No.4 in Team India: నాలుగులో నిలబడేదెవరు ... యువీ వారసుడి కోసం కొనసాగుతున్న వేట

టీమ్‌ ఇండియాలో యువరాజ్‌ సింగ్‌ తర్వాత ఎవరు? ఈ ప్రశ్న చాలా రోజుల నుండి వస్తూనే ఉంది. యువీ రిటైర్‌ అయ్యాక ఆ నాలుగో స్థానంలో ఇప్పటివరకు స్థిరమైన ఆటగాడు దొరకలేదు. దొరికినా ఇప్పుడు అందుబాటులో లేరు. వన్డే ప్రపంచ కప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. మరి ఆ స్థానంలో ఎవరు?

Updated : 23 Aug 2023 16:40 IST

ఇంకో నెలన్నరలో వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023). సొంతగడ్డపై జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగనున్న భారత జట్టు (Team India).. ఈ పాటికి ప్రతి స్థానంలోనూ ఒక స్థిరమైన ఆటగాడిని ఖరారు చేసుకుని ఉండాలి. కానీ టీమ్‌ఇండియా ఇంకా వేర్వేరు స్థానాల్లో వేర్వేరు ఆటగాళ్లను ఆడిస్తూ ప్రయోగాలు కొనసాగిస్తోంది. కీలకమైన నాలుగో స్థానం  (2nd Down)లో ఎవరు ఆడతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

అవును.. వన్డేల్లో నాలుగో స్థానం మాకు సమస్యగా మారిన మాట వాస్తవం. ఆ స్థానంలో యువరాజ్‌ సింగ్‌ తర్వాత ఎవరూ నిలకడగా ఆడలేదు

- ఇటీవల భారత వన్డే సారథి రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలివి. 

వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తుండగా.. స్వయంగా కెప్టెన్‌ రోహిత్‌ ఈ మాట అన్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ మెగా టోర్నీలో రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం ఖాయం. మూడో స్థానంలో ఎప్పట్నుంచో విరాట్‌ కోహ్లి ఆడుతున్నాడు. కానీ అతడి తర్వాత బ్యాటింగ్‌కు ఎవరు వస్తారనే విషయంలో స్పష్టత లేదు. కొన్ని నెలల ముందు వరకు శ్రేయస్‌ అయ్యర్‌ ఆ స్థానంలో ఆడేవాడు. ప్రపంచకప్‌లోనూ అతనే నంబర్‌ 4లో ఆడతాడని అనుకున్నారు. 

కానీ ఈ ఏడాది ఆరంభంలో గాయపడ్డ అతను.. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పటికీ కోలుకోలేదు. శ్రేయస్‌ ప్రపంచకప్‌లో ఆడటమూ సందేహంగానే ఉంది. గతంలో కొన్ని మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో ఆడిన కేఎల్‌ రాహుల్‌ సైతం శ్రేయస్‌ లాగే కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స చేయించుకుని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతను కూడా ప్రపంచకప్‌ ఆడటం అనుమానంగానే ఉంది.

దీర్ఘ కాల సమస్య

వన్డేల్లో టీమ్‌ఇండియా నాలుగో నంబర్‌ సమస్య ఈనాటిది కాదు. రోహిత్‌ అన్నట్లు యువరాజ్‌ సింగ్‌ తర్వాత ఎవ్వరూ ఆ స్థానంలో కుదురుకోలేదు. టాప్‌ఆర్డర్, మిడిలార్డర్‌ మధ్య వారధిగా నిలిచే ఆ స్థానంలో యువరాజ్‌ దీర్ఘ కాలం బ్యాటింగ్‌ చేశాడు. ఆ స్థానంలో అతను 108 ఇన్నింగ్స్‌లు ఆడి 35.20 సగటుతో 2,415 పరుగులు సాధించాడు. కానీ 2017లో యువీ నిష్క్రమించాక ఎవ్వరూ ఆ స్థానంలో నిలదొక్కుకోలేదు. గత అయిదారేళ్లలో పది మందికి పైగానే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం గమనార్హం. 

అజింక్య రహానె, మనీష్‌ పాండే, అంబటి రాయుడు, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌.. ఇలా చాలామందిని భారత్‌ ప్రయత్నించి చూసింది. మిగతా వారితో పోలిస్తే శ్రేయస్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు. 20 ఇన్నింగ్స్‌లో 47.35 సగటుతో 805 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లందరి గణాంకాలు పేలవం. శ్రేయస్‌ రూపంలో మంచి ప్రత్యామ్నాయం దొరికినట్లే అనుకునే సమయానికి అతను గాయపడి ప్రపంచకప్‌నకు అనుమానంగా మారడంతో ఆ స్థానంలో ఎవరిని ఆడించాలో తెలియని అయోమయం నెలకొంది.

మనోడికి ఛాన్సుందా?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో సూర్య కుమార్, ఇషాన్‌ కిషన్‌ మాత్రమే నాలుగో స్థానానికి చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయాలు. కానీ టీ20ల్లో మెరుపులు మెరిపిస్తున్న సూర్యకుమార్‌.. వన్డేల్లో ఇంకా రుజువు చేసుకోలేదు. ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌లో మెరుగ్గా ఆడుతున్నాడు కానీ.. నాలుగో స్థానానికి సరిపోడనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ గురించి చర్చ జరుగుతోంది. 20 ఏళ్ల ఈ ఎడమ చేతివాటం బ్యాటర్‌ ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 

వెస్టిండీస్‌తో సిరీస్‌లో తిలక్‌ చక్కటి ప్రదర్శన చేశాడు. 5 మ్యాచ్‌ల్లో 177 పరుగులు సాధించాడు. తిలక్‌ వర్మ నిలకడ, దూకుడు, పరిణతి చూసి అతణ్ని వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలని మాజీలతో పాటు అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. టీ20ల్లో అతనాడింది నాలుగో స్థానంలోనే కావడం విశేషం. వన్డేల్లో కూడా ఆ స్థానానికి అతను సరిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సెలక్టర్లు, జట్టు యాజమాన్యం ఆలోచన ఎలా ఉందో చూడాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని