Cummins - SRH: కమిన్స్‌కు రూ. 20.5 కోట్లు... అంత అవసరమేంటి? అతని స్పెషలేంటి?

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ పాట్‌ కమిన్స్‌ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అతని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత రేటు పెట్టింది.?

Updated : 19 Dec 2023 17:39 IST

ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటతీరు మీద ఎన్నో ఏళ్లుగా విమర్శలు వస్తున్నాయి. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు విషయంలోనూ అదే పరిస్థితి. ఈసారి ఏమవుతుందో అనుకున్న అభిమానులకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం పెద్ద షాక్‌ ఇచ్చింది. రూ.20.5 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. అసలు అంత మొత్తం ఎందుకు పెట్టింది... కమిన్స్‌ ప్రత్యేకత ఏంటి? 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఏటా భారీ అంచనాలతో బరిలోకి దిగుతుంది. తీరా అసలు ఆట మొదలయ్యే సమయానికి తీవ్రంగా నిరాశపరుస్తుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు... ఎస్‌ఆర్‌హెచ్‌ (SRH) ఓటమికి చాలా కారణాలున్నాయి. అయితే గత రెండు సీజన్లుగా బాగా ఇబ్బంది పెట్టిన అంశం మాత్రం కెప్టెన్సీ. ఉన్న ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదు. సరైన స్థానంలో సరైన బ్యాటర్‌ను పంపడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమిన్స్‌ (Pat Cummins) ను హైదరాబాద్‌ కొనుగోలు చేసింది అంటున్నారు. 

కమిన్స్‌ కోసం జరిగిన వేలం పాటలో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడి మరీ హైదరాబాద్‌ సాధించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో నిలిచిన కమిన్స్‌కు అంత ధర పలుకుతుందని అనుకున్నవాళ్లు తక్కువే ఉంటారు. ఒకదశలో హైదరాబాద్‌ దూకుడు చూసి ‘ఎందుకిలా?’ అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ ఆసీస్‌ కెప్టెన్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది అని చెప్పొచ్చు. ఎస్‌ఆర్‌హెచ్‌కు అర్జెంట్‌గా ఓ విజయవంతమైన కెప్టెన్‌ కావాలి. అలాగే ఆడాలి, ఆడిపించాలి. ఇదే కమిన్స్‌ కోసం అంత ధర పెట్టడానికి కారణం అనుకోవచ్చు. 

ప్రపంచ కప్‌ హీరో

ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో కమిన్స్‌ సత్తా ఏంటో అందరూ చూశారు. రెండు ఓటములతో వెనుకబడినట్లు కనిపించిన జట్టును వరుసగా ఏడు విజయాలతో ఫైనల్‌కు చేర్చాడు. ఇదంతా ఒకెత్తు అయితే అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్‌ను ఫైనల్స్‌లో దెబ్బ కొట్టాడు. ఈ మొత్తం ప్రాసెస్‌లో కమిన్స్‌ మాస్టర్‌ మైండ్‌ బాగా పని చేసింది అని చెప్పాలి. తుది పోరులో తొలుత బౌలింగ్‌ తీసుకోవడం వెనుక ఆలోచన అప్పట్లో అర్థం కాక క్రికెట్‌ మైండ్స్ తలపట్టుకున్నాయి. పిచ్‌ను బాగా అంచనా వేయడం వల్లే కమిన్స్‌ అలా చేశాడు అని తర్వాత తెలిసింది. 

కేవలం కమిన్స్‌ను కెప్టెన్సీ కోసమే తీసుకుంది అంటే తప్పనే చెప్పాలి. ఎందుకంటే ఆసీస్‌కు అతనో ఫ్రంట్‌ లైన్‌ బౌలర్‌. లైన్‌, లెంగ్త్‌ అతని ఆయుధాలు. ఎలాంటి బ్యాటర్‌ను అయినా, ఏ ఫార్మాట్‌లో అయినా తన వెపన్స్‌ వాడి బోల్తా కొట్టిస్తాడు. టీ20ల్లోనే తీసుకుంటే... 50 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో గతంలో ఆరు సీజన్లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐదు మ్యాచులకు అందుబాటులో ఉన్న కమిన్స్ ఏడు వికెట్లతో రాణించాడు. బ్యాటింగ్‌ పరంగా కమిన్స్‌ ఇప్పటివరకు టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే తనదైన రోజున బ్యాట్‌తో విరుచుకుపడటం గతంలో చూశాం. 

రజనీకాంత్‌ మాటల ప్రభావమా?

హైదరాబాద్‌ సంగతి చూస్తే... ఐపీఎల్‌ తొలి సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత 2016లో విజేతగా నిలిచింది. అక్కడి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్స్‌కు రాలేకపోయింది. జట్టు వీరాభిమానులు సైతం ఈ విషయంలో నిరాశతోనే ఉన్నారు. మొన్నామధ్య ‘జైలర్‌’ ప్రచార కార్యక్రమంలో ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ కూడా ‘ఇలా వరుసగా హైదరాబాద్‌ ఓడిపోవడం... యజమాని కావ్యా మారన్‌ బాధపడటం చూడలేకపోతున్నా’ అని అన్నారు. సరైన ప్లేయర్లను వేలంలో తీసుకుని గెలవాలి అంటూ సూచన చేశారు. ఆ మాటల ప్రభావమో ఏమో భారీ ధరతో అదిరిపోయే ప్లేయర్‌ను కొనుగోలు చేసింది హైదరాబాద్‌. అన్నట్లు ప్రపంచకప్‌ హీరో ట్రావిస్‌ హెడ్‌ను కూడా తీసుకున్నారు. 

ఇక హైదరాబాద్‌ టీమ్‌ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటివరకు ఎక్కడా వార్తల్లేవు, లీకులూ లేవు. అయితే ఇంత మొత్తం పెట్టి కమిన్స్‌ను దక్కించుకోవడం వెనుక అసలు కారణం కెప్టెన్సీనే అని చెప్పొచ్చు. వేలం తర్వాత ఈ విషయంలో పూర్తి స్పష్టత రావొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని