World Cup 2023 Final: ఎవరో ఆ ఎక్స్‌ ఫ్యాక్టర్‌

క్రికెట్లో సాధారణంగా టీమ్‌గా రాణించడం వల్లే ఎక్కువ విజయాలు వస్తాయి. కానీ కొన్నిసార్లు ఒక్క ఆటగాడే అంతా తానై ఒంటి చేత్తో గెలుపు అందిస్తాడు. ఈసారి ప్రపంచకప్‌లో మ్యాక్స్‌వెల్‌ రూపంలో అలాంటి ఉదాహరణ చూశాం. గతంలోనూ ప్రపంచకప్‌లలో అలా కీలకంగా మారి ప్రత్యర్థులను దెబ్బ కొట్టిన ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లే ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్స్‌.

Published : 18 Nov 2023 19:15 IST

క్రికెట్లో సాధారణంగా టీమ్‌గా రాణించడం వల్లే ఎక్కువ విజయాలు వస్తాయి. కానీ కొన్నిసార్లు ఒక్క ఆటగాడే అంతా తానై ఒంటి చేత్తో గెలుపు అందిస్తాడు. ఈసారి ప్రపంచకప్‌లో మ్యాక్స్‌వెల్‌ రూపంలో అలాంటి ఉదాహరణ చూశాం. గతంలోనూ ప్రపంచకప్‌లలో అలా కీలకంగా మారి ప్రత్యర్థులను దెబ్బ కొట్టిన ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లే ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్లేయర్స్‌. ఎక్కువ ఇది బ్యాటింగ్‌లోనే చూస్తుంటాం. ముఖ్యంగా అనూహ్యమైన భారత పిచ్‌లపై అలాంటి.. కీలక తరుణాల్లో అసాధారణంగా ఆడే ఆటగాళ్లు కావాలి. మరి ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్లో (ODI World Cup 2023 Final) అలాంటి పాత్ర ఎవరు పోషించబోతున్నారో!

లాగేస్తారు వాళ్లు

1996 ప్రపంచకప్‌లో అరవింద డిసిల్వా, 2003లో రికీ పాంటింగ్, 2007లో గిల్‌క్రిస్ట్, 2011లో మహేంద్రసింగ్‌ ధోని, గంభీర్, 2019లో బెన్‌స్టోక్స్‌ మ్యాచ్‌ ఫలితాలనే శాసించే ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా 1996లో డిసిల్వా కౌంటర్‌ అటాకింగ్‌ ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా ఊహించలేకపోయింది. బలమైన ఆస్ట్రేలియా కచ్చితంగా కప్‌ సాధిస్తుందని అనుకున్న సమయంలో డిసిల్వా క్లాసిక్‌ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు ఆశలను అడియాశలు చేశాడు. 2003లో పాంటింగ్, 2007లో గిల్‌క్రిస్ట్‌ ఇన్నింగ్స్‌లు మరో ఎత్తు.. ప్రత్యర్థి తేరుకునేలోపే మ్యాచ్‌ను తిప్పేశారు. 2003లో అయితే భారత్‌తో ఫైనల్లో పాంటింగ్‌ ఊచకోత మామూలుగా సాగలేదు. ఏ బౌలర్‌ని లెక్కచేయకుండా అతడు ఎడాపెడా బాదడం వల్లే ఆసీస్‌ భారీ స్కోరు చేసి భారత్‌కు అవకాశమే లేకుండా చేసింది. 2011లో మొదట గంభీర్‌.. చివర్లో ధోని నిలిచి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. 2019లో మాత్రం బెన్‌స్టోక్స్‌ ఇక సాధ్యం కాదు అనుకున్న విజయాన్ని అనితర సాధ్యమైన ఆటతో సుసాధ్యం చేశాడు. 

మరి ఈసారి!

ఈసారి వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ఒకరికి మించి ఒకరు రాణించారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ పోటీపడి ఆడారు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తక్కువేమి కాదు. మరి వీరిలో ఎక్స్‌ఫ్యాక్టర్‌గా నిలిచేందుకు కోహ్లికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతటి ఫామ్‌లో ఉన్నాడతను. ఒకవేళ 2007లో గిల్లీ తరహాలో శుభ్‌మన్‌ గిల్‌ అనూహ్యంగా చెలరేగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గిల్‌ ఇప్పటిదాకా తన మార్కు చూపించలేదు. ప్రత్యర్థులకు అతడిపై దృష్టి ఉండే ఛాన్స్‌ తక్కువ. అందుకే ఫైనల్లో అతడు అదరగొడితే ఆసీస్‌కు షాకే. పైగా తనకు కలిసొచ్చే అహ్మదాబాద్‌ స్టేడియంలో మ్యాచ్‌ కావడంతో శుభ్‌మన్‌ మెరుపులపై భారత్‌ ఆశతో ఉంది. అతడు దూకుడుగా ఆడి రోహిత్‌ కాస్త తగ్గి ఆడే వ్యూహం ప్రత్యర్థికి మాస్టర్‌స్ట్రోక్‌ కావొచ్చు. మరోవైపు ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే కష్టమే. ఆ జట్టులో అందరూ ప్రమాదకారులే. ముఖ్యంగా టావిస్‌ హెడ్‌ ఈ ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారే ఛాన్స్‌ ఉంది. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో అదరగొట్టిన అతడు తుది పోరులో అదే జోరు ప్రదర్శించే ఛాన్స్‌ ఉంది. ఇక చూస్తుండగానే మ్యాచ్‌ను ఏకపక్షం చేయగల సత్తా ఉన్న వార్నర్, మిచెల్‌మార్ష్‌లను కూడా తక్కువ అంచనా వేయలేం. మిచెల్‌ బ్యాట్‌తోనే కాదు బంతితోనూ ప్రభావం చూపగల ఆటగాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని