WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్‌ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..

డబ్ల్యూపీఎల్‌ వేలం (WPL 2024 Auction) నిర్వహణకు ప్లేయర్ల జాబితా, ఫ్రాంచైజీలు సిద్ధం. ఇలాంటి కీలకమైన కార్యక్రమం నిర్వహించాలంటే ఆక్షనీర్‌ కూడా యాక్టివ్‌గా ఉండటంతోపాటు ప్లేయర్లపై అవగాహన ఉండాలి. మరి ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించబోయే మల్లికా సాగర్‌ గురించి తెలుసుకుందాం.. 

Published : 09 Dec 2023 12:45 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2024 (WPL 2024) సీజన్‌కు సంబంధించి ప్లేయర్ల వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ముంబయి వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మహిళల లీగ్‌ ఈ ఏడాదే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రెండో సీజన్‌ జరగనుంది. కీలకమైన డబ్ల్యూపీఎల్ ఆక్షన్‌ను సమర్థంగా నిర్వహించేందుకు మల్లికా సాగర్ సిద్ధంగా ఉన్నారు. తొలి సీజన్‌కూ ఆమెనే ఆక్షనీర్. దీంతో ఈమె ఎవరు? అని క్రికెట్‌ అభిమానులు నెట్టింట శోధన మొదలు పెట్టేశారు.

మల్లికా సాగర్‌ ముంబయికి చెందిన ఆర్ట్‌ కలెక్షన్ కన్సల్టెంట్‌. ప్రస్తుతం ఆర్ట్‌ ఇండియా సంస్థలో పనిచేస్తున్నారు. 46 ఏళ్ల మల్లికా సాగర్‌ వ్యక్తిగత విశేషాలు మాత్రం ఎక్కడా వెల్లడి కాలేదు. అయితే, కెరీర్‌ పరంగా 2000లో ఆర్ట్‌ కలెక్షన్‌ను ప్రారంభించారు. న్యూయార్క్‌లో మోడర్న్‌ ఇండియన్ ఆర్డ్‌ క్రిస్టీ తొలి సేల్‌కు క్యూరేటర్‌గా వ్యవహరించారు. ముంబయి పండోల్స్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఆక్షన్‌ను నిర్వహించిన అనుభవం అమె సొంతం. ఆ తర్వాత క్రీడల పట్ల ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. మల్లికా డబ్ల్యూపీఎల్ తొలి వేలం మాత్రమే కాకుండా.. గతంలో ప్రొ కబడ్డీ లీగ్‌కు (2021లో) సంబంధించిన వేలం కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పురుషుల ఐపీఎల్‌ 2024 వేలం కూడా మల్లికాతో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలూ వస్తున్నాయి. పురుషుల ఐపీఎల్‌ వేలాన్ని హ్యూ ఎడ్మీడ్స్, రిచర్డ్‌ మ్యాడ్లీ, చారు శర్మ ఇప్పటి వరకు నిర్వహించారు. దుబాయ్‌ వేదికగా డిసెంబర్‌ 19న ఐపీఎల్‌ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. 

ఇక డబ్ల్యూపీఎల్ వేలం విషయానికొస్తే.. మొత్తం 165 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 104 మంది భారత్‌ నుంచి, మరో 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్‌ దేశాల నుంచి కూడా 15 మంది క్రికెటర్లు వేలంలోకి వచ్చారు. గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీలు 30 స్లాట్‌ల కోసం వేలంలో పాల్గొననున్నాయి. అందులోనూ గుజరాత్‌ అత్యధికంగా 10 మందిని కొనే అవకాశం ఉంది. ప్రతి గంటకు ఓ పది నిమిషాల బ్రేక్‌ సమయం బీసీసీఐ కేటాయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని