Vvs laxman: లక్ష్మణ్‌ భవితవ్యమేంటి?

ఓవైపు రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో టీమ్‌ఇండియా కోచ్‌ అయ్యేదెవరన్న దానిపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు జాతీయ క్రికెట్‌ అకాడమీలో హెడ్‌ ఆఫ్‌ ద క్రికెట్‌గా లక్ష్మణ్‌ పదవీ కాలం ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో అతడి భవితవ్యమేంటన్నదీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Published : 25 May 2024 03:44 IST

చెన్నై: ఓవైపు రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో టీమ్‌ఇండియా కోచ్‌ అయ్యేదెవరన్న దానిపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు జాతీయ క్రికెట్‌ అకాడమీలో హెడ్‌ ఆఫ్‌ ద క్రికెట్‌గా లక్ష్మణ్‌ పదవీ కాలం ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో అతడి భవితవ్యమేంటన్నదీ ఆసక్తి రేకెత్తిస్తోంది. లక్ష్మణ్‌ ఒప్పుకుంటే టీమ్‌ఇండియా కోచ్‌ పదవిని తనకివ్వడానికి బీసీసీఐ సుముఖంగానే కనిపిస్తుండగా.. ఈ హైదరాబాదీ దిగ్గజ ఆటగాడు మాత్రం అనాసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీఏలో అధిపతిగా సెప్టెంబరులో లక్ష్మణ్‌ పదవీ కాలం ముగుస్తుంది. మూడేళ్లకు పైగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న     వీవీఎస్‌.. ఇండియా-ఎ, అండర్‌-19 జట్లకు కోచ్‌గానూ వ్యవహరించాడు. ద్రవిడ్‌ అందుబాటులో లేనపుడు కొన్ని పర్యటనల్లో టీమ్‌ఇండియాకు తాత్కాలిక కోచ్‌గానూ వ్యవహరించాడు. ఈ అనుభవంతో టీమ్‌ఇండియాకు లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరిస్తే బాగుంటుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. కానీ లక్ష్మణ్‌ మాత్రం ఈ బాధ్యతలు చేపట్టడానికి సుముఖంగా లేడని తెలుస్తోంది. ఎన్‌సీఏ బాధ్యతల్లో కొనసాగడానికి కూడా వీవీఎస్‌ ఆసక్తితో లేడు. అతను ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు హైదరాబాద్‌ లేదా మరో ఫ్రాంఛైజీలో మెంటార్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి గౌతమ్‌ గంభీర్‌ టీమ్‌ఇండియా కోచ్‌ పదవికి ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నాడు.

ఆస్ట్రేలియన్లను సంప్రదించలేదు: టీమ్‌ఇండియా కోచ్‌ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లెవ్వరితోనూ సంప్రదింపులు జరపలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. భారత కోచ్‌ పదవి కోసం ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, జస్టిన్‌ లాంగర్‌ల పేర్లు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో అతను స్పందించాడు. ‘‘ఏ ఆస్ట్రేలియా ఆటగాడినీ కోచ్‌ పదవి కోసం సంప్రదించలేదు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలు అవాస్తవం. భారత క్రికెట్‌ నిర్మాణం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కోసమే  మేం చూస్తున్నాం’’ అని జై షా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని