Uday-Sachin: తండ్రి కోరికే ‘ఉదయ్‌’ స్ఫూర్తి... నాన్న శ్రమే ‘సచిన్‌’ కెరీర్‌!

అండర్ -19 వరల్డ్‌ కప్‌ 2024లో (U19 World Cup 2024) అత్యధిక పరుగులు చేసిన తొలి ముగ్గురు బ్యాటర్లు భారత్‌కు చెందినవారే కావడం విశేషం. అందులో ఇద్దరు ఇప్పుడు హైలైట్‌గా నిలిచారు.

Updated : 07 Feb 2024 16:55 IST

అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశారు ఇద్దరు కుర్రాళ్లు. ఆ యువ క్రికెటర్ల ఆటతీరుకు ఉద్ధండులే ఆశ్చర్యపోయారు. అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ను సెమీస్‌కు చేర్చిన సచిన్‌, ఉదయ్‌ గురించే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఒకరు దూకుడుగా ఆడి దిగ్గజ క్రికెటర్ పేరుకు తగ్గ ఆటగాడిగా నిలిస్తే... మరొకరు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి తాను నాయకుడు ఎందుకయ్యాడో నిరూపించాడు. వాళ్లే ఉదయ్‌ సహరన్‌, సచిన్‌ దాస్‌. 

భారత యువ క్రికెటర్లు ఉదయ్, సచిన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక సెమీస్‌ పోరులో ఒత్తిడికి చిత్తవకుండా... ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను ఓడించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల జోరును కాచుకుని మరీ జట్టును గెలిపించారు. గ్రూప్‌, సూపర్‌ సిక్స్‌ దశలో అదరగొట్టిన టాప్‌ ఆర్డర్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో జట్టు పనైపోయింది అనుకుంటే... తామున్నది ఆ అంచనాలను తలకిందులు చేయడానికే అన్నట్లుగా ఆడారు. ఒక్కో పరుగు కూడబెట్టుకుంటూ ఆఖరివరకు ఉంటే గెలుపుతథ్యం అని నమ్మి ఆడారు. వాళ్లపై టీమ్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. విజయం మనదే అనుకుంటున్న తరుణంలో పెవిలియన్‌కు చేరినా వారిద్దరి స్ఫూర్తితో లోయర్‌ ఆర్డర్‌ గెలిపించింది. ఇలాంటి కీలక ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఉదయ్‌, సచిన్‌ జీవితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 


నాన్న ఆటే స్ఫూర్తిగా... 

‘సెమీస్‌ ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నావ్‌?’ అని ఉదయ్‌ను అడిగితే... చాలా సింపుల్‌గా ‘మా నాన్న నుంచి నేర్చుకున్నదిదే...’ అని తేల్చేశాడు. ఉదయ్‌ తండ్రి ప్రతాప్‌ సహరన్‌ సర్టిఫైడ్‌ క్రికెట్‌ కోచ్‌. ఇప్పటివరకు అండర్‌- 19 ప్రపంచకప్‌లో భారత జట్టును ఐదుగురు కెప్టెన్లు మాత్రమే ఫైనల్‌కు చేర్చగా... అందులో ఉదయ్‌ కూడా ఒకడు. తండ్రి కోచ్‌ అయినా అందరి ఆటగాళ్ల మాదిరిగానే ఉదయ్‌ సహరన్‌కూ (Uday Saharan) ఆరంభంలో కష్టాలు తప్పలేదు. రాజస్థాన్‌లోని గంగానగర్‌ నుంచి వచ్చిన ఉదయ్‌ క్రికెట్ కెరీర్‌ పంజాబ్‌ నుంచి మొదలైంది. అండర్ 14, అండర్ 16, అండర్ 19 అంటూ ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చాడు. ఛాలెంజర్స్‌ ట్రోఫీలో తన నాయకత్వ పటిమతో మేనేజ్‌మెంట్‌ను ఆకర్షించాడు. ఇండియా B కెప్టెన్‌గా ఐదు మ్యాచుల్లో 297 పరుగులు చేశాడు.

ప్రతాప్‌ సహరన్‌ ఆయుర్వేద వైద్యుడిగానూ పని చేస్తున్నారు. అయితే పెద్ద క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓ స్థాయి వరకే పరిమితం కావాల్సి వచ్చింది. కోచ్‌గా మారి మరీ తన కుమారుడిని ప్రోత్సహించి భారత యువ జట్టుకు ఎంపిక కావడంలో కీలకపాత్ర పోషించారు. ‘ఎక్కువ ఫోర్లు కొట్టలేదనే బాధ లేదు. మా నాన్న కూడా తాను ఆడే రోజుల్లో ఇలా నిలకడతనం ప్రదర్శించేవాడు. ఇప్పుడు నేను కూడా అలాగే ఆఖరివరకు ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించేందుకు ప్రయత్నం చేశా’’ అని సహరన్‌ సెమీస్‌ విజయం తర్వాత చెప్పాడు. 


అప్పు చేసి... క్రికెటర్‌ను చేసి...

సచిన్‌ దాస్‌ (Sachin Dhas) మహారాష్ట్రలోని బీడ్‌లో జన్మించాడు. తండ్రి సంజయ్‌ దాస్‌కు క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అంటే ఇష్టం. ఆ తర్వాత సచిన్‌ తెందూల్కర్‌ను అభిమానిస్తారు. దీంతో తన కుమారుడికి సచిన్‌ పేరునే పెట్టారు. సచిన్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వేసుకునేవాడు యువ సచిన్‌ దాస్‌. అది తనకు స్ఫూర్తినిస్తుందని నమ్మేవాడు. సంజయ్‌ దాస్ కూడా యూనివర్సిటీ స్థాయి క్రికెటర్. కానీ, అంతకంటే ముందుకువెళ్లలేకపోయారు. తన కుమారుడు మాత్రం క్రికెటర్‌గా రాణించాలని ఆశ పడ్డాడు.

అప్పు చేసి మరీ తన కొడుకు కోసం టర్ఫ్ పిచ్‌ను తయారుచేయించారు. పిచ్‌పై నీరు చల్లించేందుకు రెండు లేదా మూడు రోజులకోసారి వాటర్‌ ట్యాంక్‌ను పిలిపించేవారు. సచిన్ దాస్‌ చిన్ననాటి కోచ్ అజహర్‌ కూడా సంజయ్‌ దాస్‌ శ్రమను గుర్తు చేసుకున్నాడు. సచిన్‌ దాస్‌ మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో కొల్హాపుర్‌ టస్కర్స్‌ తరఫున అదరగొట్టాడు. అదే తనను అండర్ 19 వరల్డ్‌ కప్‌ వరకు తీసుకొచ్చింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో సచిన్‌ మూడో స్థానంలో (294 పరుగులు) ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో ఉదయ్‌ (389), ముషీర్‌ (338) నిలిచారు. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని