టెస్టులో స్టోక్స్.. టీ20ల్లో కోహ్లి.. వన్డేల్లో మ్యాక్స్‌వెల్?

అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏవి అని అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. కానీ, వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్‌ వన్డేల్లో అత్యుత్తమం అనే చర్చ నడుస్తోంది. దీంతో టీ20, టెస్టుల్లో బెస్ట్‌ ఇన్నింగ్స్‌పై చర్చ మొదలైంది. 

Published : 08 Nov 2023 19:05 IST

వివిధ ఫార్మాట్లలో ఉత్తమ ఇన్నింగ్స్‌లపై చర్చ

క్రికెట్లో టెస్టు ఫార్మాట్‌ది 136 ఏళ్ల చరిత్ర.. వన్డే క్రికెట్ 52 ఏళ్లుగా సాగుతోంది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్‌ 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏవి అని అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఒకరు ఫలానా ఇన్నింగ్స్ అద్భుతం అంటే.. ఇంకొకరు మరో ఇన్నింగ్స్‌ను ప్రస్తావించి దాన్ని మించింది మరొకటి లేదు అంటారు. ఐతే మరీ చరిత్ర లోతుల్లోకి వెళ్లకుండా ఆధునిక క్రికెట్ వరకు పరిశీలిస్తే.. ఉత్తమ ఇన్నింగ్స్‌లు ఏవన్నది ఒక అంచనాకు రావచ్చు. తాజాగా వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో మంగళవారం అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఆడిన ఇన్నింగ్స్ వన్డేల్లో అత్యుత్తమం అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో టెస్టులు, టీ20ల్లో ‘ది బెస్ట్’ ఇన్నింగ్స్‌ల గురించి మెజారిటీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

కపిల్‌ నుంచి మ్యాక్స్‌వెల్‌ దాకా..

వన్డే క్రికెట్లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఏది అంటే.. ఎక్కువమంది 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్‌ను ప్రస్తావించేవారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 17 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోతే.. కపిల్ మొండిపట్టుదలతో నిలిచి 175 పరుగుల అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించాడు. జట్టును గెలిపించాడు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కపిల్ ఆడిన ఇన్నింగ్స్‌ను ఉత్తమమైందిగా పేర్కొనేవారు. ఇక 2009లో ఆస్ట్రేలియాపై ఛేదనలో సచిన్ 175 పరుగుల ఇన్నింగ్స్, 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఛేదనలో కోహ్లి 183 పరుగుల ఇన్నింగ్స్, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో స్టోక్స్ 85 పరుగుల అజేయ ఇన్నింగ్స్ లాంటివి కూడా గొప్ప వన్డే ప్రదర్శనలుగా పేరు తెచ్చుకున్నాయి.

ఐతే మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ వీటికంటే ప్రతికూల పరిస్థితుల్లో సాధించింది కావడం దానికి విశిష్ఠతను తీసుకొస్తోంది. అఫ్గాన్‌పై 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన స్థితిలో అవతల ఒక టెయిలెండర్‌ను పెట్టుకుని.. డబుల్ సెంచరీ సాధించి అజేయంగా నిలవడం, జట్టును గెలిపించడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒక దశలో కాలి గాయంతో క్రీజులో నిలవడం కూడా కష్టమైన స్థితిలో మ్యాక్స్‌వెల్ అసాధారణ రీతిలో పోరాడిన తీరు చరిత్రలో నిలిచిపోయేదే. అందుకే చాలామంది దీన్ని ఉత్తమ వన్డే ఇన్నింగ్స్‌గా పేర్కొంటున్నారు.

మోడర్న్ గ్రేటెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్‌

సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అని ఒకదాన్ని ఎంచుకోవాలంటే చాలా కష్టమే. అయితే ఆధునిక క్రికెట్లో మాత్రం బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ఎక్కువమంది ‘ది బెస్ట్’గా చెబుతారు. 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజేతగా నిలిపిన బెన్ స్టోక్స్.. ఇంకో నెల రోజులకే టెస్టుల్లో అద్భుతం చేశాడు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ముందు 359 పరుగుల భారీ లక్ష్యం నిలవగా.. 286 పరుగులకే ఆ జట్టు 9 వికెట్లు కోల్పోవడంతో ఓటమి లాంఛనమే అని అంతా అనుకున్నారు. స్టోక్స్ ఒక ఎండ్‌లో నిలబడ్డప్పటికీ... ఒక్క వికెట్టే చేతిలో ఉండగా కమిన్స్‌, హేజిల్‌వుడ్, ప్యాటిన్సన్, లైయన్‌లతో కూడిన బలమైన ఆసీస్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని ఇంకో 76 పరుగులు చేయడం అసాధ్యమే అనిపించింది. కానీ లీచ్ (1 నాటౌట్‌)ను అవతల పెట్టుకుని అసాధారణంగా పోరాడిన స్టోక్స్ జట్టుకు సంచలన విజయాన్నందించాడు. దీన్ని మోడర్న్ గ్రేటెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్‌గా క్రికెట్ పండితులు పేర్కొంటారు.

8 బంతుల్లో 28 పరుగులు.. టీ20 కిరీటం కోహ్లికే

టీ20 క్రికెట్లో గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ విషయంలో అంతగా భిన్నాభిప్రాయాలు లేవు. ఆ కిరీటాన్ని కోహ్లికి కట్టబెట్టడం మీద ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ కోహ్లి ఇన్నింగ్స్ గొప్పదనం అర్థమయ్యే ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మామూలుగానే ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. అలాంటిది బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలవగా.. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది భారత్. ప్రతి బంతికీ వికెట్ పడేలా కనిపిస్తూ, సింగిల్ తీయడం కూడా సవాలుగా మారిన స్థితిలో కోహ్లి యోధుడిలా నిలబడి జట్టును గెలిపించిన తీరు అసామాన్యం. హార్దిక్ పాండ్య (40) విరాట్‌కు అండగా నిలిచినప్పటికీ.. తీవ్ర ఒత్తిడిలో కోహ్లి అద్భుతమైన షాట్లు ఆడుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించిన వైనాన్ని అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ముఖ్యంగా 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సినపుడు మ్యాచ్ మీద అందరూ ఆశలు కోల్పోగా.. హారిస్ రవూఫ్ బంతులకు కళ్లు చెదిరే సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. తర్వాతి ఓవర్లోనూ సంచలన షాట్‌తో జట్టుకు విజయాన్నందించాడు. ఛేదనలో, తీవ్ర ఒత్తిడిలో విరాట్ చేసిన 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను టీ20ల్లో ‘ది బెస్ట్’గా పేర్కొంటారు విశ్లేషకులు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు