగ్‌కు ముగ్దుడినయ్యాను. పత్రాలకు సంబంధించి చిన్న సమస్యలు ఉన్నాయి. నాటి డీడీసీఏ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ సమస్యలను పరిష్కరించి సుయాశ్‌ను అండర్‌-25 ఎంపిక చేయడంలో సహకరించాడు’’ అని వెల్లడించాడు.

అయితే.. పెద్దగా అవకాశాలు రాని సమయంలో సుయాశ్‌ తల్లి.. అతడు ఇక క్రికెట్‌ ఆడడని చెప్పిందని నాథ్‌ అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు. ‘2020లో సుయాశ్‌ తల్లి నన్ను పిలిచింది. అతడు ఇక క్రికెట్‌ ఆడడని చెప్పింది. అయితే.. కరోనా పరిస్థితులను వివరించి.. మాకు కొంత సమయం ఇవ్వాలని ఆమెను కోరాం. చివరికి ఆమె అంగీకరించింది’ అని నాథ్‌ వెల్లడించాడు. 

అతడి బౌలింగ్‌ అంచనా వేయడం కష్టం..

ఇక ఈ ఐపీఎల్‌ వేలం ప్రక్రియకు ముందు ముంబయిలోని కేకేఆర్‌ అకాడమీకి వెళ్లాడు సుయాశ్‌. ‘వేలానికి ముందు ఇతర యువ ఆటగాళ్లతో సుయాశ్‌ ఆటను పరిశీలించారు.. అతడి గూగ్లీలను మెచ్చుకున్నారు. అతడు ఏ జట్టులో ఉన్నా.. మెరుస్తాడని భావించారు’ అని అండర్‌-25 మాజీ కోచ్‌ పంకజ్‌ సింగ్‌ తెలిపాడు. ఒక్కసారి కేకేఆర్‌కు ఎంపిక కాగానే.. సుయాశ్‌ నెట్స్‌లో తన స్పిన్‌ను మెరుగుపరుచుకునేందుకు ఎంతో సాధన చేశాడు. అతడి బౌలింగ్‌ను చూసినవారు.. అనుభవజ్ఞులైన బ్యాటర్లు కూడా అతడి విసిరే బంతులను అంచనా వేయడం కష్టంగా ఉందని చెప్తుండేవారు.

అతడు సాధారణ ఆటగాడిగా కనిపించలేదు..

సుయాశ్‌ బౌలింగ్‌ ప్రదర్శనపై కోల్‌కతా కెప్టెన్‌తో పాటు పలువురు సీనియర్లు ప్రశంసలు కురిపించారు. ‘ఆర్సీబీ బ్యాటర్లకు మిడిల్‌ ఓవర్లలో పేస్‌ను ఆఫర్‌ చేయకూడదని మేం ప్లాన్‌ చేసుకున్నాం. తొలి మ్యాచే అయినా.. సుయాశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మేం అతడి గురించి ఇంతవరకూ పెద్దగా తెలుసుకోలేదు కూడా. మూడో స్పిన్నర్‌ అవసరమైతే అతడిని తీసుకోవాలనేది మా ప్రణాళిక. అతడు సాధారణ ఆటగాడిగా కనిపించడంలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు’ అంటూ కెప్టెన్‌ నితీశ్‌ రాణా(Nitish Rana) మెచ్చుకున్నాడు.

‘సుయాశ్‌ను ట్రయల్‌ మ్యాచ్‌ల్లో చూశాం. అతడి పోరాట పటిమ అద్భుతం. అతడి ప్రదర్శనతో మేం ఎంతో సంతోషంగా ఉన్నాం’ అంటూ కోల్‌కతా కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ కొనియాడాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్లైన వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, సుయాశ్‌ శర్మ కలిసి మొత్తం 9 వికెట్లు తీసి బెంగళూరును 123 పరుగులకే ఆలౌట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని