IPL 2024 Auction: ఐపీఎల్ 2024 మినీ వేలం.. ఈసారి వీరిదే హవా!

అద్భుత ఫామ్‌లో ఉండి.. ఐపీఎల్‌ (IPL) వేలంలోకి వస్తే చాలు కాసుల పంట పండినట్లే. ఆ ఆటగాడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడతాయి. 

Updated : 17 Dec 2023 10:12 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో (IPL) అడుగు పెడితే కాసుల వర్షం.. ఒక్క సీజన్‌లో అదరగొట్టినా చాలు మార్కెట్‌ అమాంతం పెరిగిపోతుంది. ఇలా జరగాలంటే మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేయడం తప్పనిసరి. ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం జరగనుంది. ఈ ఏడాది సంచలనంగా మారిన ఆటగాళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడవడం ఖాయం. మరి ఏ ప్లేయర్‌కు ఎంతమేర అదృష్టం ఉందో కానీ.. ఆ జాబితాలో ఉన్న టాప్‌ విదేశీ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.. 

  1. ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా): లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా తన సత్తా ఏంటో చూపించాడీ ఆసీస్‌ ఓపెనర్. వన్డే ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా ఆరోసారి నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2016-17 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన హెడ్‌.. ఆ తర్వాత ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి తన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన హెడ్‌ రూ. 2 కోట్ల కనీస ధరతో మినీ వేలంలోకి వచ్చాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా బౌలర్‌గానూ రాణించగల ఆటగాడు ట్రావిస్ హెడ్. గత మెగా వేలంలో హెడ్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం గమనార్హం.
  2. రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర మూడు సెంచరీలు సాధించాడు. 600కిపైగా పరుగులు రాబట్టాడు. ఓపెనర్‌గా రావడంతోపాటు స్పిన్నర్‌గా బౌలింగ్‌ చేసే రచిన్‌ ఈసారి ఐపీఎల్‌ మినీ వేలంలో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఈ టాప్‌ ఆల్‌రౌండర్‌ కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తం వెచ్చించేందుకు వెనుకాడకపోవచ్చు. ఎడమచేతివాటం కలిగి ఉండటం కూడా అతడికి కలిసొచ్చే అంశమే. భారత మూలాలు కలిగిన పాతికేళ్ల రచిన్‌ తొలిసారి వన్డే ప్రపంచ కప్‌లో ఆడినప్పటికీ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. 
  3. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (అఫ్గానిస్థాన్‌): అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో మంచి ధరను దక్కించుకోవడంతోపాటు నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు మరో ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్‌ కూడా మెగా టోర్నీలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. భారీ షాట్లను కొట్టగలిగే ఒమర్జాయ్‌.. మీడియం పేసర్‌ కావడం అతడికి కలిసొస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రికెట్‌లో పేస్‌ ఆల్‌రౌండర్లు వచ్చేది చాలా తక్కువ. దీంతో ఫ్రాంచైజీలు అతడిపై దృష్టిసారించే అవకాశం ఉంది. 
  4. గెరాల్డ్‌ కొయిట్జీ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ గెరాల్డ్‌ కొయిట్జీ పేస్‌ సంచలనంగా మారాడు. సఫారీ జట్టు మాజీ పేసర్ డేల్‌ స్టెయిన్‌ను తలపించేలా దూసుకుపోతున్నాడు. వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుకోవడంలో గెరాల్డ్‌ కీలక పాత్ర పోషించాడు. కేవలం 8 మ్యాచుల్లోనే 20 వికెట్లు తీశాడు. నిలకడగా 140 కి.మీకిపైగా వేగంతో బంతులను సంధించడమే కాకుండా.. డెత్‌ ఓవర్లలో వేరియేషన్స్‌తో బౌలింగ్‌ చేయడం ఇతడి స్పెషాలిటీ. 
  5. డారిల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌): వన్డేల్లో నాలుగో స్థానం అత్యంత కీలకం. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బ్యాటర్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాలి. కానీ, కివీస్‌ బ్యాటర్ డారిల్‌ మిచెల్‌ మాత్రం వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడేస్తాడు. అలాగని త్వరగా వికెట్‌ను సమర్పించే రకం కాదు. మంచి ఫామ్‌లో ఉన్న డారిల్‌ ఈసారి మినీ వేలంలో భారీ ధర దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన అనుభవం డారిల్‌కు ఉంది. 
  6. వనిందు హసరంగ (శ్రీలంక): రిటెన్షన్‌/రిలీజ్‌ ప్రక్రియలో వనిందు హసరంగను ఆర్‌సీబీ వదిలేసింది. గతేడాదితోపాటు ఈ సంవత్సరం కూడా ప్రదర్శనపరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. గతేడాది జరిగిన వేలంలో రూ. 10.75 కోట్లను దక్కించుకున్న హసరంగ.. ఈసారి కూడా మంచి ధరనే సొంతం చేసుకునే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంతోపాటు టాప్‌ స్పిన్నర్‌ కావడమే దానికి కారణం. లోయర్‌ ఆర్డర్‌లో భారీ షాట్లను అలవోకగా కొట్టేస్తాడు. ప్రధాన స్పిన్నర్‌గా కీలకమైన వికెట్లూ తీయగలడు. 
  7. వాండర్‌ డసెన్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ బ్యాటర్ వాండర్‌ డసెన్ వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మ్యాచుల్లో 448 పరుగులు చేసిన డసెన్ రెండు సెంచరీలు కూడా బాదాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున 2022 సీజన్‌లో ఆడినప్పటికీ మూడు మ్యాచుల్లో కేవలం 22 పరుగులే చేశాడు. దీంతో అతడిని ఆర్‌ఆర్‌ రిలీజ్‌ చేసింది. గతేడాది జరిగిన వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగినా.. అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కానీ, ఈసారి మాత్రం తన అదిరే ఫామ్‌తో మంచి ధరను సొంతం చేసుకోవడం ఖాయమేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా. 
  8. జిమ్మీ నీషమ్‌ (న్యూజిలాండ్): గత ఐపీఎల్‌ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చాడు. కానీ, నిరాశ ఎదురైంది. ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని తీసుకొనేందుకు ఆసక్తి చూపలేదు. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. వన్డే ప్రపంచ కప్‌ లీగ్‌ స్టేజ్‌లో ఆసీస్ నిర్దేశించిన 389 పరుగుల లక్ష్య ఛేదనలో రచిన్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఆరో స్థానంలో వచ్చిన నీషమ్‌ కేవలం 39 బంతుల్లోనే 58 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కేవలం ఐదు పరుగుల తేడాతో కివీస్‌ ఓడినప్పటికీ.. నీషమ్‌ పోరాటం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో మినీ వేలంలో నీషమ్‌కు మంచి ధర పలికే అవకాశం లేకపోలేదు.
  9. దిల్షాన్‌ మదుషంక (శ్రీలంక): నాలుగు ఓవర్ల కోటాలో భారీగా పరుగులు ఇవ్వకుండా.. వికెట్లు తీయడం చాలా కష్టం. అదీనూ వీరబాదుడు ఉండే టీ20ల్లో తేలికైన విషయం కాదు. కానీ, బౌలింగ్‌లో వైవిధ్యం చూపిస్తే బ్యాటర్లను కట్టడి చేయొచ్చని ఇప్పటికే కొందరు బౌలర్లు నిరూపించారు. శ్రీలంక యువ బౌలర్‌ దిల్షాన్‌ మదుషంక ఇదే కోవకు చెందుతాడు. వన్డే ప్రపంచ కప్‌లో కేవలం 9 మ్యాచుల్లోనే 21 వికెట్లు తీసి అదరహో అనిపించాడు. ఈసారి వేలంలో తప్పకుండా ఇతడిపై ఫ్రాంచైజీలు దృష్టిపెట్టడం ఖాయం. ఎడమచేతివాటం పేసర్‌ కావడం కూడా మదుషంకకు ప్లస్‌ పాయింట్‌. 
  10. మిచెల్‌ స్టార్క్ (ఆస్ట్రేలియా): దాదాపు ఎనిమిదేళ్ల కిందట ఐపీఎల్‌ ఆడిన మిచెల్ స్టార్క్‌ మరోసారి ఈ మెగా టోర్నీలోకి అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నాడు. చివరిసారిగా 2014-15 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జెర్సీతో ఐపీఎల్‌ ఆడాడు. ఇటీవల వన్డే ప్రపంచ కప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలపడంలో స్టార్క్‌ కీలక పాత్ర పోషించాడు. పది మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. పవర్‌ ప్లే ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేసే స్టార్క్‌ ఓపెనర్లను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని