IND vs ENG: కోహ్లి లేడు.. మరి వచ్చేదెవరు?

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Updated : 23 Jan 2024 19:27 IST

ఇంగ్లాండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌ (IND vs ENG 2024)కు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా (Team India)కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి (Virat Kohli) వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపే ఆస్కారముంది. స్వదేశంలో సిరీస్‌లో విరాట్‌ లాంటి ఆటగాడు జట్టులో లేకపోవడం తీరని లోటే. అతణ్ని భర్తీ చేసే స్థాయి ఉన్న ఆటగాడు మరొకరు లేరనే చెప్పాలి. కానీ ఇప్పుడు తొలి రెండు టెస్టుల కోసం అతని స్థానంలో మరో ఆటగాణ్ని తీసుకోక తప్పని పరిస్థితి. మరి సెలక్షన్‌ కమిటీ, టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ఇప్పుడు ప్రశ్న. నలుగురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. మరి జట్టులోకి వచ్చేదెవరు? 

వెటరన్‌కు మరో ఛాన్స్‌?

కోహ్లి దూరమవడంతో జట్టులోకి సీనియర్‌ టెస్టు ఆటగాడు చెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara)ను తీసుకునే అవకాశాలున్నాయి. చివరగా నిరుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పుజారా ఆడాడు. ఫామ్‌లో లేని కారణంగా ఆ తర్వాత అతణ్ని పరిగణించడం లేదు. కానీ ఇప్పుడు మరోసారి పుజారా గురించి సెలక్టర్లు ఆలోచించే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న పుజారా మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో ఝార్ఖండ్‌పై ఈ సౌరాష్ట్ర ఆటగాడు అజేయంగా 243 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత వరుసగా 49, 43, 43, 66 పరుగుల చొప్పున సాధించాడు. తాజాగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక 103 టెస్టుల అనుభవం కూడా పుజారాకు కలిసొచ్చేదే. 

ముందంజలో రజత్‌

కోహ్లి స్థానంలో జట్టులోకి వచ్చేందుకు ముగ్గురు యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఇందులో రజత్‌ పటీదార్‌ (Rajat Patidar) ముందంజలో ఉన్నాడు. ఈ మధ్యప్రదేశ్‌ ఆటగాడు ఇప్పుడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. పైగా కోహ్లి లాగే నాలుగో స్థానంలో రజత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో భారత్‌- ఎ తరపున తొలి అనధికార టెస్టులో 151 పరుగులు చేశాడు. అంతకుముందు అదే జట్టులో వార్మప్‌ మ్యాచ్‌లో 111 స్కోరు సాధించాడు. 30 ఏళ్ల రజత్‌ ఇప్పటివరకూ 55 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 45.97 సగటుతో 4000 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలున్నాయి. ఇక 2021-22లో మధ్యప్రదేశ్‌ రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో రజత్‌ కీలక పాత్ర పోషించాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 82.25 సగటుతో 658 పరుగులు చేశాడు. ఫైనల్లో ముంబయిపై సెంచరీ సాధించాడు. 

ఈ ఇద్దరూ

గత నాలుగు సీజన్ల నుంచి ముంబయి తరపున దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో 2020 ఏడాది నుంచి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 82.46 సగటుతో 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది సర్ఫరాజ్‌ ఒక్కడే. ఈ ప్రదర్శన సర్ఫరాజ్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. భారత్‌లోని స్పిన్‌ పిచ్‌లపై స్పిన్‌ సమర్థంగా ఆడగలిగే సర్ఫరాజ్‌ జట్టులో కీలకమవుతాడనే అంచనాలున్నాయి. కానీ షార్ట్‌పిచ్‌ బంతులను ఆడటంలో బలహీనత, భారత్‌- ఎ తరపున నిలకడ లేమి అతనికి ప్రతికూలంగా మారాయి. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 26 ఏళ్ల సర్ఫరాజ్‌ 65 ఇన్నింగ్స్‌ల్లో 68.20 సగటుతో 3751 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు వార్మప్‌ మ్యాచ్‌లో 96 పరుగులు సాధించాడు. 

మరోవైపు తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్‌ కూడా రేసులో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఇంత వేగంగా పురోగతి సాధించిన మరో ఆటగాడు లేడనే చెప్పాలి. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన అతను.. వరుసగా రెండు అర్ధసెంచరీలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎర్ర బంతి క్రికెట్లోనూ సుదర్శన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. 2022-23 రంజీ ట్రోఫీలో 12 ఇన్నింగ్స్‌ల్లో 47.66 సగటుతో 572 పరుగులు చేశాడు. కొంతకాలంగా భారత్‌- ఎ తరపున ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు. మరి వీళ్లలో జట్టులోకి వచ్చేది ఎవరో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని