Kolkata Vs Hyderabad: తొలి అడుగు ఎవరిదో

రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్‌ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్‌-1.

Updated : 21 May 2024 07:11 IST

నేడు క్వాలిఫయర్‌-1
కోల్‌కతా × హైదరాబాద్‌
రాత్రి 7.30 నుంచి 
అహ్మదాబాద్‌

రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్‌ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్‌-1. బాదుడు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆదివారమే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన ఈ రెండు జట్లకూ తక్కువ విరామమే లభించింది. అయితే పంజాబ్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన నేపథ్యంలో కమిన్స్‌ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ ఊపు తమవైపే ఉన్నట్లు భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా చివరి మ్యాచ్‌ (రాజస్థాన్‌తో) వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రద్దయింది. అయితే అంతకుముందు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గడంతో నైట్‌రైడర్స్‌ విశ్వాసంతో ఉంది.


అటూ.. ఇటూ

రైన్, శ్రేయస్, నితీష్‌ రాణా, రింకు, రసెల్‌ వంటి వారితో కోల్‌కతా బ్యాటింగ్‌.. హెడ్, అభిషేక్‌ శర్మ, క్లాసెన్, త్రిపాఠిలతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తున్నాయి. మరో కీలక బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ (435 పరుగులు) స్వదేశానికి వెళ్లిపోవడం మాత్రం కోల్‌కతాకు  ప్రతికూలాంశమే. అయితే మిచెల్‌ స్టార్క్, నరైన్, వరుణ్, రసెల్‌లతో నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ కూడా బాగుంది. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ వంటి వారితో కూడిన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దళం సమష్టిగా రాణిస్తోంది.


ముఖాముఖిలో..

ముఖాముఖి పోరులో కోల్‌కతాదే పైచేయి. కోల్‌కతా 17 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. మొదట కోల్‌కతా 208/7 స్కోర్‌ చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్‌ 204/7 చేసింది. సన్‌రైజర్స్‌తో గత తొమ్మిది మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ ఏడు నెగ్గడం గమనార్హం. నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడడం ఈ జట్లకు ఇదే తొలిసారి.


ప్లేఆఫ్స్‌లో..

ప్లేఆఫ్స్‌లో ఈ జట్ల రికార్డు దాదాపు ఒకే రకంగా ఉంది. కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌లో ఎనిమిది నెగ్గి అయిదు ఓడిపోగా..  సన్‌రైజర్స్‌ అయిదు గెలిచి, ఆరు ఓడింది.


  • 2023 సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో మరే స్పిన్నర్‌ కూడా వరుణ్‌ చక్రవర్తి కన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టలేదు. అతడు 26 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు చేజిక్కించుకున్నాడు. 
  • 100 ఐపీఎల్‌ సిక్స్‌లకు నరైన్‌ నాలుగు సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్‌లోనే అతడు 32 సిక్స్‌లు కొట్టాడు. అభిషేక్‌ ఈ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు (41) కొట్టిన బ్యాటర్‌. 
  • ఐపీఎల్‌ 2024లో భువనేశ్వర్‌ 31 యార్కర్‌లు వేశారు. ఒక్క బుమ్రా మాత్రం ఈ సీజన్‌లో అతడికన్నా ఎక్కువ (56) యార్కర్లు వేశాడు. 

పిచ్‌.. వాతావరణం

పిచ్‌ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు