Bangalore: కెప్టెన్‌ మారినా.. తలరాత మారలేదు

ఈసారి బెంగళూరు కెప్టెన్‌ మారినా.. తలరాత మారలేదు. 15వ సీజన్‌లోనూ ఆ జట్టు ఉత్తి చేతులతోనే ఇంటిముఖం పట్టింది...

Published : 28 May 2022 12:38 IST

బెంగళూరు కొంపముంచింది వీళ్లే..!

ఈసారి బెంగళూరు కెప్టెన్‌ మారినా.. తలరాత మారలేదు. 15వ సీజన్‌లోనూ ఆ జట్టు ఉత్తి చేతులతోనే ఇంటిముఖం పట్టింది. గత రెండేళ్ల మాదిరే ఈసారి కూడా ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌ చేరేలాగే కనిపించింది. దీంతో అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ, రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలై వారి ఆశలను ఆవిరిచేసింది. బెంగళూరు ఈసారి విఫలమవ్వడానికి పలు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

కోహ్లీ ఇక మారడా..?

(Photo: Virat Kohli Instagram)

విరాట్‌ కోహ్లీ ఈ సారి కెప్టెన్సీ వదిలేయడంతో బ్యాట్స్‌మన్‌గా రాణిస్తాడని, అతడి బ్యాట్‌ నుంచి పరుగుల వరద పారుతుందని టోర్నీ ప్రారంభానికి ముందు అభిమానులంతా ఆశించారు. కానీ, మ్యాచ్‌లు మొదలయ్యాక అసలు పరిస్థితి తెలిసొచ్చింది. ఆఫ్‌స్టంప్‌ బయట పడిన బంతుల్ని ఆడటంలో తన బలహీనతల్ని చాటుకుంటూ ఈ టోర్నీలో మరింత విఫలమయ్యాడు. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌పై 73 పరుగులు చేసి మళ్లీ టచ్‌లోకి వచ్చినట్లు సంకేతాలు ఇచ్చాడు. కానీ, ప్లేఆఫ్స్‌లో మళ్లీ విఫలమై పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో కోహ్లీ నాలుగు సార్లు సింగిల్‌ డిజిట్‌కు, మూడు సార్లు గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. దీన్నిబట్టి కోహ్లీ ఈ సీజన్‌లో ఎలా విఫలమయ్యాడో అర్థం చేసుకోవచ్చు. కనీసం అతడు ప్లేఆఫ్స్‌ లాంటి కీలక మ్యాచ్‌ల్లో రాణించినా బెంగళూరు పరిస్థితి మరోలా ఉండేది. మొత్తంగా కోహ్లీ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 115.99 స్ట్రైక్‌రేట్‌తో 341 పరుగులు చేశాడు. సగటు 22.73గా నమోదవ్వగా 2 అర్ధశతకాలు సాధించాడు.

మాక్స్‌వెల్‌ కొట్టకపాయె..

(Photo: Glenn Maxwell Instagram)

గతేడాది మాక్స్‌వెల్‌ బెంగళూరు తరఫున అదరగొట్టాడు. అప్పుడు 15 మ్యాచ్‌ల్లో 144.10 స్ట్రైక్‌రేట్‌తో 42.75 సగటు నమోదు చేసి 513 పరుగులు చేశాడు. దీంతో ఈ సారి కూడా మరింత రెచ్చిపోయి ఆడతాడని ఆశించిన బెంగళూరు అతడిని అలాగే అట్టిపెట్టుకుంది. కానీ, మాక్స్‌వెల్‌ ఈసారి మంచి స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నా రెండు మ్యాచ్‌ల్లో మినహా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. పలు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించే స్కోర్లు చేసినా అవి తన స్థాయికి తగ్గ ప్రదర్శనలు కావు. ముఖ్యంగా కీలకమైన ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్‌పై 24, లఖ్‌నవూపై 9 పరుగులే చేసి నిరాశపరిచాడు. గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు చివరి వరకూ క్రీజులో ఉంటే స్కోర్‌ బోర్డు మరింత పెరిగేది. కానీ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో మొత్తానికి ఈ సీజన్‌లో మాక్సీ 13 మ్యాచ్‌లు ఆడి 169.10 స్ట్రైక్‌రేట్‌తో 301 పరుగులే చేశాడు. సగటు 27.36గా నమోదు చేశాడు.

వీళ్ల గురించి అస్సలు చెప్పొద్దు..

(Photo: Mahipal Lomror Instagram)

ఇక మొదట్లో ఓపెనర్‌గా వచ్చిన అనుజ్‌ రావత్‌.. మిడిల్‌ ఆర్డర్‌లో మహిపాల్‌ లోమ్రర్‌, షాబాజ్‌ అహ్మద్‌ల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఈ ముగ్గురూ తలో మ్యాచ్‌లో మినహా జట్టును గెలిపించాలనే కసితో ఆడినట్లు కనిపించలేదు. అనుజ్‌ 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క అర్ధశతకంతో 129 పరుగులు చేశాడు. సగటు 16.13గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్‌ 109.32గా ఉంది. ఇక షాబాజ్‌ అహ్మద్‌ 16 మ్యాచ్‌ల్లో ఆడినా మొత్తం 219 పరుగులే చేశాడు. సగటు 27.38, స్ట్రైక్‌రేట్‌ 120.99. అలాగే మహిపాల్‌ లోమ్రర్‌ 4 మ్యాచ్‌ల్లో 86 పరుగులే చేశాడు. సగటు 17.20, స్ట్రైక్‌రేట్‌ 150.88. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమైతే బాధ్యతగా ఆడాల్సిన వీరు ఈ సీజన్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇతర జట్లలో లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సైతం దంచికొడుతుంటే వీళ్లు మాత్రం తమకేమీ పట్టనట్టు కనిపించారు.

అంతా దినేశ్‌ కార్తీక్‌ చలవే‌..

(Photo: Dinesh Karthik Instagram)

ఈ సీజన్‌లో బెంగళూరు తరఫున టాప్‌ ఆర్డర్‌లో అంతో ఇంతో మెరిసిన బ్యాట్స్‌మన్‌ ఎవరంటే కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌. అతడు 16 మ్యాచ్‌ల్లో 3 అర్ధ శతకాలతో 468 పరుగులు చేశాడు. సగటు 31.20 నమోదవ్వగా.. 127.52 స్ట్రైక్‌రేట్‌తో ఫర్వాలేదనిపించాడు. తర్వాత ఫినిషర్‌ పాత్ర పోషించిన దినేశ్‌ కార్తీక్‌ బెంగళూరు తరఫున అతిగొప్ప ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో కొన్ని విలువైన విజయాలు అందించాడు. అసలు బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరడం కూడా అతడి చలవే. సీజన్‌ మొత్తం చివరి క్షణాల్లో అదిరిపోయే ప్రదర్శన చేసిన డీకే ఈ టోర్నీలోనే మేటి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా 16 మ్యాచ్‌ల్లో 55.00 సగటుతో.. అదిరిపోయే 183.33 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. కానీ, కీలకమైన క్వాలిఫయర్‌-2లో రెచ్చిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

అయితే బౌలింగ్‌ పరంగా బెంగళూరు ఈసారి బాగానే ఆకట్టుకుందని చెప్పాలి. హసరంగ, హెజిల్‌వుడ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌ లాంటి బౌలర్లు ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసి ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. కానీ బ్యాట్స్‌మెన్‌ సరిగా ఆడకపోవడమే ఆ జట్టు కొంపముంచింది. దీంతో ఈసారి కూడా బెంగళూరు ఉత్తి చేతులతో తిరిగిరావడానికి ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే అని స్పష్టంగా కనిపిస్తోంది. 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని