T20 League: టీ20 లీగ్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన వీరులు

భారత టీ20 లీగ్‌ తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉత్కంఠభరింతంగా సాగుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు గెలుపొందింది. 

Published : 27 May 2022 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత టీ20 లీగ్‌ తుది అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉత్కంఠభరింతంగా సాగుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు గెలుపొందింది. శుక్రవారం రాజస్థాన్‌, బెంగళూరు మధ్య క్వాలిఫయర్‌-2 జరగనుండగా.. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. మరి ఇప్పటివరకు టీ20 లీగ్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో శతకాలు బాదిన వీరులు ఎవరో ఓ లుక్కేద్దాం.

మురళీ విజయ్ 

టీ20 లీగ్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో తొలిసారి శతకం బాదింది చెన్నై బ్యాటర్ మురళీ విజయ్. 2012 క్వాలిఫయర్‌-2లో దిల్లీ, చెన్నై జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దిల్లీ బౌలర్లకు చెన్నై ఆటగాడు మురళీ విజయ్‌ చుక్కలు చూపించాడు. కేవలం 58 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. దీంతో చెన్నై 222/5 స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ  136 పరుగులకే కుప్పకూలడంతో చెన్నై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.  

వీరేంద్ర సెహ్వాగ్‌

ప్లే ఆఫ్స్‌లో రెండో సెంచరీ బాదిన క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. 2014 క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో చెన్నై, పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. పంజాబ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (122; 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీర విహారం చేశాడు. దీంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనకు దిగిన చెన్నై 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. దీంతో  పంజాబ్‌ 24 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

వృద్ధిమాన్‌ సాహా

టీ20 లీగ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో శతకం బాదిన మూడో ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా. 2014 ఫైనల్స్‌లో కోల్‌కతా, పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా (115; 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతక్కొట్టాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా ఏడు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించి టైటిల్‌ని ముద్దాడింది.

షేన్‌ వాట్సన్‌

టీ20 లీగ్‌ 2018 ఫైనల్స్‌లో హైదరాబాద్‌, చెన్నై జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చెన్నై రెండు వికెట్లు నష్టపోయి 9 బంతులు మిగిలుండగానే ఛేదించి ఛాంపియన్‌గా అవతరిచింది. చెన్నై విజయంలో షేన్‌ వాట్సన్‌ కీలకపాత్ర పోషించాడు. కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 117 పరుగులు చేసిన వాట్సన్‌ ప్లే ఆఫ్స్‌లో శతకం బాదిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు.

రజత్ పాటిదార్‌

టీ20 లీగ్‌ ప్లే ఆఫ్స్‌లో శతకం బాదిన ఐదో క్రికెటర్ రజత్‌ పాటిదార్‌. 2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూ, బెంగళూరు జట్లు తలపడ్డాయి. రజత్ పాటిదార్‌ (112; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు)  విధ్వంసం సృష్టించడంతో బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని