Ben Stokes Returns: స్టోక్స్‌ ఎందుకంత స్పెషల్‌... ఇంగ్లాండ్‌ ఎందుకు పట్టుబట్టింది!

భారత్‌లో త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023)లో ఇంగ్లాండ్‌ తరఫున బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) ఆడనున్నాడు. అందులో ప్రత్యేకం ఏముంది అనుకుంటున్నారా? ఆయన రిటైర్‌మెంట్‌ వెనక్కి తీసుకొని మరీ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌ (England) పట్టుబట్టి మరీ స్టోక్స్‌ను వెనక్కి తెచ్చుకుంది కూడా. 

Updated : 17 Aug 2023 18:33 IST

ఆ ఆటగాడు వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. చివరగా వన్డే మ్యాచ్‌ ఆడి ఏడాది దాటిపోయింది. అతని వయసు 32 ఏళ్లు. మళ్లీ వన్డేలు ఆడడం అసాధ్యమనిపించింది. కానీ అలా జరిగి ఉంటే.. మిగతా ఆటగాళ్లకు అతనికి తేడా ఏముంటుంది? ఆ ఆటగాడు ఎందుకంత ప్రత్యేకం అవుతాడు? వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) నేపథ్యంలో ఇంగ్లాండ్‌ (England) ఆ ఆటగాణ్ని కావాలనుకుంది. ఎలాగైనా మెగా టోర్నీలో ఆడించాలని పట్టుబట్టింది. చివరకు రిటైర్మెంట్‌ నుంచి బయటకు వచ్చేలా చేసింది. జట్టు బలంగానే ఉన్నా.. ఆ ఒక్క ఆటగాడి కోసం ఎదురు చూసిందంటే అతనెంత ప్రత్యేకమో అర్థమవుతోంది. అవును.. అతని ఆట ప్రత్యేకం. మైదానంలో అతని ఉనికి ప్రత్యేకం. అతనే.. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెంజామిన్‌ ఆండ్రూ స్టోక్స్‌. క్లుప్తంగా చెప్పాలంటే బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes). 

అతని ఉనికి..

ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌గా.. కోచ్‌ మెక్‌కలమ్‌తో కలిసి ‘బజ్‌బాల్‌’ ఆటతీరుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు కొత్త కళను తీసుకొస్తున్నాడు స్టోక్స్‌. అతని సారథ్యంలోని ఇంగ్లాండ్‌ టెస్టుల్లో సంచలన విజయాలు సాధించడమే కాదు.. ఆ ఫార్మాట్‌కే ఆదరణ పెంచుతుందనడంలో సందేహం లేదు. నిరుడు ఏప్రిల్‌లో టెస్టు జట్టు పగ్గాలు అందుకున్నాడు స్టోక్స్‌. కానీ మూడు ఫార్మాట్లలోనూ ఆడడం శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపుతుందని భావించి 2022 జులై 18న వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి టెస్టుల్లో జట్టును నడిపిస్తూ.. టీ20ల్లో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మైదానంలో అతని ఉనికే జట్టులో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అతనో పోరాట యోధుడు. 2019 ప్రపంచకప్‌.. ఆ తర్వాత యాషెస్‌ సిరీస్‌.. ఇలా అతని అసాధారణ ప్రదర్శనతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. 

ఎదురు దెబ్బలను దాటి స్టోక్స్‌ ఈ స్థాయికి చేరాడు. కోల్‌కతాలో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో 19 పరుగులు కాపాడుకోవాల్సిన స్థితిలో స్టోక్స్‌ బౌలింగ్‌కు దిగాడు. కానీ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ వరుసగా నాలుగు సిక్సర్లతో విండీస్‌ను గెలిపించాడు. ఆ తర్వాతి ఏడాది ఓ క్లబ్‌ బయట ఓ వ్యక్తిపై దాడికి పాల్పడడంతో స్టోక్స్‌ జట్టుకు చాలా రోజులు దూరమ్యాడు. కానీ ఈ సమస్యలను దాటి, బలంగా పుంజుకుని జట్టులో అడుగుపెట్టి తిరిగి అదరగొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌.. మూడు విభాగాల్లోనూ వంద శాతం ప్రదర్శన ఇస్తూ సాగుతున్నాడు. అలాంటి ఆటగాడు కాబట్టే ఈ ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌లో స్టోక్స్‌ను ఆడించేందుకు కెప్టెన్‌ బట్లర్, కోచ్‌ మాథ్యూ మ్యాట్‌ పట్టుబట్టారు. 

ప్రపంచకప్‌ల హీరో..

క్రికెట్‌ పుట్టినిల్లుగా పేరుగాంచిన ఇంగ్లాండ్‌ వన్డే ప్రపంచకప్‌ కలను తీర్చడంలో స్టోక్స్‌ది కీలక పాత్ర. 1975 నుంచి ప్రపంచకప్‌లో ఆడుతున్నా.. 2019 వరకూ ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. నాలుగేళ్ల క్రితం సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లిష్‌ జట్టు విజయకేతనం ఎగురవేయడంలో ఆల్‌రౌండర్‌గా స్టోక్స్‌ ప్రధాన భూమిక పోషించాడు. ఆ టోర్నీలో 11 మ్యాచ్‌ల్లో 66.42 సగటుతో 465 పరుగులు (5 అర్ధశతకాలు) చేయడంతో పాటు ఫాస్ట్‌బౌలింగ్‌తో ఏడు వికెట్లూ పడగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. న్యూజిలాండ్‌తో ఛేదనలో స్టోక్స్‌ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను టై చేసి జట్టును గట్టెక్కించాడు. సూపర్‌ ఓవర్లోనూ రాణించాడు. అది కూడా టై కావడంతో బౌండరీల సంఖ్యతో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. స్టోక్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 

ఇక నిరుడు ఇంగ్లాండ్‌ రెండో సారి టీ20 ప్రపంచకప్‌ దక్కించుకోవడంలోనూ స్టోక్స్‌ తన వంతు పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌తో ఫైనల్లో అజేయంగా 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అందుకే ఈ సారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్న ఇంగ్లాండ్‌.. మరోసారి స్టోక్స్‌ను కావాలనుకుంది. పైగా భారత్‌లో వన్డేల్లో అతనికి మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 6 వన్డేల్లో 255 పరుగులు చేసిన అతను.. 9 వికెట్లు పడగొట్టాడు. అందుకే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో అతను మరోసారి ఇంగ్లాండ్‌కు కీలకం కానున్నాడు. స్టోక్స్‌ ఇప్పటివరకూ 105 వన్డేల్లో 2924 పరుగులు, 74 వికెట్లు సాధించాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని