KL Rahul: కేఎల్‌కు దక్కని చోటు.. విశ్రాంతినిచ్చారా? పక్కన పెట్టారా..?

ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ.. కేఎల్ రాహుల్‌ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది.

Updated : 10 Jan 2024 11:52 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌తో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 50 ఓవర్లపాటు వికెట్ కీపింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఇటీవల టెస్టుల్లోనూ రాణించాడు. అలాంటి కేఎల్ రాహుల్‌ను (KL Rahul) అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు పక్కన పెట్టేయడం అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. సీనియర్లు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ.. కేఎల్ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరించిందనే చర్చ మొదలైంది.

అతడి స్థానం తేల్చలేకనేనా? 

కేఎల్ రాహుల్‌ టెస్టులు, వన్డేల్లో మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగేవాడు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ (IND vs AFG) కోసం ప్రకటించిన జట్టులో యువ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్‌ ఉన్నారు. రోహిత్ శర్మతో కలిసి వీరిలో ఒకరు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఓపెనింగ్‌ స్లాట్‌ ఖాళీగా లేదు. రోహిత్, కోహ్లీ ఉండటంతో టాప్‌ ఆర్డర్‌లోనూ ప్లేస్‌ లేదు. వికెట్‌ కీపర్లుగా జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌ను తీసుకున్న మేనేజ్‌మెంట్ ఎవరిని తుది జట్టులో ఆడిస్తుందనేది ఆసక్తికరం. అటు మిడిలార్డర్‌లోనూ రింకు సింగ్‌, శివమ్‌ దూబె వంటి హిట్టర్లను ఎంపిక చేసింది. ఇటీవల రింకు అద్భుత ‘షినిషర్‌’గా మారాడు. 

ఆ సిరీస్‌ కోసం విశ్రాంతినిచ్చారా?

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కేఎల్ నాయకత్వం వహించాడు. రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆడాడు. ఈ నెల 25నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ మొదలుకానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరుకోవడానికి ఇది అత్యంత కీలకం. ఇప్పటికే బుమ్రా, సిరాజ్‌ వంటి పేసర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. ఆ జాబితాలోకి కేఎల్‌ను చేర్చింది. ఐదు టెస్టుల్లో వికెట్‌ కీపింగ్‌తోపాటు మిడిలార్డర్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. వరుసగా సిరీస్‌లు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చి ఉంటారని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇది ప్రామాణికం కాకపోవచ్చు..

టీ20 ప్రపంచకప్‌ ముగింట కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 సిరీస్‌ను భారత్‌ ఆడనుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం ఐపీఎల్‌ 2024 సీజన్‌ జరగనుంది. అఫ్గాన్‌తో సిరీస్‌లో ఆడకలేక పోతే.. పొట్టి కప్‌లో చోటు దక్కదనే అనుమానాలు అవసరం లేదు. ఐపీఎల్‌లో రాణిస్తే ప్రపంచ కప్‌లోకి తలుపులు తెరుచుకుంటాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఆ లీగ్‌లో మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్‌ కప్‌ జట్టులోకి రావడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని